Venezuela Reward Gonzalez | ఎన్నికల్లో ఓడిపోతే చాలామంది ఎన్నికలు సరిగా జరగలేదని గొడవ చెయ్యడం సహజమే. ప్రజాస్వామ్యం అమల్లో ఉన్న దేశాల్లో చాలాచోట్ల కనిపించే కథే ఇది. అయితే దీన్ని మరో మెట్టు పైకి తీసుకెళ్లింది వెనెజులా ప్రభుత్వం. ఓటమిని ఒప్పుకోకుండా తామే గెలిచామని చెప్పిన ప్రతిపక్ష నేతపై ఏకంగా ‘వాంటెడ్’ పోస్టర్లు విడుదల చెయ్యడానికి రెడీ అయింది.
వెనెజులా దేశం ప్రస్తుతం చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఆయిల్ నిల్వలు బాగా ఉన్న ఈ దేశం ఆర్థిక ఇబ్బందుల్లో పడటానికి కారణం ఆ దేశాధ్యక్షుడు నికోలస్ మడురోనే అని చాలామంది విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే గతేడాది జూలై నెలలో ఆ దేశంలో ఎలక్షన్స్ జరిగాయి. ఈ ఎన్నికల ఫలితాల్లో ఎన్నికల ఆఫీసర్లు అంతా మోసం చేసి అధికార పార్టీకే విజయం కట్టాబెట్టరని తీవ్ర విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా ప్రతిపక్ష నేత గోంజాలెస్ ఉర్రుట్ల చాలా పెద్ద గొడవే చేశారు.
Also Read: పాత బట్టలు.. సెకండ్ హ్యాండ్ వాహనాలు.. పేదల్లా బతుకుతున్న కోటీశ్వరులు?
తమ దగ్గర మొత్తం పోలింగ్ డేటా ఉందని, ఎన్నికల్లో గెలిచింది తామేనని వాదించారు. ఆయన పార్టీ కూడా ఉర్రుట్ల ఈ ఎన్నికల్లో ఏకపక్ష విజయం సాధించారని ప్రకటించింది. వచ్చే జనవరి 10న తనే దేశాధ్యక్షుడిగా ప్రమాణం చేస్తానని కూడా ప్రకటించారు. అయితే ప్రస్తుత అధ్యక్షుడు మడురోకు మిలటరీ మద్దతు ఉండటంతో.. గోంజాలెస్ ఉర్రుట్ల దేశం నుంచి పారిపోయారు. డిసెంబరు 20న ఆయనకు స్పెయిన్ ఆశ్రయం ఇచ్చింది. తాజాగా అక్కడి నుంచి తను అర్జెంటీనాకు వెళ్తున్నానని గోంజాలెస్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
అలాగే వెనెజులా ప్రజలను కూడా మరుడోకు వ్యతిరేకంగా నిరసనలు చేయాలని పిలుపునిచ్చారు. అయితే ఇది చూసిన వెనెజులా ప్రభుత్వం వెంటనే.. ఉర్రుట్లపై వాంటెడ్ పోస్టర్లు విడుదల చేసింది. అతని గురించి సమాచారం ఇచ్చిన వారికి ఏకంగా లక్ష డాలర్లు అంటే మన రూపాయల్లో సుమారు రూ.85 లక్షలు ఇస్తామని ప్రకటించింది. ఈ క్రమంలోనే తొలిసారి ఉర్రుట్ల ఫొటోను కూడా పబ్లిక్ చెయ్యాలని డిసైడ్ అయిందట.
ఇప్పటి వరకు మరుడో ఎన్నికను కేవలం రష్యా వంటి కొన్నిదేశాలే గుర్తించాయి. అమెరికా, యూరప్ దేశాలేవీ మరుడో ఎన్నికను గుర్తించలేదు. ఈ ఇష్యూ ఎంత పెద్దది అయిందంటే.. మరుడో ఎన్నికను వ్యతిరేకిస్తూ వెనెజులా ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు చేశారు. వీరిపై మరుడో ప్రభుత్వం పోలీసు బలంతో అణచివేసింది. ఈ గొడవల్లో ఏకంగా 28 మంది చనిపోగా, 200 మంది గాయపడ్డారు. మొత్తం 2400 మంది అరెస్టవగా.. వారిలో 1400 మందిని ఇప్పటికే వదిలేశారు. మిగతా వెయ్యి మంది ఇంకా జైల్లో ఉన్నారు.
ఈ ఆందోళనలను పోలీసులు, మిలటరీ బలంతో అణచివేస్తున్న మరుడో.. జనవరి 10వ తేదీన మరోసారి వెనెజులా అధ్యక్షుడిగా ప్రమాణం చెయ్యడానికి రెడీ అవుతున్నారు. దేశంలో తనకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న వారిపై ఉక్కుపాదంతో అణిచివేస్తున్నారు. అదే జరిగితే మరో ఆరేళ్లు ఆ దేశాధ్యక్షుడిగా మరుడో కొనసాగనున్నారు. మరి అర్జెంటీనా, యూఎస్, యూరప్ దేశాల అండతో ఉర్రుట్ల వచ్చి వెనెజులా అధ్యక్షుడిగా ప్రమాణం చేస్తారేమో చూడాలి.