Kidney Stones: మూత్రపిండాల్లో రాళ్లు (కిడ్నీ స్టోన్స్) చాలా సాధారణమైన ఆరోగ్య సమస్య. మూత్రపిండాల్లో లవణాలు, ఖనిజాలు పేరుకుపోయి గట్టిపడటం వల్ల రాళ్లు ఏర్పడతాయి. ఈ రాళ్లు చిన్నవిగా ఉంటే ఎలాంటి లక్షణాలు కనిపించవు. కానీ అవి పెద్దగా మారి మూత్రనాళంలో కదలితే తీవ్రమైన నొప్పి, మూత్రవిసర్జనలో ఇబ్బందులు, వాంతులు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ సమస్యకు ప్రధాన కారణాలు తక్కువ నీరు తాగడం, కొన్ని రకాల ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం, జన్యుపరమైన కారకాలు. కిడ్నీ స్టోన్స్ ఉన్నవారు.. వాటిని నివారించుకోవాలనుకునేవారు కొన్ని రకాల ఆహార పదార్థాలను తినడం ద్వారా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు.
1. నీరు, ఇతర ద్రవపదార్థాలు:
కిడ్నీ స్టోన్స్ నివారణలో నీరు అత్యంత ముఖ్యమైనది. రోజుకు కనీసం 2.5 నుంచి 3 లీటర్ల నీరు తాగడం వల్ల మూత్రపిండాలు శుభ్రపడతాయి. నీరు ఎక్కువగా తాగితే మూత్రం పలుచబడి, రాళ్లు ఏర్పడటానికి కారణమయ్యే ఖనిజాలు కరిగిపోతాయి. నీటితో పాటుగా కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, బార్లీ నీళ్లు వంటివి కూడా తీసుకోవచ్చు.
2. నిమ్మరసం:
నిమ్మరసం అనేది కిడ్నీ స్టోన్స్‌కు ఒక అద్భుతమైన హోం రెమెడీ. నిమ్మకాయలో ఉండే సిట్రేట్ అనే రసాయనం కాల్షియం రాళ్లు ఏర్పడకుండా నిరోధిస్తుంది. అలాగే.. ఇప్పటికే ఉన్న చిన్న రాళ్లను కరిగించడంలో కూడా సహాయపడుతుంది. రోజులో ఒకటి లేదా రెండు సార్లు నిమ్మరసాన్ని నీటిలో కలిపి తాగితే మంచి ఫలితం ఉంటుంది.
3. ఆపిల్ సైడర్ వెనిగర్:
ఆపిల్ సైడర్ వెనిగర్‌లో ఎసిటిక్ యాసిడ్ ఉంటుంది. ఇది మూత్రపిండాల్లోని రాళ్లను కరిగించడంలో సహాయపడుతుంది. రోజుకు ఒక చెంచా ఆపిల్ సైడర్ వెనిగర్‌ను ఒక గ్లాసు నీటిలో కలిపి తాగడం వల్ల రాళ్లు చిన్నవిగా మారి మూత్రం ద్వారా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది.
4. తులసి రసం:
తులసి రసంలో ఎసిటిక్ యాసిడ్ ఉంటుంది. ఇది కిడ్నీ స్టోన్స్‌కు ఒక మంచి పరిష్కారం. తులసిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు మూత్రపిండాల ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
5. కిడ్నీ బీన్స్ (రాజ్‌మా) రసం:
కిడ్నీ బీన్స్ (రాజ్‌మా) ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో ఫైబర్, విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. కిడ్నీ బీన్స్ ఉడకబెట్టిన నీటిని తాగడం వల్ల మూత్రనాళ వ్యవస్థ శుభ్రపడి, రాళ్లను బయటకు పంపడంలో సహాయ పడుతుంది.
6. దానిమ్మ రసం:
దానిమ్మ రసం కూడా కిడ్నీ స్టోన్స్‌ను నివారించడానికి ఉపయోగపడుతుంది. ఇది మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతే కాకుండా రాళ్లు ఏర్పడకుండా నిరోధిస్తుంది.
నివారించాల్సిన ఆహార పదార్థాలు:
సోడియం (ఉప్పు) అధికంగా ఉన్న ఆహారాలు: ప్రాసెస్డ్ ఫుడ్స్, ప్యాక్డ్ ఫుడ్స్, బయటి జంక్ ఫుడ్‌లో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో కాల్షియం స్థాయిని పెంచి రాళ్లు ఏర్పడటానికి కారణమవుతుంది.
Also Read: గుండెకు స్టంట్ ఎందుకు వేస్తారు? తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి ?
ఆక్సలేట్ అధికంగా ఉండే ఆహారాలు: బచ్చలికూర, చాక్లెట్, గింజలు, చిలగడదుంప, టీ వంటి వాటిలో ఆక్సలేట్ ఎక్కువగా ఉంటుంది. ఈ పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల కాల్షియం ఆక్సలేట్ రాళ్లు ఏర్పడతాయి.
జంతు సంబంధిత ప్రోటీన్లు: రెడ్ మీట్, గుడ్లు, సీఫుడ్ వంటివి మూత్రంలో యూరిక్ యాసిడ్ స్థాయిని పెంచుతాయి. ఇది యూరిక్ యాసిడ్ రాళ్లకు దారితీస్తుంది.
కిడ్నీ స్టోన్స్ సమస్య ఉన్నవారు తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించి, వారి సలహా మేరకు ఆహార నియమాలను పాటించడం ముఖ్యం. పైన పేర్కొన్నవి కేవలం సాధారణ చిట్కాలు మాత్రమే.