Ram Mandir Donation Theft Case: అయోధ్యలోని శ్రీరామ మందిర విరాళాల దొంగతనం కేసు అనేక మలుపులు తిరుగుతోంది. సిట్ దర్యాప్తులో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అరెస్టయిన ఎనిమిది మంది నిందితులు నగదును ఎలా దొంగిలించారో కళ్లకు కట్టినట్టు అధికారులు వెల్లడించారు. భక్తుల ఇచ్చిన విరాళాలను మూడో కంటికి కనిపించకుండా బయటకు తరలించినట్టు వివరించారు. ఈ క్రమంలో విరాళాలను లెక్కించడానికి ఆలయం విభాగం అనుసరించిన ప్రక్రియపై ఫోకస్ చేశారు.
శ్రీరామ మందిర విరాళాల కేసు కొత్త విషయాలు
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలోని శ్రీరామ మందిర విరాళాల దొంగతనం కేసు రాజకీయ రంగు పులుముకుంది. ఈ కేసుపై సిట్ విచారణ చేస్తుండగా అధికార -విపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరింది. ఒకరిపై మరొకరు విమర్శలు సంధించుకుంటున్నారు. విరాళాల చోరీ కేసు దర్యాప్తులో కొత్త విషయాలు బయటకువచ్చాయి.
సిట్ అదుపులో వున్న ఎనిమిది మంది నిందితుల్లో అవినాశ్ శుక్లాను పోలీసులు విచారించారు. చోరీ చేసిన నగదు సీసీటీవీ కెమెరాల కంటపడకుండా బాత్రూమ్‌లో దాచినట్టు తెలిపాడు. ఆ తర్వాత అవకాశం చూసుకుని బయటకు తరలించినట్టు తెలిపారు. ఈ విషయాన్ని పోలీసు వర్గాలు వెల్లడించాయి.
హుండీల్లో నిధుల లెక్కింపు.. ఆపై బ్యాంకులో జమ
విరాళాల లెక్కింపులో ఆలయ ట్రస్టీ అనిల్‌మిశ్రా కీ రూల్ పోషించేవాడని అవినాశ్ చెప్పాడట. విరాళాల లెక్కింపు గదికి రెండు తాళాలు ఉండేవి. ఒకటి రామశంకర్ అలియాస్ టిన్నూ యాదవ్ వద్ద ఉండేది. మరొకటి బ్యాంకు సిబ్బంది వద్ద ఉండేది. అందరు కలిసి చోరీకి పక్కాగా ప్లాన్ చేసినట్టు వివరించాడట.
ఒకరు నగదు సైడ్ చేస్తుంటే.. మరొకరు వేరేవాళ్లకు కనిపించకుండా అడ్డుగా నిలిచేవారని తెలుస్తోంది. ఆలయ ప్రాంగణంలో సీసీటీవీ కెమెరాలు ఉన్నాయో తమకు ముందే తెలుసన్నాడు. వాటికి కనిపించకుండా కదిలి సైలెంట్‌గా భక్తుల విరాళాలు దొంగలించినట్టు చెప్పుకొచ్చాడు.
సీసీటీవీ పర్యవేక్షణ ఉన్నప్పటికీ తమ కదలికలను ఎవరూ గమనించలేదని, చోరీ చేసిన సొమ్ముతో భూములు-ఇల్లు కొనుగోలు చేసినట్లు నిందితుడు అంగీకరించినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో నిందితుల ఆస్తులు, బ్యాంకు లావాదేవీలపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. దీంతో ఆలయ ఆర్థిక వ్యవహారాలను ఎలా జరుగుతున్నాయో వెలుగులోకి వచ్చింది.
విరాళాలను ఎలా సేకరిస్తుందనే విషయం బయటపడింది. ఆలయ ప్రాంగణంలో సుమారు 40 నుంచి 50 విరాళాల భారీ బాక్సులను ఏర్పాటు చేశారు. భక్తులు తమ నగదు విరాళాలను బాక్సుల్లో వేసేవారు. పెద్ద లేదా విలువైన ఆభరణాలను విరాళంగా ఇవ్వాలనుకునేవారు నేరుగా ట్రస్ట్ కార్యాలయంలో జమ చేసే అవకాశం ఉంది. ఆభరణాలు లేదా ఇతర కానుకలను స్వీకరించిన తర్వాత ఆ కార్యాలయం అధికారులు రసీదు ఇచ్చేవారు.
విరాళాలను లెక్కించే బాధ్యతను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖకు అప్పగించింది. ఈ లెక్కింపు బృందంలో ఒక ఎస్బీఐ సిబ్బంది, వారణాసికి చెందిన ఒక ఏజెన్సీ ఉద్యోగులు, ట్రస్ట్‌కు చెందిన కొందరు వ్యక్తులు ఉండేవారు. విరాళాల లెక్కింపు రోజుకు రెండుసార్లు జరుగుతుంది. ఇది చాలా సుదీర్ఘమైన ప్రక్రియ. విరాళాల పెట్టెలను తెరిచిన తర్వాత నగదును తాళం వేసిన ఇనుప కంటైనర్లలోకి బదిలీ చేసేవారు.
ఆ తర్వాత వాటిని లెక్కింపు హాలుకు తరలిస్తారు. అక్కడ సిబ్బంది కరెన్సీ నోట్లు-నాణేలు-ఆభరణాలను వేరు చేసేవారు. ఆ వస్తువులను వివిధ టెల్లర్లకు పంపిణీ చేసేవారు. వారంతా ఉన్నతాధికారుల పర్యవేక్షణలో వేర్వేరు కౌంటర్ల వద్ద లెక్కించేవారు. డబ్బు లెక్కించిన తర్వాత ఒక వ్యాన్ ద్వారా బ్యాంకుకు తరలిస్తారు. బ్యాంకు ధృవీకరణ అనంతరం ఆ డబ్బును రామ జన్మభూమి క్షేత్ర తీర్థ ట్రస్ట్ విరాళ ఖాతాలో జమ చేస్తారు.