Karwa Chauth police complaint| పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావడం సహజం. అయితే, ఒక పండుగ సంప్రదాయాన్ని పాటించలేదని భార్యపై భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తన కోసం కర్వా చౌత్ ఉపవాసం (భర్త క్షేమం కోసం హిందువు భార్యలు చేసే వ్రతం) చేయడం లేదని, తన భార్య తనను చంపాలనుకుంటోందని ఓ వ్యక్తి ఆరోపించాడు. అంతేకాదు, ఆమె తన మాట వినకపోతే విడాకులు ఇస్తానని కూడా హెచ్చరించాడు. మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాలో ఈ వింత ఘటన చోటుచేసుకుంది.
మధ్యప్రదేశ్ రాష్ట్రం శివపురి జిల్లాలోని బిజ్రావన్ గ్రామానికి చెందిన బరేలాల్ ఆదివాసీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన భార్య మిథిలేష్ ఆదివాసీ తనపై నమ్మకంగా ఉండటం లేదని ఆరోపించాడు. కర్వా చౌత్ పండుగను జరుపుకోవడానికి ఆమె నిరాకరిస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నాడు.
కర్వా చౌత్ అనేది హిందూ వివాహిత మహిళలు ఆచరించే సంప్రదాయ పండుగ. ఈ రోజున మహిళలు తమ భర్తల ఆయురారోగ్యాల కోసం ఉపవాసం ఉంటారు. రాత్రి చంద్రుడిని చూసిన తర్వాత ప్రత్యేక పూజలు చేసి ఉపవాసాన్ని విరమిస్తారు. ఉత్తర భారత దేశంలో హిందూ వివాహిత మహిళలు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. అయితే, తన భార్య ఈ సంప్రదాయాన్ని పాటించకపోవడంతో బరేలాల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.
తన కోసం భార్య ఉపవాసం ఉండటం లేదని బరేలాల్ పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. చంద్రుడిని చూసి తన ఆయుష్షు పెరగాలని పూజ చేయాలని భార్యను కోరినట్లు తెలిపాడు. అయినప్పటికీ ఆమె తన మాట వినడం లేదని ఆరోపించాడు. “నా కోసం కర్వా చౌత్ వ్రతం చేయడం లేదు. ఆమె నన్ను చంపాలనుకుంటోంది” అని ఫిర్యాదులో రాసినట్లు సమాచారం. చంద్రుడిని చూసి పూజ చేయడం తన దీర్ఘాయుష్షుకు ఉపయోగపడుతుందని బరేలాల్ నమ్మకం. అయితే, భార్య ఆ ఆచారాన్ని పాటించకపోవడాన్ని తనకు ప్రాణహాని ఉన్నట్లుగా భావించాడు.
Also Read: భర్తను వదిలి మరో వ్యక్తితో 10 ఏళ్లు సహజీవనం చేసిన భార్య.. భరణం కేసులో కోర్టు తీర్పు ఇదే
తన భార్య కర్వా చౌత్ పండుగను జరుపుకోకపోతే విడాకులు ఇస్తానని బరేలాల్ హెచ్చరించాడు. ఈ విషయంపై పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని కోరాడు. దీంతో స్థానిక పోలీసులు ఈ ఫిర్యాదుపై స్పందించారు.
కోలారస్ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ సంజయ్ మిశ్రా ఈ ఫిర్యాదుపై స్పందించారు. మహిళా పోలీసు అధికారిని కూడా భాగస్వామ్యం చేసి దంపతుల మధ్య సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. ప్రస్తుతం భార్యపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు సమాచారం లేదు. ముందుగా ఇద్దరి వాదనలు విని, సమస్యను చర్చల ద్వారా పరిష్కరించాలని పోలీసులు భావిస్తున్నారు.
Also Read: భర్తను కత్తితో పొడిచి చంపిన భార్యకు కేవలం రూ.500 జరిమానా.. హైకోర్టు షాకింగ్ తీర్పు
మతపరమైన, కుటుంబ సంప్రదాయాలను పాటించడంలో ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయి. భార్యాభర్తలు ఒకరి నమ్మకాలను మరొకరు గౌరవించుకోవడం ముఖ్యం. ఇలాంటి విభేదాలను బెదిరింపులతో కాకుండా పరస్పర అవగాహనతో పరిష్కరించుకోవాలి.