Railway Staff Honesty: వందే భారత్ రైలులో ప్రయాణిస్తున్న ఓ సింగపూర్ పర్యాటకుడు పొరపాటున తన బ్యాగ్‌ను రైలులోనే మరిచిపోయాడు. ఆ బ్యాగ్ లో పెద్ద మొత్తంలో నగదు కూడా ఉంది. అయితే, ఇంత విలువైన బ్యాగ్ దొరికినా రైల్వే సిబ్బంది నిజాయితీగా వ్యవహరించి ప్రయాణికుడికి తిరిగి అప్పగించారు. సిబ్బంది మంచి మనసుకు అందరూ హ్యాట్సాఫ్ చెప్తున్నారు.
న్యూఢిల్లీ నుంచి వారణాసికి వెళ్లే వందే భారత్ ఎక్స్ ప్రెస్ (22416)లో లిమ్ వెంగ్ షాంగ్ అనే సింగపూర్ టూరిస్టు ప్రయాణించాడు. శుక్రవారం వారణాసి జంక్షన్‌లో రైలు దిగే సమయంలో తన బ్యాగుల్లో ఒకదాన్ని కోచ్‌లోనే మరిచిపోయాడు. ఆ తర్వాత రైలు మెయింటెనెన్స్ యార్డుకు చేరుకుంది. రైల్వే సిబ్బంది చెకింగ్స్, క్లీనింగ్ చేస్తుండగా, E1 కోచ్‌లోని 35వ సీటు దగ్గర ఓ బ్లాక్ బ్యాగ్ కనిపించింది. అటెండెంట్ అనూప్ కుమార్, క్లీనింగ్ సిబ్బంది కరణ్ సింగ్ ఆ బ్యాగును గుర్తించారు. వెంటనే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) అధికారులకు సమాచారం అందించారు.
ఆ బ్యాగును ఓపెన్ చేసిన రైల్వే అధికారులకు భారీ మొత్తంలో డబ్బు కనిపించింది. అందులో నాలుగు రకాల కరెన్సీలు ఉన్నాయి. భారతీయ కరెన్సీ రూ.2,11,000, మెరికన్ డాలర్లు 1,000, శ్రీలంక రూపాయలు 1,22,000, సింగపూర్ డాలర్లు 66 ఉన్నాయి. ఈ బ్యాగును అధికారులు భద్రంగా ఉంచి, సదరు ఫారినర్ కు అందించారు.
అటు తన బ్యాగ్ రైలులోనే మరిచిపోయానని గుర్తించిన షాంగ్ తన గైడ్‌తో కలిసి కంటోన్మెంట్ రైల్వే స్టేషన్‌కు తిరిగి వచ్చాడు. అక్కడ రైల్వే అధికారులను సంప్రదించి బ్యాగులోని వస్తువుల వివరాలు చెప్పాడు. RPF సబ్ ఇన్‌స్పెక్టర్ చరణ్ సింగ్, తన టీమ్ తో కలిసి ప్రయాణికుడి వివరాలను చెక్ చేశారు. అప్పటికే బ్యాగ్ దొరికినట్లు సమాచారం అందించింది. డిప్యూటీ స్టేషన్ సూపరింటెండెంట్ వకీల్ సింగ్ సమక్షంలో బ్యాగును పరిశీలించి, ఆ బ్యాగ్ అతడిదేనని నిర్ధారించుకున్నారు. అనంతరం బ్యాగులోని నగదు, ఇతర వస్తువులన్నింటినీ అతడికి తిరిగి అప్పగించారు.
డబ్బు, ఇతర విలువైన వస్తువులు సేఫ్ గా అందడంతో సింగపూర్ పర్యాటకుడు ఎంతో సంతోషపడ్డాడు. రైల్వే సిబ్బంది నిజాయితీ, వేగంగా రియాక్ట్ అయిన తీరును ప్రశంసించాడు. భారతీయ రైల్వే ఉద్యోగుల మంచి మనసుకు ఇది చక్కటి నిదర్శనం అని కొనియాడాడు. అటు సోషల్ మీడియాలో కూడా రైల్వే సిబ్బంది నిజాయితీ పట్ల ప్రశంసలు కురుస్తున్నాయి.
Read Also: రీల్స్ కోసం రైలు ఎక్కాడు.. కరెంట్ తగిలి కాలిపోయాడు!