TVK Government: తమిళనాడులో కార్తీక దీపం వివాదం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. తిరుప్పరంకుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించడానికి అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం సవాలు చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు రివ్యూ పిటిషన్ ను దాఖలు చేసింది. రాష్ట్ర హిందూ మత ధర్మాదాయ శాఖ కమిషనర్ ఆధ్వర్యంలో ఈ పిటిషన్ దాఖలు కావడం గమనార్హం. అసలు వివాదానికి గల కారణాలేంటో చూద్దాం.
నవంబర్ 20న సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ విపుల్ ఎం. పంచోలిలతో కూడిన ధర్మాసనం.. కార్తీక దీపం వివాదంపై తీర్పు వెలువరించింది. తిరుప్పరంకుండ్రం కొండపై ఉన్న దీపదూణ్ (దీప స్తంభం) వద్ద దీపం వెలిగించేందుకు అనుమతిస్తూనే.. మద్రాసు హైకోర్టు తీర్పులోని కొన్ని అంశాలపై స్టే విధించింది. పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో నవంబర్ 24న ఒకసారి మాత్రమే దీపం వెలిగించేందుకు కోర్టు అనుమతించింది.
అంతేకాకుండా కార్తీక దీపం ఏర్పాటుకు సంబంధించి కఠిన షరతులు విధించింది. ఆ ప్రాంతంలోకి సాధారణ ప్రజలు, ఊరేగింపులు, నిరసన ప్రదర్శనలకు అనుమతి లేదని తేల్చి చెప్పింది. కేవలం ఆలయ నిర్వాహకులు, ప్రభుత్వ అధికారులకు మాత్రమే అక్కడికి వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు మదురై జిల్లా కలెక్టర్ ను నోడల్ అధికారిగా నియమించడంతో పాటు భద్రత కోసం అవసరమైతే సీఐఎస్ఎఫ్ (CISF) బలగాలను మోహరించేందుకు అనుమతి ఇచ్చింది.
అయితే సుప్రీంకోర్టు తీర్పుపై విజయ్ ప్రభుత్వంలో అసంతృప్తికి కారణమైంది. సాధారణంగా కార్తీక దీపాన్ని ఉచ్చిపళ్లైయార్ ఆలయ సమీపంలోని దీప మండపంలో వెలిగిస్తారని ప్రభుత్వం చెబుతోంది. వివాదస్పద రాతి స్తంభం ‘దీపదూణ్’ దీపం వెలిగించే సంప్రదాయమే లేదని వాదిస్తోంది. పైగా సదరు స్తంభం హజ్రత్ సుల్తాన్ సికిందర్ బాదుషా ఔలియా దర్గాకు 50 మీటర్ల దూరంలోనే ఉందని.. అక్కడ దీపం వెలిగించడం వల్ల శాంతి భద్రతలు, మత సామరస్యానికి విఘాతం కలగొచ్చని ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలుచేసింది.
Also Read: ఢిల్లీలో రూ.55 లక్షల బంగారం మాయం.. 6 రోజుల తర్వాత బెంగళూరులో ట్విస్ట్.. చివరకు ఏం జరిగిందంటే?
అయితే విజయ్ ప్రభుత్వం వేసిన రివ్యూ పిటిషన్ పై బీజేపీ తీవ్రంగా మండిపడింది. సుప్రీంకోర్టు ఉత్తర్వులను సమీక్షించాలని కోరుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ టీవీకే ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వం హిందూ వ్యతిరేక వైఖరి అవలంభిస్తోందని ఆరోపించారు. ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులను గౌరవిస్తూ అందరూ సంయమనం పాటిస్తుండగా.. టీవీకే ప్రభుత్వం మాత్రం రివ్యూ పిటిషన్ దాఖలు చేసేందుకు ఎందుకు తొందరపడుతోందని ప్రశ్నించారు. ‘కందర్ కొండ’ను ‘సికందర్ కొండ’గా మార్చడానికి ఉత్సాహపడుతోందా? అని ప్రశ్నించారు.
Also Read: బిస్లెరీ వాటర్ తాగుతున్నారా? జాగ్రత్త.. ఆ నీటిలో క్యాన్సర్ కారకాలు.. FSSAI సంచలన ప్రకటన!