Donald Trump : డొనాల్డ్ ట్రంప్. ఈ పేరు వివాదాలకు కేరాఫ్ అడ్రస్. అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో నిత్యం ఏదో ఒక వివాదం ఆయన చట్టూ తిరిగేది. రెండుసార్లు అభిశంసన తీర్మానాన్ని ఎదుర్కొన్నారు. క్యాపిటల్ హిల్‌పై దాడి చేసేలా తన మద్దతుదారులను రెచ్చగొట్టారనే ఆరోపణలున్నాయి. అలాగే అధికారంలో ఉన్న సమయంలో కీలక పత్రాలు మిస్సింగ్ అంశంలో ట్రంప్ అభియోగాలు ఎదుర్కొంటున్నారు. పదవి నుంచి దిగిపోయిన తర్వాత వివాదాలు అలాగే కొనసాగుతున్నాయి. ఇప్పుడు మరోసారి అధ్యక్ష బరిలోకి దిగేందుకు ప్రయత్నిస్తున్న ట్రంప్ నకు షాక్ తగిలింది.
డొనాల్డ్ ట్రంప్ చుట్టూ ఉచ్చు బిగిసింది. ఆ దేశ చరిత్రలోనే నేరారోపణలు రుజువైన తొలి అధ్యక్షుడిగా నిలిచారు. తనతో లైంగిక సంబంధాలున్నాయని ఆరోపించిన మహిళను డబ్బుతో ప్రలోభపెట్టినట్లు ట్రంప్‌పై గతంలో ఆరోపణలు వచ్చాయి. 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచారం సమయంలో స్ట్రోమీ డానియల్స్ అనే పోర్న్‌స్టార్‌తో తనకున్న శారీరక సంబంధం బయటపడకుండా ఆమెకు డబ్బు ఇచ్చి అనైతిక ఒప్పందం చేసుకున్నారనే ఆరోపణలను ట్రంప్ ఎదుర్కొంటున్నారు. ఆ ఒప్పందాన్ని రద్దు చేయాలంటూ సదరు మహిళ రెండేళ్ల తర్వాత కోర్టును ఆశ్రయించింది. కానీ ట్రంప్ ఈ ఆరోపణలను ఖండించారు. తాను ఏ తప్పూ చేయలేదని ఇన్నాళ్లూ చెబుతూ వచ్చారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీ చేయాలనుకుంటున్న నేపథ్యంలోనే డెమొక్రాటిక్ ప్రాసిక్యూటర్ ద్వారా తప్పుడు విచారణ చేయిస్తోందని ఆరోపించారు.
తాజాగా న్యూయార్క్ గ్రాండ్ జ్యూరీ ట్రంప్ కు షాకిచ్చింది. నేరారోపణలను ధ్రువీకరించింది. ఈ కేసులో ట్రంప్ క్రిమినల్ ఛార్జ్‌లను ఎదుర్కొనున్నారు. ట్రంప్ లొంగుబాటుపై మన్‌హట్టన్ జిల్లా అటార్నీ.. ఆయన న్యాయవాదులతో చర్చించారు. ట్రంప్ లొంగిపోతే సుప్రీంకోర్టులో హాజరుపర్చే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఫ్లోరిడాలో ఉన్న ట్రంప్.. వచ్చే సోమవారం న్యూయార్క్ వెళతారని తెలుస్తోంది. మంగళవారం మన్‌హట్టన్ కోర్టులో హాజరయ్యే అవకాశాలున్నాయి. ఈ కేసు విచారణ జరుగుతున్న నేపథ్యంలో త్వరలోనే తనను అరెస్టు చేసే అవకాశం ఉందని ట్రంప్ ఇటీవల అనుమానం వ్యక్తం చేశారు. తాను అరెస్టయితే నిరసనలు తెలపపాలని రిపబ్లికన్ పార్టీ శ్రేణులకు పిలువునిచ్చారు. ఈ కేసులో ట్రంప్ అరెస్ట్ తప్పదా..? లేక లొంగుపోతారా..?