State Governers : దేశంలోని పలు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నూతన గవర్నర్లను నియమించింది. ఈ మేరకు భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము కేంద్రం నిర్ణయానికి ఆమోదముద్ర వేయగా.. నూతన గవర్నర్ల నియామకం అమల్లోకి వచ్చినట్లైంది. దీంతో.. దేశంలోని మూడు రాష్ట్రాల్లోని గవర్నర్లు బదిలీలపై వేరే రాష్ట్రాలకు వెళ్లనుండగా… రెండు రాష్ట్రాలకు మాత్రం కొత్త గవర్నర్లను నియమించింది.
కొత్తగా మిజోరం గవర్నర్ గా జనరల్ విజయ్ కుమార్ సింగ్ ని రాష్ట్రపతి నియమించగా, మణిపూర్ గవర్నర్ గా కేంద్ర హోం శాఖ మాజీ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లాను నియమిస్తూ రాష్ట్రపతి నిర్ణయం తీసుకున్నారు. కాగా.. ఇప్పటికే గవర్నర్లుగా ఉన్నా వారికి కొత్త రాష్ట్రాల్లో బాధ్యతల్ని అప్పగించారు. వారిలో.. ప్రస్తుతం మిజోరం గవర్నర్‌గా ఉన్న డాక్టర్ కంభంపాటి హరిబాబు ను ఒడిశా గవర్నర్‌గా నియమించగా.. బిహార్ గవర్నర్‌గా కొనసాగుతున్న రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను కేరళకు గవర్నర్‌గా పంపించారు. ఇలాగే.. ప్రస్తుతం కేరళ గవర్నర్‌గా ఉన్న ఆరీఫ్ మహ్మద్ ఖాన్‌ను బిహార్‌కు బదిలీ చేశారు.
ఇక.. తెలుగు రాష్ట్రానికి చెందిన కంభంపాటి హరిబాబుకు కేంద్రం గవర్నర్ పదవితో గౌరవిస్తూ వస్తోంది. ఈయన ప్రకాశం జిల్లాలోని తిమ్మసముద్రం గ్రామంలో జన్మించారు. విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్శిటిలో ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. తర్వాత అదే విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ పొందారు.
ఆంధ్రా యూనివర్శిటీలోనే అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేసి.. 1993లో స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన హరిబాబు.. క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించారు. తొలినాటి నుంచి ఏపీ బీజేపీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. బీజేపీలో ఎమ్మెల్యేగా, ఎంపీగా వివిధ రకాలుగా ప్రజాప్రతినిధిగా కొనసాగిన కంభంపాటి హరిబాబు… క్రీయాశీలక రాజకీయాల నుంచి తప్పుకుని.. 2021 జులైలో తొలిసారి మిజోరం గవర్నర్ గా నియమితులైనారు. ఇక ఇప్పటి నుంచి గవర్నర్ గానే కొనసాగిస్తూ..కేంద్రం తగిన గుర్తింపును ఇచ్చింది. తాజాగా జరిగిన మార్పుచేర్పుల్లోనూ.. మరోమారు గవర్నర్ గా అవకాశం కల్పించి గౌరవించింది.
Also Read :
ఇటీవల ఒడిశా గవర్నర్ రఘుబర్‌దాస్ రాజీనామా చేశారు. ఆయన రాజీనామమాను ఆమోదించిన భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము.. తాజాగా ఆయన స్థానంలో కంభంపాటి హరిబాబును నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.