Prajwal Revanna : మొన్నటి పార్లమెంట్ ఎన్నికల సమయంలో కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జేడీఎస్ నాయకుడు ప్రజ్వల్ రేవణ్ణ అత్యాచారం, లైంగిక ఆరోపణల కేసులో సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజ్వల్ రేవణ్ణ కోసం దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను.. జస్టిస్ బేల ఎమ్ త్రివేది, సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం తిరస్కరించింది.
మాజీ ప్రధానమంత్రి హెచ్‌డీ దేవె గౌడ మనవడే ప్రజ్వల్ రేవణ్ణ. ఆయన తండ్రి హెచ్‌డీ రేవణ్ణ కర్ణాటక అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ అధికారం, హోదాను అడ్డుపెట్టుకునే మహిళలపై పలుమార్లు అత్యాచారాలకు పాల్పడ్డాడనే అరోపణలతో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో రిమాండ్ లో ఉన్న ప్రజ్వల్ కు బెయిల్ మంజూరు చేయాలని..సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ పిటిషన్ దాఖలు చేశారు.
ప్రజ్వల్ పై నమోదైన కేసులు, ఆరోపణలు తీవ్రమైనవేనని అంగీకరించిన న్యాయవాది రోహత్గీ.. అతనిపై అభియోగించిన కేసుల్లో అత్యాచారానికి సంబంధించిన సెక్షన్ 376 గురించి ప్రస్తావన లేదని, అందుకే.. తన క్లైయింట్ కు బెయిల్ ఇవ్వాలని సుప్రీం కోర్టును అభ్యర్థించారు. వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం.. అతనిపై ఈ కేసు మాత్రమే కాదని, ఇతర ఫిర్యాదులు సైతం అనేకం ఉన్నాయని వ్యాఖ్యానించారు.
ఆరోపణలు వచ్చిన సమయంలో దేశం విడిచిపోయిన ప్రజ్వల్ రేవణ్ణ.. ఆ తర్వాత చాన్నాళ్లకు తిరిగి వచ్చి పోలీసుల ముందు లొంగిపోయారు. ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్లిన ముకుల్ రోహత్గీ.. బెయిల్ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని కోరారు. సరిగా ఎన్నికల సమయంలో బయటకు వచ్చిన ఈ ఆరోపణల కారణంగానే.. తన క్లైయింట్ లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోయారని అన్నారు. వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం.. నిందితుడిపై వచ్చిన ఆరోపణలు చాలా తీవ్రమైనవని వ్యాఖ్యానించింది. బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరించింది.
ప్రజ్వల్ రేవణ్ణ బెయిల్ పిటిషన్ ను మరో 6 నెలల తర్వాత దరఖాస్తు చేయవచ్చా? అని అడగగా.. తాము దీనిపై ఏం చెప్పమని జస్టిస్ త్రివేది వ్యాఖ్యానించారు. అక్టోబర్ 21న రేవణ్ణ రెగ్యులర్ బెయిల్, ముందస్తు పిటిషన్లను కర్ణాటక హైకోర్టులో దాఖలు చేశారు. అక్కడ బెయిల్ పిటిషన్లపై తరఫు వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం.. బెయిల్ ను నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కర్ణాటక హైకోర్టు తీర్పును రేవణ్ణ తరఫు న్యాయవాదులు.. సుప్రీం కోర్టులో సవాళు చేశారు. సుప్రీంలోనూ చుక్కెదురు కావడంతో.. రేవణ్ణ మరికొన్నాల్లు జైలులోనే గడపాల్సి ఉంటుంది.
Also Read : 51వ సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా.. బాధ్యతల స్వీకరణ..!
కాగా.. ఈ ఏడాది ఏప్రిల్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ-జేడీఎస్ కూటమి అభ్యర్థిగా ప్రజ్వల్ రేవణ్ణ ఎన్నికల్లో పోటీచేశారు. కర్ణాటకలోని హసన్ నియోజకవర్గ అభ్యర్థిగా నిలబడిన రేవణ్ణపై తీవ్రమైన లైగింక ఆరోపణలు ఉన్నాయి. సరిగా ఈ పార్లమెంట్ స్థానానికి ఎన్నికలు ముగిసిన మరుసటి రోజే.. రేవణ్ణపై లైంగిక ఆరోపణలు, వేధింపుల వీడియోలు కలకలం సృష్టించాయి. మొత్తం సోషల్ మీడియా సైట్లతో పాటు.. స్థానిక బస్ స్టేషన్లు, పార్కులు సహా అనేక చోట్ల రేవణ్ణకు సంబంధించిన వేధింపుల వీడియోలున్న పెన్ డ్రైవ్‌లు వెలుగుచూశాయి. దాంతో.. కొన్ని నెలల పాటు విదేశాలకు పారిపోయిన నిందితుడు.. కొన్నాళ్లకు సిట్ ముందు లొంగిపోయాడు.