Street Dog Attack: ఉత్తరప్రదేశ్‌లోషాకింగ్ ఘటన జరిగింది. సీతాపూర్ జిల్లా కోత్వాలి ప్రాంతంలో సైకిల్‌పై వెళ్తున్న ఒక విద్యార్థిపై వీధి కుక్క ఒక్కసారిగా దాడి చేసింది. విద్యార్థి ఆ కుక్కల దాడికి గురై నేలపై పడిపోయాడు. క్షణాల్లోనే జరిగిన ఈ దాడిలో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియోలు బయటకు రావడంతో సంచలనం రేపింది. కుక్కల సమస్యపై ఇప్పటికే సీతాపూర్‌లో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు విద్యార్థిపై జరిగిన ఈ దాడి ప్రజల్లో మరింత భయాందోళనలు సృష్టించింది.
ఏం జరిగింది..?
అమిత్ మంగ్వాకర్ అనే విద్యార్థి పాఠశాల నుంచి సైకిల్‌పై ఇంటికి బయలుదేరాడు. అతనితోపాటు పాఠశాల విద్యార్థులు కూడా తనతో మాట్లాడుతూ వెళుతున్నారు. మోతీపూర్ కూడలికి చేరుకున్న వెంటనే ఒక వీధికుక్క అమిత్‌పై దాడి చేసింది. సైకిల్ పై ఉన్న అతని కాలును గట్టిగా పట్టుకుంది. అమిత్ గట్టిగా అరిచినా కాపాడేందుకు ఎవరూ ముందుకు రాలేదు. కుక్క అతనిపై దాడి చేస్తున్నా అందరూ చూస్తూ ఉండిపోయారు. అమిత్ తనను తాను రక్షించుకోవడానికి వెంటనే సైకిల్ నుండి దూకాడు. అయినప్పటికీ, కుక్క తనపై దాడి చేసేందుకు ప్రయత్నంచడంతో అమిత్ సైకిల్ కిందకు పడేసి పక్కకు వెళ్లాడు. దీంతో ఆ కుక్క అక్కడి నుంచి వెళ్లిపోయింది. అప్పటికే కుక్క దాడితో అమిత్ కాలుకు తీవ్రంగా గాయమైంది.
విద్యార్థి అమిత్ నడవలేని పరిస్థితుల్లో అక్కడే ఉన్న వాహనదారులు, పాదచారులు సమీపంలోని క్లినిక్‌కి తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత, అతన్ని ఇంటికి పంపారు. ఈ దృశ్యాలు సీసీటీవీలో స్పష్టంగా రికార్డు అయ్యాయి. ఈ సంఘటన వీధికుక్కల దాడులు ఎంత తీవ్రమైనవి అనే విషయాన్ని మరోసారి ప్రజల దృష్టికి తీసుకువచ్చింది. గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో వీధికుక్కల సమస్య పెరుగుతుండటంతో, పిల్లలు, వాహనదారులు దాదాపు ప్రతిరోజూ దాడులకు గురవుతున్నారు. స్థానికులు నగర పంచాయతీకి వీధి కుక్కలను భద్రతా ప్రదేశాలు మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సంఘటన ప్రతి ఒక్కరికి ఒక హెచ్చరికగా మారింది.
సుప్రీం కోర్టు ఆదేశించినా.. ఆగని వీధి కుక్కల దాడులు..
దేశంలో పెరుగుతున్న వీధి కుక్కల సమస్యపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని ఎన్‌సీఆర్ పరిధిలో కుక్కల దాడి ఘటనలు పెరిగిపోవడం, చిన్నారులు రేబిస్ బారినపడటం పెద్ద ఎత్తున ఆందోళన రేపుతున్న నేపథ్యంలో మున్సిపల్ అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. జస్టిస్ విక్రమ్ నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పులో వీధికుక్కలను ముందుగా స్టెరిలైజ్ చేసి, ఇమ్యూనైజ్ చేసి ఆ తరువాత వాటిని మళ్లీ వాటి ప్రాంతాలకే విడిచిపెట్టాలని ఆదేశించింది. అయితే చిన్నారులపై కుక్కల దాడులు ఆగడం లేదని ఇప్పుడు తాజాగా జరిగిన ఘటనే నిదర్శనం. అయిదే సుప్రీం కోర్టు ఆదేశాలు ఎవరు పాటిస్తున్నారు? అనే ప్రశ్నలు వస్తున్నాయి. వీధికుక్కలు బహిరంగంగా తిరుగుతూ ప్రజలపై దాడు చేస్తున్నా మున్సిపల్ అధికారులు పట్టించేకోవడం లేదని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వీధి కుక్కల దాడులు ఎప్పటి ఆగుతాయి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
सीतापुर में कुत्ते ने किया छात्र पर हमला pic.twitter.com/R0nm3XOYdb
— Shah Nawaz journalist (News 24) (@Shahnawazreport) August 26, 2025