భారత్ పేద దేశమా, ధనిక దేశమా..? సింపుల్ గా చెప్పాలంటే పేదలు, ధనికుల మధ్య అంతరం చాలా ఎక్కువగా ఉన్న దేశం. అభివృద్ధి చెందుతూనే ఉన్న దేశం. ఇటీవల ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ కలిగిన దేశంగా భారత్ ఓ అరుదైన ఘనత సొంతం చేసుకుంది. దానికి కొనసాగింపుగా ఇప్పుడు మరో ఘనత భారత్ కి దక్కింది. భారత్ లో తీవ్ర పేదరికం రేటు 27.1 శాతం నుంచి 5.3 శాతానికి భారీగా తగ్గిందంటూ తాజాగా ప్రపంచ బ్యాంకు నివేదిక వెల్లడించింది. 2011-12 లో 344.47 మిలియన్ల మంది భారతీయులు తీవ్ర పేదరికంలో ఉండగా ఇప్పుడా సంఖ్య కేవలం 75.24 మిలియన్లకు పడిపోయినట్టు తెలుస్తోంది. అంటే ఈ నివేదిక ప్రకారం భారత్ పేదరికం నుంచి బయటపడినట్టే లెక్క.
మోదీ మాయేనా..?
ప్రధాని మోదీ మంచి ప్రచార కర్త, ఆ వ్యూహంతోనే పేదరికం తగ్గినట్టు ప్రపంచ బ్యాంకునే నమ్మించగలిగారనే విమర్శలు వినపడుతున్నాయి. ఈ స్థాయిలో భారత్ లో పేదరికం తగ్గిందంటే మనం నమ్మగలమా..? అదే నిజమైతే దేశంలో ఆకలి చావులు ఉంటాయా..? బాలకార్మికులు ఉంటారా..? అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు ఉంటాయా..? ఇవన్నీ ఉన్నాయంటే భారత్ లో పేదరికం తగ్గినట్టేనా..? మరి ప్రపంచ బ్యాంకు ఏ ప్రాతిపదికన భారత్ లో పేదరికం తగ్గినట్టు చెబుతోంది.
పెరిగిన ఖర్చులు..
గతంతో పోల్చి చూస్తే ఇప్పుడు సగటు భారతీయుడి ఖర్చు పెరిగిందట. ఆ పెరిగిన ఖర్చుని లెక్కగట్టి పేదరికం తగ్గిందని ప్రపంచ బ్యాంక్ నివేదిక చెబుతోంది. ఖర్చు ప్రాతిపదికన గతంలో 344.47 మిలియన్ల మంది పేదరికంలో ఉంటే.. ఇప్పుడు జస్ట్ 75.24 మిలియన్ల మంది మాత్రమే పేదరికంలో ఉన్నట్టు సర్వే చెబుతోంది. 2017 ధరల ఆధారంగా తీవ్ర పేదరికంలో నివశిస్తున్నవారి శాతం గతంలో 16.2 గా ఉంటే, ఇప్పుడది 2.3 శాతంగా ఉందని అంటున్నారు. గత 11 సంవత్సరాలలో గ్రామీణ పేదరికం 18.4 శాతం నుండి 2.8 శాతానికి తగ్గిందని, పట్టణ పేదరికం 10.7 శాతం నుండి 1.1 శాతానికి తగ్గిందని అంటున్నారు.
ఆహా ఓహో..
ప్రపంచ బ్యాంకు నివేదికతో బీజేపీ పండగ చేసుకుంటోంది కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం 11 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ ఫలితాలు తమ పనితీరుకి నిదర్శనంగా మారాయని అంటున్నారు బీజేపీ నేతలు. పేదరికం నుండి ప్రజలను బయటకు తీసుకు రావడానికి కేంద్రం తీసుకున్న చర్యలకు ఫలితం దక్కిందని చెబుతున్నారు. ప్రధాని మోదీ చలవే ఇదంతా అని బీజేపీ నేతలు ఊదరగొడుతున్నారు.
అసలు పేదరికం అంటే ఏంటి..? అత్యంత పేదరికం అంటే ఏంటి..? భారత దేశంలో చాలామందికి సెల్ ఫోన్లు ఉన్నాయి, అందరూ విచ్చలవిడిగా డేటా వాడేస్తున్నారు అంటే వారంతా పేదరికంలో లేనట్టా..? జన్ ధన్ ఖాతాలు తెరిచేశామని చంకలు గుద్దుకున్నంత మాత్రాన బ్యాంక్ ఖాతా ఉన్నవారంతే పేదరికంనుంచి బయటపడ్డట్టేనా..? ఇలాంటి పోలికలతోనే ప్రజల్ని మభ్యపెడుతోంది ఎన్డీఏ ప్రభుత్వం. అంతర్జాతీయ నివేదికలను కూడా ఇలాంటి వ్యవహారాలతోనే తారుమారు చేస్తోంది. వాస్తవానికి పేదరికం ఇంకా అంతం కాలేదు. అలాగని అది ప్రస్తుతం అతి పెద్ద సమస్యగానూ లేదు. అంతకు మించి పెద్ద సమస్యలను ప్రభుత్వం పెంచి పోషిస్తోంది. మత విద్వేషాలను రెచ్చగొడుతోంది, ఆయా సమస్యల ముందు పేదరికాన్ని చిన్నదిగా చేసి చూపిస్తోంది. ఆ మాయ పొరలు కమ్మినంత కాలం మనం పేదరికం నుంచి బయటకు వచ్చినట్టే లెక్క.