Rajni Bector: కరాచీలో పుట్టారు రజినీ బెక్టర్.. చిన్నతనంలో లాహోర్‌లో ఉన్న కుటుంబం.. ఆ తర్వాత ఢిల్లీకి వచ్చి స్థిరపడింది. అక్కడే ఆమె డిగ్రీ పూర్తి చేశారు. 17 ఏళ్ల వయసులో లుధియానాకు చెందిన ధరంవీర్ బెక్టర్‌ను వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత పిల్లలు.. కుటుంబ బాధ్యతలు.. అదే సమయంలో బేకింగ్, వంటపై ఆసక్తి. ఈ ఆసక్తినే తన బలంగా మార్చుకున్నారు రజినీ. పంజాబ్ యూనివర్సిటీలో బేకింగ్ శిక్షణ తీసుకున్నారు. ఇంట్లోనే ఐస్‌క్రీమ్‌లు.. కేకులు.. కుకీలు తయారు చేసి మొదట స్నేహితులు, బంధువులకు ఉచితంగా ఇచ్చారు. రుచి నచ్చడంతో ఆర్డర్లు రావడం మొదలైంది. ఆ ఆర్డర్ల కోసం ఆమె చేసిన తొలి పెట్టుబడి.. కేవలం 300 రూపాయలు. ఆ డబ్బుతో ఓవెన్ కొనుగోలు చేసి కేకులు, కుకీల తయారీ మొదలుపెట్టారు.
అప్పటివరకు ఇంటి నుంచి మొదలైన వ్యాపారం.. ఇప్పుడు పెద్ద సంస్థల దృష్టిని ఆకర్షించింది. 1990లలో భారత్‌లోకి మెక్‌డొనాల్డ్స్ ప్రవేశించడంతో రజినీ బెక్టర్‌కు భారీ అవకాశం వచ్చింది. 1996లో మెక్‌డొనాల్డ్స్‌కు బర్గర్ బన్స్ సరఫరా చేయడం ప్రారంభించారు. అక్కడి నుంచి వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. క్వేకర్ ఓట్స్‌తో కలిసి జాయింట్ వెంచర్ ఏర్పాటు చేశారు. కెచప్, మిల్క్‌షేక్‌లు, మయోన్నైస్ వంటి ఉత్పత్తుల్లోకి కూడా అడుగుపెట్టారు.
చిన్నగా మొదలైన వ్యాపారం.. ఇప్పుడు పెద్ద సంస్థగా రూపాంతరం చెందింది. మిసెస్ బెక్టర్ ఫుడ్ స్పెషాలిటీస్ లిమిటెడ్.. క్రీమికా.. ఇంగ్లీష్ ఓవెన్.. వంటి బ్రాండ్లతో మార్కెట్‌లో తనదైన గుర్తింపు తెచ్చుకుంది. బోర్బన్, క్రాకర్ వంటి బిస్కెట్ల నుంచి.. పెద్ద ఫుడ్ చైన్లకు బర్గర్ బన్స్ వరకు.. ఉత్పత్తుల విస్తృతి పెరిగింది. మెక్‌డొనాల్డ్స్ మాత్రమే కాదు కేఎఫ్‌సీ, బర్గర్ కింగ్ వంటి సంస్థలకు కూడా బన్స్ సరఫరా చేసే స్థాయికి ఎదిగింది. 2026 ఆగస్టు 24 నాటికి కంపెనీ మార్కెట్ విలువ 7,890 కోట్లకు చేరింది.
Also Read: మళ్లీ అధికారంలోకి వచ్చేది మేమే.. టీపీసీసీ భేటీలో మంత్రి ఉత్తమ్ ధీమా!