Big Stories

Supreme court : ఆ నిర్ణయం సరైనదే…పెద్ద నోట్ల రద్దుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..

Supreme court : పెద్దనోట్ల రద్దు వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. పెద్దనోట్ల రద్దును సుప్రీంకోర్టు ధర్మాసనం సమర్థించింది. జస్టిస్‌ ఎన్‌.ఎ.నజీర్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. పెద్దనోట్ల రద్దును ధర్మాసనంలోని నలుగురు సభ్యులు సమర్థించారు. ఒకరు వ్యతిరేకించారు. పెద్దనోట్ల రద్దుపై కేంద్రం తీసుకున్న నిర్ణయం లోపభూయిష్టంగా లేదని.. ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం మధ్య సంప్రదింపులు జరిగిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నారని జస్టిస్‌ గవాయ్‌ వివరించారు. 2016 నవంబర్‌ 8న కేంద్రం విడుదల చేసిన నోటిఫికేషన్‌ చెల్లుబాటు అవుతుందని స్పష్టం చేశారు.

- Advertisement -

కేంద్ర ప్రభుత్వం 2016లో రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 58 పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. జస్టిస్‌ ఎన్‌.ఎ.నజీర్‌ నేతృత్వంలో జస్టిస్ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్ ఏఎస్‌ బొప్పన్నా, జస్టిస్ వీ రామసుబ్రమణియన్‌, జస్టిస్ బీవీ నాగరత్న నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ చేపట్టింది. ఆర్థిక విధాన అమలు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. నోట్ల రద్దుపై కేంద్రం, ఆర్బీఐ మధ్య సంప్రదింపులు జరిగాయని స్పష్టం చేసింది. అటువంటి చర్యను తీసుకురావడానికి సహేతుకమైన కారణం ఉందని పేర్కొంది. దామాషా సిద్ధాంతం వల్ల పెద్దనోట్ల రద్దు జరగలేదని భావిస్తున్నామని ధర్మాసనం అభిప్రాయపడింది. అయితే జస్టిస్‌ గవాయి వెల్లడించిన తీర్పుతో బెంచ్‌లోని జస్టిస్‌ నాగరత్న ఒక్కరే విభేధించారు.

- Advertisement -

2016 నవంబర్ 8న కేంద్రం పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించగానే ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాయి. నోట్ల రద్దు వల్ల చేకూరే ప్రయోజనం ఏంటో చెప్పాలని కేంద్రాన్ని కోరాయి. రిజర్వబ్యాంకు మాజీ గవర్నర్ రఘురామరాజన్ లాంటి నిపుణులు కేంద్రం చర్యను తప్పుపట్టారు. నోట్ల రద్దుతో ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు. ఆర్థిక వ్యవస్థపై వ్యతిరేక ప్రభావం చూపిస్తుందని అభిప్రాయపడ్డారు. ఇలా అన్ని వైపుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమైనా మోదీ ప్రభుత్వం నోట్లు రద్దు నిర్ణయంపై వెనక్కి తగ్గకుండా అమలు చేసింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ నిర్ణయాన్ని సమర్థించడంతో నోట్ల రద్దు వివాదం ముగిసినట్లే.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News