Supreme Court alimony case: మన దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు తాజాగా ఇచ్చిన ఒక కీలక తీర్పు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తక్కువకాలం మాత్రమే సాగిన వివాహం తర్వాత భార్య, భర్త దగ్గర నుంచి భారీ భరణం డిమాండ్ చేయడం సరైనదేనా అన్న ప్రశ్నపై కోర్టు స్పష్టమైన అభిప్రాయం వ్యక్తం చేసింది. కోర్టు చెప్పిన సందేశం ఏమిటంటే.. ఆర్థికంగా, విద్యాపరంగా అర్హత కలిగిన మహిళలు ఇతరులపై ఆధారపడకుండా స్వయంపోషణ దిశగా నడవాలి. లగ్జరీ జీవితాన్ని భరణం పేరుతో ఆశించడం కన్నా తమ ప్రతిభతో జీవనోపాధి పొందడం సమాజానికి సరైన ఉదాహరణ అవుతుందని కోర్టు స్పష్టం చేసింది. ఇంతకు ఈ కేసులో సదరు మహిళ అడిగిన భరణం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది.
☀ కేసు ఏమిటి? అసలేం జరిగింది?
ఈ కేసులో ప్రధానంగా నిలిచింది ఒక ఐటీ ప్రొఫెషనల్, ఎంబీఏ చదివిన మహిళ చేసిన డిమాండ్లు. కేవలం 18 నెలల వివాహం తర్వాతే ఆమె తన భర్త దగ్గర నుంచి ముంబయిలో ఒక ఖరీదైన ఫ్లాట్, 12 కోట్లు భరణం, లగ్జరీ BMW కారు వంటి డిమాండ్లు చేసింది. కోర్టులో ఈ డిమాండ్లు విన్నవారందరూ ఆశ్చర్యపోయారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ ఆమెను నేరుగా చూసి.. మీరు ఐటీ రంగంలో పని చేస్తారు కదా? ఎంబీఏ చదివారు. బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో మీలాంటి వారికి డిమాండ్ ఎక్కువే. పని చేయకూడదా? ఎందుకు ఇతరులపై ఆధారపడాలని ప్రశ్నించారు. అంతేకాదు, 18 నెలల వివాహం మాత్రమే కొనసాగింది. అందులోనే నెలకు కోటి రూపాయల భరణం అడగడం న్యాయమా? అని సూటిగా ప్రశ్నించారు.
☀ ఆమె వాదన ఇదే!
సదరు మహిళ వాదన ఏమిటంటే.. తన భర్త ధనవంతుడు, మానసిక సమస్యల కారణంగా వివాహ రద్దు కోసం కేసు వేశాడు. కానీ కోర్టు ఈ వాదనతో ఏకీభవించలేదు. మీరు చదువుకున్నవారు, పనిచేసే స్థాయి ఉన్నవారు. మరి చేయి చాచడం ఎందుకు? అని సీజేఐ అన్నారు. చివరికి కోర్టు ఆమెకు రెండు ఆప్షన్లు ఇచ్చింది. ఒకవేళ ఫ్లాట్‌ను చట్టపరమైన ఇబ్బందుల్లేకుండా తీసుకోవచ్చు లేకపోతే ఒకేసారి 4 కోట్లు తీసుకుని సెటిల్ కావచ్చని స్పష్టం చేసింది.
Also Read: AP Metro Rail Project: విశాఖ, విజయవాడ మెట్రో సరే.. నిధుల వాటాలో ట్విస్ట్ ఇదే!
☀ తీర్పు ఏం చెప్పింది?
ఈ తీర్పు కొత్తది కాదు. గతంలో కూడా కోర్టులు ఇదే విధమైన అభిప్రాయం వ్యక్తం చేశాయి. 2025 మార్చిలో ఢిల్లీ హైకోర్టు, CrPC 125 ప్రకారం భరణం చట్టం అనేది కేవలం రక్షణ కోసం మాత్రమేనని, లగ్జరీ జీవితానికి మార్గం కాదని స్పష్టం చేసింది. విద్యావంతురాలైన, పని చేయగలిగిన భార్య కేవలం భరణం కోసం ఖాళీగా కూర్చోవడం సరైనది కాదని హైకోర్టు తీర్పు చెప్పింది. అలాగే 2024 డిసెంబరులో సుప్రీం కోర్టు మరో కీలక వ్యాఖ్య చేస్తూ, భర్త సంపద పెరిగిందని భార్య జీవితాంతం అదే స్థాయి సౌకర్యాలు డిమాండ్ చేయలేరని తీర్పు ఇచ్చింది.
☀ భరణం రక్షణ కోసమే!
ఈ తీర్పులన్నీ ఒక పెద్ద సందేశాన్ని ఇస్తున్నాయి. భరణం చట్టం అవసరమున్నవారికి రక్షణ కోసం. కానీ చదువు, నైపుణ్యం ఉన్న మహిళలు ఈ చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా, తమ అర్హతతో స్వయంపోషణ దిశగా అడుగులు వేయాలని కోర్టు సూచిస్తోంది. ఇది మహిళల హక్కులను తగ్గించడం కాదు, వారి ఆత్మనిర్భరతను ప్రోత్సహించే నిర్ణయం. చదువుకున్నవారు గౌరవంగా జీవనోపాధి పొందడం సమాజానికి మంచి ఉదాహరణ అని సుప్రీం కోర్టు చెప్పిన తీర్పు ఇప్పుడు చర్చనీయాంశమైంది.
ఈ తీర్పు సమాజానికి ఒక ముఖ్యమైన ప్రశ్నను కూడా లేవనెత్తింది. వివాహం తర్వాత భార్య భారీ భరణం కోరడం న్యాయమా? లేక కోర్టు చెప్పినట్టుగా ప్రతివ్యక్తి తన అర్హతతో గౌరవంగా జీవించాలా? చదువు, ఉద్యోగం ఉన్న మహిళలు స్వయంపోషణ దిశగా అడుగులు వేయడం సమానత్వానికి మరింత బలాన్ని ఇస్తుంది. ఇది లగ్జరీ కోసం కాకుండా గౌరవంగా నిలబడే నిర్ణయం. ఈ తీర్పు వెనుక ఉన్న సందేశం ఇదే.. అర్హత ఉన్నవారు ఆత్మనిర్భరంగా జీవించాలి, చేయి చాచే అలవాటు వద్దని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.