Supreme Court : స్టాండప్ కామెడీ. అన్నీ బూతులే. వెబ్ సిరీస్‌లు చాలావరకు A గ్రేడ్ కంటెంటే. సినిమాల్లోనూ అశ్లీలమే. ఓటీటీ నిండా కుప్పలు తెప్పలు.. కావలసినంత గలీజ్ వీడియోలు. అదే ఇంపుగా అనిపిస్తుంది చాలామందికి. చూస్తే రోత పుడుతుంది సభ్య సమాజానికి. అలాంటి అసభ్య కంటెంట్‌తో జనం చెడిపోతున్నారనే ఆవేదన కొందరిలో. అలాంటి వాళ్లంతా సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు. ఆఛండాలాన్ని అరికట్టాలంటూ న్యాయస్థానాన్ని కోరారు. ఓటీటీ, సోషల్ మీడియాపై చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. అయితే, పూర్తి స్థాయిలో సెన్సార్‌షిప్ సాధ్యం కాకపోయినా.. నియంత్రణ దిశగా అడుగులు పడుతున్నాయి.
సుప్రీంకోర్టు సీరియస్
అసభ్యకరమైన కంటెంట్ ప్రసారం చాలా తీవ్రమైన అంశమని సుప్రీంకోర్టు సీరియస్ అయింది. పిల్లలు, యువతతో పాటు పెద్దల ఆలోచనలపై కూడా ప్రభావం ఉంటుందని అభిప్రాయపడింది. ఈ కంటెంట్ వికృత, అసహజ లైంగిక ధోరణులకు దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఓటీటీ, సోషల్ మీడియా నియంత్రణపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
కేంద్రానికి నోటీసులు
ఓటీటీ, సోషల్ మీడియాలో అశ్లీల కంటెంట్‌ను నియంత్రించాలంటూ.. సుప్రీంకోర్టులో ఐదు పిటిషన్లు దాఖలయ్యాయి. జర్నలిస్ట్, మాజీ సమాచార కమిషనర్ ఉదయ్ మహూర్కర్, సంజీవ్ నెవార్, సుదేష్ణ భట్టాచార్య ముఖర్జీ, శతాబ్ది పాండే, స్వాతి గోయల్ తదితరులు సుప్రీంకోర్టులో పిటిషనర్లు దాఖలు చేశారు. పిటిషనర్ల తరఫున హాజరైన న్యాయవాది విష్ణు శంకర్ జైన్ తన వాదనలు వినిపించారు. ఎటువంటి నియంత్రణ, తనిఖీలు లేకుండా సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్న కంటెంట్ అంశాన్ని హైలైట్ చేశారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏంటని ప్రశ్నించారు జస్టిస్ గవాయ్. పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.
కంట్రోల్.. కంట్రోల్..
ఇప్పటికే కొన్ని నిబంధనలు అమల్లో ఉన్నాయని.. భవిష్యత్తులో మరిన్ని నిబంధనలు అమలు చేస్తామని సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలిపారు. కొన్ని సాధారణ కార్యక్రమాల్లో కూడా అశ్లీల కంటెంట్ ఉందని అంగీకరించారు. ఇద్దరు గౌరవనీయులైన వ్యక్తులు కలిసి కూర్చుని వాటిని చూడలేరని ఆవేదన వ్యక్తం చేశారు. సెన్సార్‌షిప్ ఉండకూడదని అంగీకరిస్తూనే, కొంత నియంత్రణ అవసరమని సొలిసిటర్ జనరల్ అన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఆల్ట్ బాలాజీ, ఉల్లు డిజిటల్, ముబి, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు ఎక్స్ కార్ప్, గూగుల్, మెటా ఇంక్, ఆపిల్ వంటి సంస్థలకు నోటీసులు జారీ చేసింది.