Priyanka Gandhi: లోక్ సభ ఎన్నికల్లో తాను ఎందుకు పోటీ చేయలేదనే అంశంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వివరణ ఇచ్చారు. దేశ వ్యాప్తంగా పార్టీ తరపున ప్రచారం చేసేందుకే తాను ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తెలిపారు. సోదరుడు రాహుల్ గాంధీతో పాటు తాను కూడా పోటీ చేస్తే బీజేపీకి లాభం చేకూరుతుందని ప్రియాంక గాంధీ అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె పలు అంశాలకు సంబంధించి వివరణ ఇచ్చారు.
గత 15 ఏళ్లుగా తాను రాయ్ బరేలీలో ప్రచారం చేస్తున్నానని ప్రియాంక గాంధీ చెప్పారు. గాంధీ కుటుంబానికి రాయ్ బరేలీతో ఎంతో అనుబంధం ఉందన్నారు. అందుకే తాము ప్రజలతో కలిసి మాట్లాడాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. రిమోట్ కంట్రోల్ ద్వారా రాయ్ బరేలి ఎన్నికలను గెలవలేరని ఎద్దేవా చేశారు.
తాను లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే కనీసం 15 రోజులు తన నియోజకవర్గంలో ప్రచారం చేసుకునేందుకు సమయం కేటాయించాల్సి వచ్చేదని తెలిపారు. అప్పుడు దేశమంతా ప్రచారం చేయడానికి వీలు ఉండేది కాదని అన్నారు. అయితే భవిష్యత్తులో పోటీ చేస్తారా లేదా అన్న విషయంపై క్లారిటీ ఇవ్వలేదు.
ఇదిలా ఉంటే ఎన్నికల్లో పోటీ చేయాలని తాను ఎప్పుడూ అనుకోలేదని ప్రియాంక గాంధీ చెప్పారు. పార్టీ కోసం ప్రజలు తాను ఏది చేయాలని కోరితే అదే చేస్తానని తెలిపారు. తాను ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకుంటే పోటీ చేస్తానని స్పష్టం చేశారు.
Also Read: భావోద్వేగానికి గురైన రాహుల్ గాంధీ
మరో వైపు అమేథీ, రాయ్ బరేలీలో పోటీ నుంచి పారిపోతున్నారంటూ బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలపై ఆమె స్పందించారు. అమేథీ, రాయ్ బరేలీలను కాంగ్రెస్ వదిలి పెట్టదని తెలిపారు. గుజరాత్ లోని వడోదరలో మోదీ ఎందుకు పోటీ చేయడం లేదని ప్రియాంక ప్రశ్నించారు. గుజరాత్ నుంచి ఆయన పారి పోయారా అని అన్నారు.