Big Stories

vaikunta ekadasi : వైకుంఠ ఏకాదశి వైభవం.. భక్తులతో ఆలయాలు కిటకిట..

vaikunta ekadasi: తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రముఖ దేవాలయాలు భక్తులతో కిటికిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. తిరుమల, యాదాద్రి, అన్నవరం, భద్రాచలం, ద్వారక తిరుమల, మంగళగిరి, విజయవాడలోని ఆలయాలు భక్తజన సంద్రంగా మారాయి.

- Advertisement -

తిరుమలలో అర్ధరాత్రి 12.05 గంటలకు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలను ప్రారంభించారు. ముందుగా అత్యంత ప్రముఖులు, ఆ తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ధర్మకర్తల మండలి సభ్యులు దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. ఉదయం 5 నుంచి 6 గంటల వరకు శ్రీవాణి ద్వారా టోకెన్లు పొందిన భక్తులను దర్శనానికి అనుమతించారు. ఉదయం 6 గంటల నుంచి సామాన్య భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించారు. తిరుమలలో ఈ నెల 11 వరకు వైకుంఠ ద్వారం ద్వారా భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది.

- Advertisement -

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిండే, ఏపీ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా, ఉషశ్రీ, మేరుగ నాగార్జున, తెలంగాణ మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, గంగుల కమలాకర్‌, శ్రీనివాస్‌ గౌడ్‌, మల్లారెడ్డి, తమిళనాడు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తదితర ప్రముఖులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమలలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి స్వర్ణ రథోత్సవంలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

భద్రాద్రిలో ఉత్తర ద్వారం ద్వారా రామయ్యను దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలి వచ్చారు. దీంతో ఆలయం భక్తజన సంద్రంగా మారింది. సింహాచలంలో స్వామివారి ఉత్తర ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక గజపతిరాజు తొలిదర్శనం చేసుకున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాల్లో భక్తుల రద్దీ కొనసాగుతోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News