Delhi Traders Urge: దీపావళి, ధన త్రయోదశి పండుగల వేళ దిల్లీ రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి తలపెట్టిన భారీ ర్యాలీపై స్థానిక వ్యాపారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ర్యాలీ తేదీని నవంబర్ 10 లేదా 11 తర్వాతకు మార్చాలని, లేదంటే కనీసం వేదికైనా ఛేంజ్ చేయాలని కోరుతూ ‘ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ’ (CTI) అధ్యక్షుడు బ్రిజేష్ గోయల్ కాంగ్రెస్ మిత్ర పక్షాలకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీకి లేఖ రాసినప్పటికీ సరైన స్పందన రాకపోవడంతో.. కూటమిలోని ఇతర ముఖ్య నేతలైన అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ, తేజస్వి యాదవ్, ఉద్ధవ్ ఠాక్రేలకు వ్యాపారులు మెురపెట్టుకున్నారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఇప్పటికే మూడుసార్లు కలసి విన్నవించినా ఆయన ర్యాలీ తేదీ మార్చేందుకు ఒప్పుకోలేదని సీటీఐ అధ్యక్షుడు బ్రిజేష్ గోయల్ తెలిపారు. దాంతో ఇండియా కూటమి నేతలే జోక్యం చేసుకుని కాంగ్రెస్‌ను ఒప్పించాలని కోరారు. ర్యాలీ కారణంగా ఢిల్లీలోని ప్రధాన ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభిస్తే దీపావళి సరుకులు ఎలా సరఫరా అవుతాయని అని ఆయన ప్రశ్నించారు. ర్యాలీని దీపావళి తర్వాతకు వాయిదా వేయాలని లేదా 15,000 వరకు వాహనాలకు పార్కింగ్ సదుపాయం ఉన్న బురారీ గ్రౌండ్‌కు మార్చాలని వ్యాపారులు ప్రతిపాదిస్తున్నారు. కాగా, సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 1న ప్రతిపక్షాలు భారీ ర్యాలీకి పిలుపునిచ్చాయి. అయితే దిల్లీ పోలీసులు కొన్ని షరతులతో కూడిన అనుమతులను మాత్రమే ర్యాలీకి మంజూరు చేశారు.
ఈ ఏడాది ధనత్రయోదశి నవంబర్ 6న, దీపావళి నవంబర్ 8న రానున్నాయి. ఈ పండుగ సీజన్‌లో దిల్లీలోని దాదాపు 20 ప్రధాన హోల్‌సేల్, రీటైల్ మార్కెట్లలో రోజుకు రూ. 10,000 కోట్ల నుండి రూ. 12,000 కోట్ల వరకు వ్యాపారం జరుగుతుందని వ్యాపారుల సంఘం చెబుతోంది. నవంబర్ 1వ తేదీ అనేది సరుకుల రవాణా, వ్యాపారాల ప్రిపరేషన్‌కు అత్యంత కీలకమైన రోజని ఈ సమయంలో దిల్లీలో దాదాపు 10 లక్షల మంది జనం, 15,000 నుండి 20,000 వరకు వాహనాలతో ర్యాలీ నిర్వహిస్తే వాణిజ్య కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోతాయని వ్యాపారులు భయపడుతున్నారు. తమ విజ్ఞప్తి రాజకీయాలకు సంబంధించింది కాదని.. కేవలం తమ జీవనోపాధిని కాపాడుకోవడానికేనని దండం పెట్టి వేడుకుంటున్నారు.
రామ్‌లీలా మైదానంలో కనీసం 200 పెద్ద బస్సులను పార్క్ చేసేంత స్థలం కూడా లేదని.. అంత భారీ సంఖ్యలో వచ్చే వాహనాలు రోడ్లపైనే నిలిచిపోతాయని వ్యాపార సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జవహర్‌లాల్ నెహ్రూ మార్గ్, బహదూర్ షా జఫర్ మార్గ్, నేతాజీ సుభాష్ మార్గ్‌లతో పాటు చాందినీ చౌక్, అజ్మేరీ గేట్ పరిసర ప్రాంతాలలో తీవ్రమైన ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉందని భయపడుతున్నాయి. ఈ ర్యాలీ వల్ల చాందినీ చౌక్, సదర్ బజార్, కన్నాట్ ప్లేస్, ఖారీ బాఓలీ, భగీరథ్ ప్యాలెస్, చావరి బజార్, కరోల్ బాగ్, దరియాగంజ్ వంటి కీలక మార్కెట్లు ‘లాక్‌డౌన్’ వంటి పరిస్థితులను ఎదుర్కొంటాయని పేర్కొంటున్నాయి. ప్రతిరోజూ పారిశ్రామిక ప్రాంతాల నుండి వచ్చే 5,000 ట్రక్కులు, టెంపోలతో పాటు, ఇతర రాష్ట్రాలకు సరుకును తీసుకెళ్లే 3,000 వాహనాల రవాణా నిలిచిపోయే ప్రమాదం ఉందని వారు తెలిపారు.
Also Read: యలహంక ప్యాలెస్ నాదే.. దేవుడి సాక్షిగా ఇదే నిజం.. వైఎస్ షర్మిల సంచలన ప్రకటన!
సింఘు, తిక్రీ, గాజీపూర్, బదర్‌పూర్ సరిహద్దుల గుండా అక్టోబర్ 31 రాత్రి నుంచే ర్యాలీ వాహనాలు దిల్లీలోకి చేరుకునే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో దిల్లీకి సరుకు పంపడానికి ట్రేడర్లు వెనుకాడుతున్నారని పేర్కొన్నారు. అక్టోబర్ 10న జంతర్ మంతర్ వద్ద కేవలం 5,000 నుండి 7,000 మంది కూడిన సమావేశానికే దాదాపు 8 గంటల పాటు తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురయ్యాయని, మరి 10 లక్షల మంది వస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఆలోచించాలని సీటీఐ ప్రతినిధులు కోరుతున్నారు.