
TDP : NRI ఉయ్యూరు శ్రీనివాస్ నేతృత్వంలోని ఉయ్యూరు ఫౌండేషన్ గుంటూరు సదాశివనగర్‌లోని వికాస్ హాస్టల్ మైదానంలో ఆదివారం నిర్వహించిన చీరలు, చంద్రన్న సంక్రాంతి కిట్ పంపిణీలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు మృతి చెందారు. ఇంకా అనేకమంది గాయపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఈ కార్యక్రమానికి హాజరై కొందరు మహిళలకు వేదికపై కానుకలు పంపిణీ చేశారు. ఆయన ప్రసంగించి వెళ్లగానే మిగిలిన వారికి పంపిణీ ప్రారంభించారు.
కానుకలు తీసుకోవడానికి జనం ఒక్కసారిగా తోసుకురావడంతో తొక్కిసలాట జరిగింది. ఘటనాస్థలిలోనే గుంటూరు ఏటీ అగ్రహారానికి చెందిన గోపిదేశి రమాదేవి(52) చనిపోయారు. నగరంపాలెంలోని ఘోరీలదొడ్డి సెంటర్‌కు చెందిన సయ్యద్ ఆసియా(40), గుంటూరు నాయీబ్రాహ్మణ కాలనీకి చెందిన జాన్‌బీ సహా కొందరు గాయపడ్డారు. వీరిని అంబులెన్సుల్లో గుంటూరు జీజీహెచ్‌తోపాటు ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆసియా, జాన్‌బీ మృతి చెందారు.
12 లారీల్లో కానుకలను తీసుకొచ్చిన నిర్వాహకులు 24 కౌంటర్ల ద్వారా పంపిణీ మొదలుపెట్టారు. అప్పటికే కొందరు గంటకుపైగా క్యూలైన్లలో వేచి ఉన్నారు. ప్రతి కౌంటర్ వద్దకు వెళ్లడానికి ఒకదారి, కానుక తీసుకుని బయటకు రావడానికి పక్కనే మరో దారి ఉండేలా బారీకేడ్లు ఏర్పాటు చేశారు. కానుకలు తీసుకునేందుకు రెండు మార్గాల్లోనూ ఒక్కసారిగా మహిళలు దూసుకురావడంతో పోలీసులు నియంత్రించలేకపోయారు. మొదటి రెండు కౌంటర్ల వద్దకు ఎక్కువ మంది రావడంతో తోపులాటలో ముందువైపు ఉన్నవారు కిందపడిపోయారు. బారీకేడ్లు ఒరిగిపోయి వాటి కింద కొందరు పడిపోయారు. అక్కడి నుంచి బయటపడే ఆత్రుతలో వారిని తొక్కుకుంటూ చాలామంది వెళ్లిపోయారు. కిందపడిన మహిళలు కాపాడాలని కేకలు వేయడంతో పోలీసులు మరో బారీకేడ్ తొలగించారు. అందరూ అటుగా వెళ్లడానికి ప్రయత్నించడంతో అక్కడా తొక్కిసలాట జరిగింది.
కానుకల పంపిణీ కోసం ఉయ్యూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో వారం రోజులపాటు ఏర్పాట్లు చేశారు 30వేల మందికి కిట్లు సిద్ధం చేసి పంపిణీ కోసం లారీల్లో తీసుకొచ్చారు. భారీ మైదానంలోనే కార్యక్రమం చేపట్టారు. సభా వేదిక ముందు ఒకవైపు పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కానుకలు తీసుకునే వారికి ముందుగానే ఇళ్ల వద్దకే వెళ్లి టోకెన్లు ఇచ్చారు. అయినా వారంతా ఒక్కసారిగా దూసుకురావడంతో దుర్ఘటన జరిగింది. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తామని నిర్వాహకులు తెలిపారు.
కానుకల పంపిణీ ప్రారంభం కాగానే మహిళలు ఎవరికివారు ముందుగా తీసుకోవాలన్న ఆత్రుతతో క్యూలైన్లు వదిలేసి, పక్క నుంచి వచ్చారని డీఎస్పీ సీతారామయ్య తెలిపారు. వారు కొందరిని నెట్టేయడంతో ముందున్న బారీకేడ్ పడిపోయిందని తెలిపారు. దాన్ని ఆనుకుని నిలుచున్నవారు కిందపడిపోయారని వివరించారు. వారిపై మిగిలినవారు పడటంతో ఊపిరాడక ప్రాణాలు పోయాయన్నారు.
ఈ ఘటనపై విచారణ చేస్తున్నామని ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తెలిపారు. జిల్లా కలెక్టర్ వేణుగోపాల్‌రెడ్డితో కలిసి ఆయన ఘటనాస్థలిని పరిశీలించారు. ఘటనకు కారణాలను విధుల్లో ఉన్న పోలీసులను అడిగి తెలుసుకున్నారు. సభ, కానుకల పంపిణీకి తగినంత భద్రత కల్పించామని, 200 మంది పోలీసులను కేటాయించామని ఎస్పీ చెప్పారు. తొక్కిసలాట ఘటనపై రాంబాబు అనే వ్యక్తి చేసిన ఫిర్యాదు ఆధారంగా నల్లపాడు పీఎస్ లో 304, 174 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఉయ్యూరు ఫౌండేషన్ ఛైర్మన్ శ్రీనివాస్ పై కేసు నమోదైంది.
Sajjala comments on CBN: చంద్రబాబు చట్టానికి అతీతుడా? టీడీపీ నేతలకు సజ్జల కౌంటర్..