Modi in Maharastra : మహారాష్ట్రలో మరోసారి మహాయుతి ప్రభుత్వం రావాలని ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారని ప్రధాని మోదీ అన్నారు. తమ కూటమి ప్రభుత్వ పనితీరుపై ఇక్కడి ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్నారు. సమాజంలోని ప్రతీ వర్గానికి సాధికారత కల్పించడమే తమ లక్ష్యమన్న ప్రధాని మోదీ.. అఘాడీ కూటమి కంటే తమది భిన్నమైన అభివృద్ధి పంథా అని ప్రకటించారు.
మేరా బూత్ సబ్సే మజ్ బూత్ కార్యక్రమంలో భాగంగా.. మహారాష్ట్రకు చెందిన బీజేపీ కార్యకర్తలతో సమావేశమైన మోదీ.. మరోసారి మహారాష్ట్రలో బీజేపీ కూటమి విజయం సాధిస్తుందంటూ భరోసా కల్పించారు. 2.5 ఏళ్ల మహాయుతి ప్రభుత్వ హయంలో మహారాష్ట్ర ప్రజలకు మంచి పరిపాలన అందించారని ప్రశంసించిన మోదీ.. ప్రజలు సైతం అత్యంత సంతృప్తిగా ఉన్నారన్నారు. అందుకే..రానున్న ఐదేళ్లు మనమే ఉండాలని ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారంటూ ప్రకటించారు.
ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తల కృషిని ప్రశంసించిన ప్రధాని మోదీ.. మీ అవిశ్రాంతి ప్రయత్నాల వల్లే పార్టీ ఈ తీరుగా బలపడింది అంటూ అభినందనలు తెలిపారు. నెలల తరబడి పార్టీ కోసం కార్యకర్తల పడిన కష్టాలకు ప్రతిఫలం మరికొన్ని రోజుల్లోనే వస్తుందన్నారు. అయితే.. ఎలక్షన్ల వరకు ఇలానే కృషి చేయాలంటూ కార్యకర్తలకు కర్తవ్య బోధ చేశారు.
కాగా.. మహారాష్ట్రలో పోటీ అంతా రెండు కూటముల మధ్యనే ఉంది. ఇందులో మహాయుతి కూటమిలో భారతీయ జనతా పార్టీ (బిజెపి), ఏక్‌నాథ్ షిండే శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) ఉన్నాయి. మరోవైపు, ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి (MVA)లో కాంగ్రెస్, ఉద్ధవ్ థాకరేకి చెందిన శివసేన (UBT), శరద్ పవార్ వర్గానికి చెందిన NCP (SP), అఖిలేష్ యాదవ్ సమాజ్ వాదీ పార్టీ (SP), ఇతర కొన్ని చిన్న పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి.
Also Read : మావోలకు మరో దెబ్బ.. చత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్
మహాయుతి కూటమిలో BJP అత్యధికంగా 148 స్థానాల్లో పోటీ చేస్తోంది. షిండే వర్గానికి చెందిన శివసేన 85 స్థానాలలో, అజిత్ పవార్ నేతృత్వంలోని NCP వర్గం 55 స్థానాల్లో పోటీ చేస్తోంది. మహా అఘాడీ వర్గంలో కాంగ్రెస్ 102 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన (UBT) 94 స్థానాల్లో, శరద్ పవార్ వర్గానికి చెందిన NCP (SP) 85 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని నిలబెట్టింది. అఖిలేష్ యాదవ్ కు చెందిన ఎస్పీ (SP) తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను నిలబెట్టగా.. మిగతా పార్టీలు 4 స్థానాల్లో పోటీ చేస్తున్నారు.