Sabarimala Temple : శబరిమల అయ్యప్పస్వామి ఆలయానికి ఏటా భారీగా భక్తులు పోటెత్తుతారు. ఈ ఏడాది కూడా అదేస్థాయిలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్నాటక నుంచి భారీగా అయ్యప్పమాలధారులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. దీంతో 41 రోజులపాటు ఆలయప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది.
ముగిసిన మండల పూజ
శబరిమల అయ్యప్ప ఆలయంలో 41 రోజులపాటు మండల పూజలు జరిగాయి. ముగింపు ఉత్సవాన్ని మంగళవారం వైభవంగా నిర్వహించారు. ప్రధాన పూజారి కందరారు రాజీవర్ నేతృత్వంలో మణికంఠుడి విగ్రహానికి బంగారు వస్త్రం అలంకరించారు. కలశాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేల మంది భక్తులు, ట్రావెన్‌కోర్ బోర్డ్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంగళవారం రాత్రి భక్తుల దర్శనం అనంతరం ఆలయాన్ని మూసివేశారు.
భారీగా ఆదాయం
41 రోజులపాటు జరిగిన మండల పూజలకు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలిచ్చారు. అయ్యప్పస్వామికి మాలధారులు ఇరుముడులు సమర్పించారు. స్వామివారికి భారీగా కానుకలు అందించారు. భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. మండల పూజా సీజన్ లో మొత్తం 30 లక్షల మంది భక్తులు అయ్యప్పస్వామిని దర్శించుకున్నారని కేరళ దేవాదాయశాఖ మంత్రి రాధాకృష్ణన్ ప్రకటించారు. గత 39 రోజుల్లో ఆలయానికి రూ. 222.98 కోట్ల ఆదాయం వచ్చిందని ట్రావెన్ కోర్ బోర్డ్ వెల్లడించింది.
మళ్లీ తిరిగి తెరిచేది ఎప్పుడంటే..?
శబరిమలలో మండల పూజలు ముగిసిన తర్వాత మకరజ్యోతి ఉత్సవాలు జరగడం అనవాయితీ. డిసెంబర్ 30న సాయంత్రం 5 గంటలకు మకరజ్యోతి ఉత్సవాల కోసం హరిహర తనయుడి ఆలయాన్ని తిరిగి తెరుస్తారు. జనవరి 14న మకరవిలక్కు పూజలు నిర్వహిస్తారు. ఆ రోజు ఆలయ ప్రాంగణం పూర్తిగా భక్తులతో నిండిపోతుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా దేవస్థానం బోర్డు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తోంది. భక్తులకు అన్ని సౌకర్యాలను సమకూర్చేందుకు ప్రయత్నిస్తోంది. మకరజ్యోతి ఉత్సవాలు ముగిసిన తర్వాత జనవరి 20న శబరిమల అయ్యప్ప ఆలయాన్ని మూసివేస్తారు. దీంతో శబరిమల వార్షిక యాత్రా సీజన్ ముగుస్తుంది.