Tamil Nadu 32 people dead: తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. కల్లకురిచ్చి జిల్లాలో కల్తీ మద్యం తాగి 32 మంది మృతి చెందారు. మరో 60 మంది వరకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే అందులో మరికొందరి పరిస్థితి ఇంకా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సీఎం స్టాలిన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను కోరారు. అంతేకాదు దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.
మంగళవారం రాత్రి కల్లకురిచి పట్టణంలో ఓ షాపు వద్ద మద్యం పాకెట్లు కొనుగోలు చేశారు కొందరు వ్యక్తులు. దాన్ని తాగిన తర్వాత వాళ్లు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ముఖ్యంగా తలనొప్పి, వాంతలు, కడుపు నొప్పి, కళ్ల మంటలు వంటి లక్షణాలు మొదలయ్యాయి. వెంటనే వారిని కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. ట్రీట్‌మెంట్ తీసుకుంటూ పలువురు మృతి చెందారు. ఈ విషయం తెలియగానే జిల్లా కలెక్టర్ అలర్టయ్యారు.
సీరియస్‌గా ఉన్నవారిని పుదుచ్చేరిలోని జిప్‌మర్ మెడికల్ కాలేజీకి తరలించారు. బాధితుల రక్త నమూనాల ను సేకరించిన అధికారులు.. విల్లుపురం, జిప్‌మర్ ఫోరెన్సిక్ ల్యాబ్‌లకు పంపించారు. అయితే మద్యంలో మిథనాల్ అనే విష పదార్థం కలిసినట్టు తేలింది. ఈ వ్యవహారంపై స్టాలిన్ యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ కేసును సీఐడీకి అప్పగించింది. కల్లకురిచ్చి జిల్లా కలెక్టర్, ఎస్పీలను శ్రవణ్‌కుమార్, సమైసింగ్ మీనాను అక్కడి నుంచి బదిలీ చేసింది. అయితే స్థానంలో కలెక్టర్‌గా ఎంఎస్ ప్రసాద్‌ను నియమించింది.
జిల్లా ప్రొహిబిషన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ యూనిట్‌కు చెందిన డీఎస్పీ తమిళ సెల్వన్ ఆధ్వర్యంలోని టీమ్‌ను సస్పెండ్ చేసింది స్టాలిన్ సర్కార్. ఈ ఘటన విషయం తెలియగానే మంత్రులు, ఈవీ వేలు, సుబ్రమణ్యం కల్లకురిచ్చి ఆసుపత్రిని సందర్శించారు. బాధితులతో మాట్లాడారు. అటు వైద్య అధికారులతో మాట్లాడిన మంత్రులు, బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు.
ALSO READ: యూజీసీ నెట్ పరీక్ష రద్దు
ఈ ఘటనపై తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. కల్తీ మద్యం సేవించి ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించినట్టు ఎక్స్ వేదికగా వెల్లడించారు. మరోవైపు సీఎం స్టాలిన్ ఇవాళ కల్లకురిచ్చి ప్రాంతాన్ని సందర్శించే అవకాశముంది.