Big Stories

Farmers Protest in Delhi Live Updates: దేశ రాజధానిలో హై టెన్షన్.. అన్నదాత పోరు బాట.. ఢిల్లీలో 144 సెక్షన్!

Farmers March in Delhi: అన్నదాతలు మరోసారి పోరు బాట పట్టారు. దేశ రాజధానివైపు దండుగా కదిలి వచ్చేందుకు సమాయత్తమయ్యారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంతో పాటు తమ ఇతర డిమాండ్లు పరిష్కరించేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు దాదాపు 200కు పైగా రైతు సంఘాలు రేపు ఢిల్లీ చలో పేరుతో కార్యక్రమం నిర్వహించేందుకు రెడీ అయ్యాయి. వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు 20 వేలమంది రైతులు ఢిల్లీకి వచ్చే అవకాశాలున్నాయని నిఘా వర్గాలు అంచనా వేశాయి.

- Advertisement -

ఢిల్లీ నిర్వహించే ఆందోళనను ఎలా చేపట్టాలన్న దానిపై రైతు సంఘాలు 40 సార్లు రిహార్సల్‌ నిర్వహించాయని నిఘా వర్గాలు అంచనా వేశాయి. అందులో పంజాబ్‌లో 30, హరియాణాలో 10 జరిగాయని తెలిపాయి. 2,000-2,500 ట్రాక్టర్లను మంగళవారం దేశ రాజధానికి తీసుకొచ్చేందుకు రైతులు సన్నద్ధమవుతున్నారని పేర్కొన్నాయి. పంజాబ్‌, రాజస్థాన్‌, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌, కర్ణాటక,కేరళల నుంచి కర్షకులు కార్లు, ద్విచక్రవాహనాలు, మెట్రో, రైళ్లు, బస్సుల ద్వారా కూడా దిల్లీకి చేరుకుంటారని తెలిపాయి. దాంతో హరియాణా, ఢిల్లీ పోలీసులు అప్రమత్తవుతున్నారు. దీంతో కేంద్రం అలర్టైంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ముందస్తు చర్యలను తీసుకుంది.

- Advertisement -

ప్రస్తుతం ఢిల్లీ సరిహద్ధుల్లో భారీగా బలగాలను మోహరించారు పోలీసులు. ఎట్టి పరిస్థితుల్లో ఢిల్లీలోకి రైతులు ప్రవేశించకుండా అధికారులు సరిహద్దుల్లో అన్ని చర్యలు తీసుకుంటున్నారు. సింఘూ, ఘాజీపూర్‌, టిక్రి సరిహద్దుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. భారీగా బారికెడ్లు, కాంక్రీట్‌ దిమ్మెలు, పెద్ద కంటెయినర్లను రోడ్లపై ఉంచుతున్నారు. రైతుల వాహనాలు పంక్చర్‌ అయ్యేలా పలు చోట్ల ఇనుప మేకులు కూడా ఏర్పాటు చేశారు.

హర్యానా-ఢిల్లీ, యూపీ-ఢిల్లీ సరిహద్దులు ఇప్పుడు శత్రుదుర్భేధ్యంగా మారాయి. అంతేకాదు బస్సు, రైలు లేదా ఏ ఇతర మార్గంలోనూ రైతులు ఢిల్లీలోకి ప్రవేశించకుండా చూసేలా పలు బృందాలతో నిఘా పెట్టారు. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో కూడా 144 సెక్షన్‌ కూడా విధించి నిషేద్ఞాలు అమలు చేస్తున్నారు. ఢిల్లీ చలో ఆందోళనకు పంజాబ్‌, హర్యానా, ఉత్తరప్రదేశ్‌ నుంచి పెద్ద ఎత్తున రైతులు వచ్చే అవకాశం ఉన్నదని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇప్పటికే కేంద్రం రైతులతో ఒకసారి చర్చలు జరపగా అవి విఫలమయ్యాయి. ఈరోజు మరోసారి కేంద్రం రైతు సంఘాలతో చర్చలు జరపనుంది. మరోవైపు పంజాబ్, హర్యానా, యూపీ నుంచి రైతులు ఈరోజు ఢిల్లీకి బయల్దేరే అవకాశం కనిపిస్తోంది.

అంబాలా, కురుక్షేత్ర సహా ఏడు జిల్లాల్లో మొబైల్‌ ఇంటర్నెట్‌, బల్క్‌ SMS సేవలపై ఆంక్షలు విధించారు. చాలా జిల్లాల్లో 144 సెక్షన్‌ అమల్లోకి వచ్చింది. ట్రాకర్లకు డీజీల్‌ ఫిల్లింగ్‌ను 10 లీటర్ల వరకే పరిమితం చేసింది. హర్యానా ప్రభుత్వం చౌదరి దల్బీర్ సింగ్ ఇండోర్ స్టేడియం, సిర్సా, గురుగోవింద్ సింగ్ స్టేడియం, దబ్వాలిని తాత్కాలిక జైళ్లుగా మార్చింది. ఆందోళనకు దిగుతున్న రైతులను ఈ స్టేడియాల్లో ఉంచనున్నారు. హర్యానాలోని 15 జిల్లాల్లో సెక్షన్ 144 విధించారు.

ఇక ఈరోజు సంయుక్త కిసాన్‌ మోర్చా, కిసాన్‌ మజ్దూర్‌ మోర్చా సంఘాల ప్రతినిధులతో చర్చలు జరపనున్నారు కేంద్ర మంత్రులు పీయూష్‌ గోయల్‌, అర్జున్‌ ముండా, నిత్యానంద్‌ రాయ్‌. పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసుల అమలు చేయాలని రైతుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వీటితో పాటు.. రైతు రుణాల మాఫీ, రైతులు, వ్యవసాయ కార్మికులకు పింఛను, లఖింపూర్‌ బాధితులకు న్యాయం, రైతులపై ఉన్న కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి రైతు సంఘాలు.

మరోవైపు రైతుల నిరసనకు కాంగ్రెస్ మద్దతు పలికింది. పంజాబ్‌లో జరిగిన సభలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే రైతుల ఉద్యమానికి మద్దతునిస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News