పహల్గామ్ లో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడులు చేశారు, మారణహోమం సృష్టించారు, పాయింట్ బ్లాంక్ నుంచి కిరాతకంగా కాల్చి చంపారు. ఈ దాడినుంచి యావత్ భారత దేశం తేరుకోడానికే కొన్నిరోజుల సమయం పట్టింది. ఈలోగా కేంద్ర ప్రభుత్వం జమ్మూకాశ్మీర్ సహా ఇతర సున్నిత ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేసింది. ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపేందుకు సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిస్తున్నట్టు ప్రకటించింది. ఉగ్రముఠాకు అండదండలు అందిస్తున్న పాకిస్తాన్ ని అష్టదిగ్బంధనం చేసేందుకు ఇతర ప్రయత్నాలు కూడా ప్రారంభించింది. అయితే అసలు ఈ దాడి జరక్కుండా మన ప్రభుత్వం ఎందుకు ఆపలేకపోయింది అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. సోషల్ మీడియాలో కొందరు ఇదే విషయంపై చర్చ మొదలు పెట్టారు.
దాడికి ముందు మనం ఏం చేస్తున్నాం..?
దాడి తర్వాత భారత ప్రభుత్వ ప్రతి స్పందన మనం ఊహించినట్టుగానే ఉంది. ఎక్కడా రాజీ పడకుండా కఠిన నిర్ణయాలు తీసుకుంటూ భారతీయ పౌరులకు భద్రత కల్పించడంలో నిమజ్ఞమైంది. మరి ఇదే సన్నద్ధత దాడికి ముందు ఏమైంది అనేది కొంతమంది ప్రశ్న. పహల్గామ్ దాడిని మనం ఎందుకు ముందుగానే పసిగట్టలేకపోయాం? మన ఇంటెలిజెన్స్ ఎలా ఫెయిల్ అయ్యింది? ఉగ్రవాదులు ఏడాదిగా అక్కడ రెక్కీ నిర్వహిస్తున్నారని కూడా అంటున్నారు. దాడికి కొన్నిరోజుల ముందే ప్లాన్ అమలు చేయాలనుకున్నా వర్షం కారణంగా వెనక్కి తగ్గారని, చివరకు పహల్గామ్ లో తూటాల వర్షం కురిసిందని కూడా అంటున్నారు. ప్లాన్-ఎ, ప్లాన్-బి.. అంటూ ఉగ్రవాదులు అన్నిరకాలుగా అలర్ట్ గా ఉంటే.. మన భారత ఇంటెలిజెన్స్ కి ఏమాత్రం సమాచారం లేకపోవడమేంటి..? అంటే ఆ విషయంలో మనం వైఫల్యం చెందామా..? ఈ ప్రశ్నలే సగటు భారతీయుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
నిఘా లోపం ఉందా..?
అప్పుడప్పుడు ఎన్ఐఏ బృందాలు వివిధ రాష్ట్రాల్లో స్లీపర్ సెల్స్ గా ఉన్న కొంతమందిని పట్టుకుంటాయి. అప్పటి వరకు ఇరుగుపొరుగు వారికి కూడా వారికి ఉగ్రవాదులతో సంబంధం ఉన్న విషయం తెలియదు. అలాంటి స్లీపర్ సెల్స్ ని నిఘా వర్గాలు గుర్తించి అరెస్ట్ చేస్తాయి. భారత ఇంటెలిజెన్స్ స్థాయి చూసి మనం ఔరా అనుకుంటాం. అలాంటి సమర్థత ఉన్న నిఘా విభాగం పహల్గామ్ విషయంలో ఎందుకు వెనకపడిందనేది అర్థం కాని విషయం. ఈ ఘటన తర్వాత పర్యాటకులు రికార్డ్ చేసిన రీల్స్, వారి వ్యక్తిగత వీడియోలే ఆధారాలుగా మారడం మరో విశేషం. అసలు అక్కడి సీసీ టీవీ ఫుటేజ్ లు ఇంతవరకు బయటకు రాలేదు. పోనీ సెక్యూరిటీ రీజన్స్ వల్ల వాటిని అధికారులు బయటపెట్టలేదు అనుకుందాం. సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాలను ముందుగానే విశ్లేషించుకుని ఉంటే.. ఉగ్రవాదుల రెక్కీ సమయంలోనే మనం అలర్ట్ అయి ఉండేవాళ్లం. అది ఇక్కడ జరగలేదు. నిఘా వ్యవస్థ మరింత కట్టుదిట్టంగా ఉంటే పహల్గామ్ దాడి జరగి ఉండేది కాదని కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టింగ్ లు పెడుతున్నారు.
స్థానికుల సహకారం ఉందా..?
ఇక దాడుల విషయంలో స్థానికుల సహకారం కూడా ఎంతోకొంత ఉందనే అనుమానాలున్నాయి. పక్కన బుల్లెట్ల మోత మోగుతున్నా.. కొంతమంది స్థానికులు పట్టించుకోనట్టు ఉండటమే దీనికి కారణం. అలాంటి వారిని ఎన్ఐఏ పిలిపించి విచారణ జరుపుతుందనే కథనాలు కూడా వెలువడుతున్నాయి. కాశ్మీర్ వంటి సున్నిత ప్రదేశంలో వివిధ రాష్ట్రాలనుంచి పర్యాటకులు వచ్చే రద్దీ ప్రాంతాల్లో వారికి సేవలందించే స్థానికులు ఎలాంటివారు అనే విషయాన్ని ముందుగానే నిఘా విభాగం అంచనా వేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. నిత్యం పర్యాటకులతో కిటకిటలాడే ప్రాంతాల్లో కనీసం డ్రోన్లతో అయినా నిఘా పెట్టి ఉంటే ఈ ఘోరం జరగకపోయి ఉండేదని అంటున్నారు.
ఇకనైనా జాగ్రత్త అవసరం..
ఉగ్రవాదుల చొరబాటు కేవలం సరిహద్దు ప్రాంతాలకే పరిమితం కాదు. ఆల్రడీ దేశంలోకి చొరబడిన ఉగ్రమూకలు ఎక్కడికక్కడ అమాయకుల ప్రాణాలు హరించేందుకు సిద్ధంగా ఉన్నారనే విషయం పహల్గామ్ దాడితో స్పష్టమైంది. పహల్గామ్ లో పర్యాటకుల వివరాలు అడిగి మరీ పాయింట్ బ్లాంక్ నుంచి వారిని కాల్చి చంపారు. అదే సమయంలో విచక్షణా రహితంగా కాల్పులు జరిగి ఉంటే మరింత ప్రాణ నష్టం జరిగి ఉండేది. ఏదిఏమైనా భారత నిఘా విభాగం మరోసారి ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తోంది. దాడి జరిగిన తర్వాత స్పందన బాగుంది కానీ, అసలు దాడి జరక్కుండా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంది కదా అని అంటున్నారు నెటిజన్లు. ఇలాంటి వాదనను పూర్తిగా సమర్థించలేం, అదే సమయంలో కొట్టిపారేయనూలేం. కానీ పహల్గామ్ ఉదంతం భారత ప్రభుత్వానికి, నిఘా వ్యవస్థకు ఒక పాఠం లాంటిది. దాడి జరిగాక ఉగ్రవాదుల్ని వేటాడి, వెంటాడి మట్టుబెట్టడం కంటే, అసలు దాడి జరక్కుండా అడ్డుకోవడమే అసలైన కర్తవ్యం.