Rapido Delivery Rider: ఇంట్లో వస్తువులు మరచిపోయినా, ఫ్రెండ్స్‌కు అర్జెంట్‌గా ఏమైనా పంపాలన్నా మనకు వెంటనే గుర్తొచ్చేది యాప్ డెలివరీ. ఎంతైనా డిజిటల్ జమానా కదా మరి! అయితే, ఆ నమ్మకాన్నే ఆసరాగా చేసుకుని ఒక ర్యాపిడో డెలివరీ బాయ్ తన చేతివాటం చూపించాడు. పంపింది బంగారం అని తెలియగానే, పెట్రోల్ ఖర్చులు కూడా వసూలు చేసి మరీ పరారయ్యాడు.
సెక్యూరిటీ గార్డు దగ్గర పార్సిల్.. సైలెంట్‌గా జంప్!
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌కు చెందిన ఒక వివో సంస్థ అడ్మిన్ మేనేజర్, నాగోల్‌లో ఉన్న తన బంధువుల ఇంటికి రూ.62,383 విలువైన బంగారు నగలు పంపాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ర్యాపిడోలో రైడ్‌ను బుక్ చేసి, బిల్డింగ్ సెక్యూరిటీ గార్డు చేతికి ఆ పసిడి పార్సిల్ ఇచ్చి పంపాడు. డెలివరీ బాయ్ కూడా వచ్చినట్టే వచ్చి చాలా పద్ధతిగా పార్సిల్ అందుకున్నాడు.
పెట్రోల్ ఖర్చు అని చెప్పి.. రూ.100 అదనం!
ఇక్కడే ఉందండీ అసలు ట్విస్ట్! నాగోల్ అంటే కొంచెం దూరం కదా అని మన డెలివరీ మహాశయుడు ‘సార్.. పెట్రోల్‌కు డబ్బుల్లేవు, ఒక రూ.100 ఫోన్‌పే చేయండి’ అని అమాయకంగా అడిగాడు. మేనేజర్ కూడా ఏమాత్రం సందేహించకుండా వెంటనే ఆ వంద రూపాయలు ట్రాన్స్‌ఫర్ చేశాడు. ఇక అంతే! సదరు రైడర్‌కు పండగొచ్చింది. బంగారం, పైగా పెట్రోల్ డబ్బులు కూడా చేతికి అందడంతో నాగోల్ వైపు వెళ్లకుండా నేరుగా సూటిగా పరారయ్యాడు.
ఫోన్ బ్లాక్.. పోలీసుల ఎంట్రీ!
సమయం గడుస్తున్నా పార్సిల్ నాగోల్ చేరకపోవడంతో మేనేజర్‌కు అనుమానం వచ్చి రైడర్‌కు ఫోన్ చేశాడు. మనోడు ఏం చేస్తాడు? టక్కున నంబర్ బ్లాక్ చేసి స్విచ్ ఆఫ్ చేసేశాడు. వెంటనే ర్యాపిడో కస్టమర్ కేర్‌కు ఫోన్ చేస్తే అక్కడా సరైన స్పందన లేదు. చివరికి మోసపోయానని గ్రహించిన బాధితుడు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసి, ఆ పసిడి తెలివితేటలు ప్రదర్శించిన రైడర్ కోసం వేట మొదలుపెట్టారు.
Also Read: గుండెల్ని పిండేసే ఘటన.. పాఠశాలలో బాలికపై రంపంతో దాడి, సీఎం చంద్రబాబు ఏమన్నారంటే?