
PM Modi: ప్రధాని మోదీ. దేశంలోకే అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే వ్యక్తి. ఆయన పర్యటనకు ముందు, పర్యటన సమయంలో పక్కాగా భద్రతా తనిఖీలు ఉంటాయి. నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ కనుసన్నల్లో మోదీ టూర్ నడుస్తుంది. అలాంటి మోదీ పర్యటన సైతం అప్పుడప్పుడు రిస్క్‌లో పడుతుంటుంది. ఇటీవల ప్రధాని పంజాబ్ టూర్ ఉద్రిక్తత రాజేసింది. మోదీ కాన్వాయ్ ముందుకు కదలకుండా వాహనాలు అడ్డుపెట్టి ఆందోళనకు దిగారు పంజాబ్ రైతులు. ఆ సమయంలో పీఎం కాన్వాయ్ ఫ్లైఓవర్‌పై ఆగిపోయింది. ముందుకు, వెనక్కి కదలలేని పరిస్థితి. రైతుల ముసుగులో ఖలిస్థాన్ ఉగ్రవాదులు కానీ, అమృత్‌పాల్ సింగ్ అనుచరులు కానీ.. మోదీ హత్యకు కుట్ర చేసుంటారనే ప్రచారమూ జరిగింది. ఆ ఘటనను సీరియస్‌గా తీసుకున్న కేంద్ర హోంశాఖ.. పంజాబ్ ప్రభుత్వం నుంచి వివరణ కూడా కోరింది. NSG ప్రత్యేక దర్యాప్తు చేసింది. ఇదంతా గతం.
లేటెస్ట్‌గా ఆదివారం కేరళ పర్యటనకు సిద్ధమయ్యారు ప్రధాని మోదీ. అక్కడ వామపక్ష ప్రభుత్వం అధికారంలో ఉంది. కాంగ్రెస్‌కూ బాగానే బలం ఉంది. బీజేపీ మాత్రం కేరళలో ఉనికి కోసం పోరాడుతోంది. ఇలాంటి సందర్భంలో మోదీ కేరళకు వస్తే ఆత్మాహుతి దాడులు చేస్తామంటూ బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది.
కేరళ బీజేపీ ఆఫీసుకు గతవారం ఈ బెదిరింపు లేఖ వచ్చింది. మోదీ కోచి పర్యటనలో ఆత్మాహుతి దాడులు చేస్తామనడం ఆ లేఖ సారాంశం. బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ సురేంద్రన్ ఆ లెటర్‌ను పోలీస్ ఉన్నతాధికారులకు అందించారు. ఇంటెలిజెన్స్ విభాగం ఎంక్వైరీ స్టార్ట్ చేసింది. రాష్ట్రంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
ప్రధాని మోదీ పర్యటన సమయంలో భద్రతా ప్రొటోకాల్స్‌పై ఏడీజీపీ జారీ చేసిన ఉత్తర్వులు మీడియాకు లీక్ అవడంతో ఈ లేఖ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. ఆత్మహుతి దాడుల బెదిరింపు అంశం బయటకు రావడంపై కేంద్ర హోంశాఖ రాష్ట్రంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఆదివారం కోచిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మోదీ పాల్గొనాల్సి ఉంది. అనంతరం తిరువనంతపురంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను జెండా ఊపి ప్రారంభించనున్నారు. మరి, బెదిరింపుల నేపథ్యంలో ప్రధాని కేరళ పర్యటనకు వస్తారా? షెడ్యూల్ ప్రకారమే కార్యక్రమాలు ఉంటాయా? అనే అనిశ్చితి నెలకొంది. మోదీ టూర్ ఉంటుందని కేరళ బీజేపీ స్పష్టం చేస్తోంది.