Sanjay Jaju: స్వేచ్ఛ బ్యూరో: కొత్త చీఫ్ సెక్రటరీగా సంజయ్ జాజు బాధ్యతలు చేపట్టినప్పటికీ, ప్రభుత్వాన్ని సజావుగా నడపడంలో సవాళ్లను ఎదుర్కొవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవైపు ప్రభుత్వ ఆశయాలు, మరోవైపు క్షేత్రస్థాయి సవాళ్లు. వీటన్నింటి మధ్య కొత్త సీఎస్ ప్రయాణం కత్తిమీద సాములా మారబోతోందా? అంటే ‘అవును’ అనే సమాధానమే వినిపిస్తోంది. ముఖ్యంగా ప్రస్తుతం సీఎస్ గా బాధ్యతలు తీసుకున్న సంజయ్ జాజు ఢిల్లీ నుంచి తెలంగాణకు తాజాగా వచ్చారు. తెలంగాణ కేడర్ చెందిన ఆఫీసర్ అయినప్పటికీ, ఇంత కాలం కేంద్ర సర్వీస్ లో పనిచేశారు. రీసెంట్ గా కేంద్రం రిలీవ్ చేయడంలో స్టేట్ కు వచ్చి సీఎస్ గా బాధ్యతలు తీసుకున్నారు. అయితే సీఎస్ పోస్టు కోసం స్టేట్ లో చాలా కాలం నుంచి పనిచేస్తున్న సీనియర్ ఐఏఎస్ లు తీవ్రంగా ప్రయత్నించారు.
ముఖ్యంగా వికాస్ రాజ్, జయేష్ రంజన్ లు అత్యధికంగా ప్రయత్నించారు. కానీ అనూహ్యంగా సంజాయ్ జాజు పేరును ఫైనల్ చేశారు. దీంతో సెక్రటేరియట్ లో అంతా అవాక్కవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. కొత్త సీఎస్ రాకతో సచివాలయంలోని సీనియర్ ఐఏఎస్ లలో ఒక రకమైన స్తబ్దత ఆవరించినట్లు ప్రచారం జరుగుతుంది. సుదీర్ఘకాలంగా ఇక్కడే ఉంటూ, కీలక శాఖలను శాసిస్తున్న పాత అధికారులు కొత్త సీఎస్ లైన్ ఆఫ్ యాక్షన్‌కు ఏ మేరకు అలవాటు పడతారనే దానిపై చర్చ జరుగుతుంది. తమ ప్రాధాన్యత ఎక్కడ తగ్గిపోతుందోనని కొందరు, కొత్త బాస్ వేగాన్ని అందుకుంటామా? అని మరి కొందరు సీనియర్ ఐఏఎస్ లు అంతర్గతంగా మథనపడుతున్నట్లు తెలిసింది. మరోవైపు తమకు సీఎస్ పోస్టు దక్కలేదని భావిస్తున్న సీనియర్ అధికారులు కూడా కొత్త సీఎస్ కు సహకరిస్తారా? లేదా? అనే చర్చ కూడా జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త సీఎస్ తమ పరిపాలనను ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తారనేది ? అందరిలోనూ ఆసక్తికరంగా మారింది.
రాష్ట్ర బ్యూరోక్రసీలోనూ గ్రూపు రాజకీయాలు కొనసాగుతున్నట్లు సెక్రటేరియట్ లో చర్చ. సీనియార్టీ వర్సెస్ జూనియార్టీ, లోకల్ వర్సెస్ నాన్-లోకల్, గత ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నవారు వర్సెస్ ఇప్పుడు ప్రాధాన్యత కోరుకుంటున్నవారు. ఇలా ఐఏఎస్ అధికారుల మధ్య స్పష్టమైన చీలికలు ఉన్నట్లు స్వయంగా అధికారుల మధ్యే డిష్కషన్. ఇలాంటి పరిస్థితుల్లో ఈ గ్రూపుల మధ్య సమన్వయం కుదర్చడం కొత్త సీఎస్‌కు మొదటి సవాల్. ఒక గ్రూపునకు ప్రాధాన్యం ఇస్తే, మరో గ్రూపు అసహకార ఉద్యమానికి దిగే ప్రమాదం ఉంది. అందరినీ ఒకే తాటిపైకి తెచ్చి టీమ్ వర్క్ చేయించడం సామాన్యమైన విషయం కాదనేది అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్లు చెబుతున్నారు. పైగా ఢిల్లీ డెప్యుటేషన్ ముగించుకుని కేంద్ర సర్వీసుల నుంచి నేరుగా రాష్ట్ర పీఠంపై కూర్చున్న కొత్త సీఎస్‌కు క్షేత్రస్థాయి సమీకరణాలపై పట్టు సాధించడానికి కొంత సమయం పడుతుంది. ఢిల్లీ పరిపాలనా శైలి వేరు, ఇక్కడి రాజకీయ, సామాజిక సమీకరణాల తీరు వేరు అని సెక్రటేరియట్ లోని ఓ అధికారి తెలిపారు. ఇక్కడి స్థానిక సమస్యలు, రాజకీయ ఒత్తిళ్లు, క్షేత్రస్థాయిలో ఉన్న లూప్‌హోల్స్ పై తక్షణమే అవగాహన పెంచుకోకపోతే ఫైళ్ల కదలికల్లో ఆలస్యం తప్పదని చెబుతున్నారు.
Also read: Jahnavi Missing Case: జాహ్నవి మిస్సింగ్ కేసు.. పోలీసులు కీలక ప్రకటన, ఆచూకీ చెబితే లక్ష బహుమతి
పరిపాలనను పట్టాలెక్కించడంతో పాటు, ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవడంలో కొత్త సీఎస్ ముందు ఐదు ప్రధాన సవాళ్లు నిలిచి ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేదు. సంక్షేమ పథకాలకు, అభివృద్ధి పనులకు నిధుల సమీకరణ ఎలా చేయాలనేది సవాల్ గా మారనున్నది. అప్పుల పరిమితి, కేంద్ర గ్రాంట్ల సాధనపై కొత్త సీఎస్ ఢిల్లీ పరిచయాలను ఏ మేరకు వాడుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఇక నిరుద్యోగుల నుంచి వస్తున్న రిక్రూట్ మెంట్ ఒత్తిడి, నోటిఫికేషన్ల జారీ, కోర్టు కేసుల చిక్కులు లేకుండా రిక్రూట్‌మెంట్ ప్రక్రియను వేగవంతం చేయడం పెద్ద టాస్క్ గా మారనున్నది.
మరోవైపు పాలకపక్షం ఇచ్చిన హామీలు, మ్యానిఫెస్టో లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాల్సి ఉంది. దీంతో సీఎం ఆలోచనలకు తగ్గట్టుగా విధివిధానాలు రూపొందించే భారం అంతా సీఎస్ దే కానున్నది. ఇక ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి ఎలా వెళ్తున్నాయి? క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి ఎలాంటి ఫీడ్‌బ్యాక్ వస్తోంది? అనే దాన్ని బట్టి ప్రభుత్వ గ్రాఫ్ మారుతుంది. అడ్మినిస్ట్రేషన్ ను ప్రజలకు మరింత చేరువ చేయడంలో పాత పద్ధతులను మార్చాల్సి ఉంటుంది.ఇలాంటి సిచ్వేషన్ లో కొత్త సీఎస్ తీసుకునే విధానాలు ఎలా ఎండబోతున్నాయి? ఏం చేయబోతున్నారు? అనే తదితర అంశాలపై ఉద్యోగుల్లో విస్తృతంగా చర్చ జరుగుతుంది.
Also Read: ‘గొడ్డలి పార్టీ’ని తరిమికొట్టండి.. నెల్లూరు వేదికగా చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!