CM Vijay: తమిళనాడులోని తేని జిల్లా సబ్ జైలు నుంచి ఏకంగా 17 మంది ఖైదీలు తప్పించుకున్న ఘటన ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఈ ఘటనపై సీఎం విజయ్ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విధుల్లో నిర్లక్ష్యం, తీవ్ర భద్రతాపరమైన లోపాల కారణంతో సబ్‌జైలు ఇన్‌ఛార్జ్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఎన్. నాగేశ్వరన్ పై వేటు వేసింది. ఆయన్ను సస్పెండ్ చేస్తూ విజయ్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా జైళ్ల శాఖలో భారీగా బదిలీలు చేపట్టింది. దీని ద్వారా ఇతర జైళ్లలోని అధికారులకు గట్టి హెచ్చరికలు పంపింది.
జైళ్ల నిర్వహణలో ప్రక్షాళన, జవాబుదారీతనం పెంపొందించే లక్ష్యంగా ఆ శాఖలో బదిలీలకు సీఎం విజయ్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో మదురై సెంట్రల్ జైలు సూపరింటెండెంట్‌గా ఉన్న ఆర్. కృష్ణరాజ్‌ను సేలం సెంట్రల్ జైలు సూపరింటెండెంట్‌గా బదిలీ చేశారు. మరోవైపు జైళ్ల శాఖ డీజీపీ సందీప్ రాయ్ రాథోడ్‌ను టాంగెడ్కో (TANGEDCO) సీవీఓగా బదిలీ చేసి.. ఆయన స్థానంలో జైళ్ల శాఖ నూతన ఏడీజీపీగా కె. శంకర్‌ను ప్రభుత్వం నియమించింది.
జైళ్ల శాఖ అధికారులు తమ విధులను అత్యంత అప్రమత్తతతో, నిబద్ధతతో నిర్వహించాలని సీఎం విజయ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. భద్రతా వ్యవహారాల్లో ఎలాంటి లోపాలను ప్రభుత్వం సహించేది లేదన్నారు. భవిష్యత్తులో ఉద్యోగుల నిర్లక్ష్యం లేదా అలసత్వం కనిపిస్తే చట్టపరంగా మరిన్ని కఠినమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
Also Read: గుండెల్ని పిండేసే ఘటన.. పాఠశాలలో బాలికపై రంపంతో దాడి, సీఎం చంద్రబాబు ఏమన్నారంటే?
అక్టోబర్ 26 రాత్రి తెక్కంపట్టి సబ్‌జైలులో నుంచి 17 మంది రిమాండ్ ఖైదీలు చాకచక్యంగా తప్పించుకున్నారు. వైద్య అత్యవసర పరిస్థితి పేరుతో జైలు అధికారులకు మస్కా కొట్టి పారిపోయారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన తమిళనాడులు పోలీసులు.. డ్రోన్లను ఉపయోగించి దట్టమైన పొదల్లో దాక్కున్న ఎనిమిది మంది ఖైదీలను గుర్తించారు. అలాగే గాలింపు చర్యల ద్వారా మిగిలిన ఖైదీలను సైతం 48 గంటల వ్యవధిలో పట్టుకున్నారు. అయితే ఖైదీలపై సరైన పర్యవేక్షణ, నియంత్రణ లేకపోవడమే ఈ చర్యకు కారణమని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
Also Read: ఫైవ్‌స్టార్ హోటల్‌లో విషాదం.. స్విమ్మింగ్ పూల్‌లో కరెంటు షాక్.. ఇద్దరు విదేశీయులు మృతి!