Conrad Hotel: బెంగళూరులోని ప్రముఖ ఫైవ్‌స్టార్ హోటల్ ‘కాన్రాడ్’ (Conrad)లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. హోటల్‌లోని స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతుండగా విద్యుత్ షాక్ తగిలి ఇద్దరు విదేశీ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
హోటల్‌లోని మూడో అంతస్తులో ఉన్న స్విమ్మింగ్ పూల్ లోకి దిగిన సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతి చెందిన వారిలో ఒకరు జర్మనీకి చెందిన 57 ఏళ్ల అలెగ్జాండర్ మాక్సిమిలియన్ థీస్ కాగా.. మరొకరు స్లొవేకియాకు చెందిన 45 ఏళ్ల జురాజ్ హోర్వాత్ గా గుర్తించారు. అలెగ్జాండర్ ‘లుఫ్తాన్సా’ (Lufthansa) ఎయిర్‌లైన్స్‌లో క్రూ మెంబర్‌గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. అటు జురాజ్ ‘ఐబీఎమ్’ (IBM)లో ప్రాజెక్ట్ మేనేజర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నట్లు సమాచారం.
అయితే ప్రమాద సమయంలో వారిద్దరినీ కాపాడేందుకు ప్రయత్నించిన మరో ఇద్దరు కూడా విద్యుత్ షాక్‌కు గురై గాయపడ్డారు. అమెరికాకు చెందిన మ్యాథ్యూ డెసాంటిస్ (41) అనే హోటల్ అతిథితో పాటు, పూల్ అటెండెంట్‌గా పనిచేస్తున్న రాహుల్ తివారీ (28) తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను హుటాహుటీనా స్థానిక మణిపాల్ ఆసుపత్రికి తరలించడంతో వైద్యులు వారికి అత్యవసర చికిత్సను అందిస్తున్నారు. గాయపడ్డ ఇద్దరికీ ప్రాణాపాయం లేదని వైద్యులు ధ్రువీకరించారు.A
Also Read: రాహుల్ ఒప్పుకోలేదు.. మీరైనా జోక్యం చేసుకోండి.. ఇండియా కూటమి నేతలకు దిల్లీ వ్యాపారుల వేడుకోలు!
మరోవైపు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఒక రాత్రి బసకే దాదాపు రూ. 25,000 వరకు చార్జ్ చేసే ఈ లగ్జరీ కాన్రాడ్ హోటల్‌లో ఇలాంటి భద్రతా లోపాలు తలెత్తడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పైగా ప్రమాదంపై హోటల్ యాజమాన్యం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. అయితే శనివారం ఉదయం హోటల్ వెబ్‌సైట్‌లో స్విమ్మింగ్ పూల్‌ను ‘అక్టోబర్ 31 నుండి నవంబర్ 30 వరకు మరమ్మతుల నిమిత్తం మూసివేస్తున్నాం’ అని నోటీస్ ఉంచడం గమనార్హం.
Also Read: యలహంక ప్యాలెస్ నాదే.. దేవుడి సాక్షిగా ఇదే నిజం.. వైఎస్ షర్మిల సంచలన ప్రకటన!