Big Stories

Karnataka Elections : కర్ణాటకలో క్లైమాక్స్ కు చేరిన ప్రచారం.. నేటితో మైకులు బంద్..

Karnataka Elections : కర్ణాటక ఎన్నికల కురుక్షేత్రంలో కీలక ఘట్టం ముగియనుంది. ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. సాయంత్రం 5 గంటల తర్వాత మైకులు మూగబోనున్నాయి. నెల రోజులుగా గెలుపే లక్ష్యంగా పార్టీలన్నీ ప్రచారం కొనసాగిస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్‌ల మధ్య త్రిముఖ పోరు నెలకొంది. పార్టీల వివాదాస్పద నిర్ణయాలు, వ్యాఖ్యలతో రాష్ట్రం హీటెక్కింది. ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ అగ్రనేతలు ప్రచారంలో పాల్గొన్నారు. మరోసారి అధికారాన్ని నిలబెట్టుకోవాలన్న లక్ష్యంతో బీజేపీ తరఫున ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా, కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై స్టార్ క్యాంపెయినర్లుగా ప్రచారం చేశారు. వీరికి మద్దతుగా నటుడు సుదీప్ కిచ్చా కూడా ఎన్నికల ర్యాలీల్లో పాల్గొన్నారు.

- Advertisement -

ఈ సారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూస్తున్న హస్తం నేతలు కూడా తీవ్రంగానే శ్రమించారు. బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనాయకులు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలతోపాటు సీఎం రేసులో ఉన్న సిద్ధరామయ్య, డీకే శివ కుమార్ ప్రచారంలో దూసుకుపోయారు. బీజేపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, 40 పర్సెంట్ కమిషన్ సర్కార్ అంటూ కమలాన్ని ఇరుకునే పెట్టే ప్రయత్నాలు చేశారు. ముందస్తు సర్వే ఫలితాలు ఇచ్చిన ఉత్సాహంతో ప్రచారంతో హోరెత్తించారు. బీజేపీ, కాంగ్రెస్‌కు పోటీగా తనకు పట్టున్న ప్రాంతాల్లో జేడీఎస్ అధినేత కుమార్ స్వామి కూడా గట్టిగానే ప్రచారం చేశారు. ముఖ్యంగా రైతులను ఆకర్షించేలా ఆయన ప్రచారం కొనసాగింది.

- Advertisement -

కర్ణాటక ఎన్నికలను రాబోయే సార్వత్రిక ఎలక్షన్‌కు సెమీ ఫైనల్ గా భావిస్తున్నారు. అందుకే ఈ ఎన్నికలను బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇక్కడ గెలిచి లోక్‌సభ ఎన్నికలకు సిద్ధం కావాలని భావిస్తున్నాయి. ఇక అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తామని బీజేపీ హామీ ఇవ్వడం, భజరంగ్ దళ్‌ను బ్యాన్ చేస్తామని కాంగ్రెస్ అనడం, దానికి బీజేపీ కౌంటర్, ఖర్గే హత్యకు కుట్ర ఆరోపణలు కర్ణాటక పాలిటిక్స్‌ను షేక్ చేస్తున్నాయి. భజరంగ్ దళ్‌ బ్యాన్ అంశం పెద్ద దుమారమే రేపింది. దీనిపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. హస్తానికి కౌంటర్‌గా అన్ని గ్రామాల్లో హనుమాన్ చాలీసా పఠనానికి పిలుపునిచ్చింది. కాంగ్రెస్‌ను హిందూ వ్యతిరేకిగా చిత్రీకరిస్తూ..ఆ వర్గం ఓట్లను రాబట్టే ప్రయత్నం చేసింది. ప్రధాని మోదీ కూడా దీన్ని ప్రధాన ప్రచార అస్త్రంగా చేసుకుని కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. ఇక ఖర్గే హత్యకు కుట్ర ఆరోపణ కూడా కన్నడ రాజకీయాల్లో చర్చనీయాంశంగా అయింది.

ఈసారి కర్నాటక ఎన్నికల్లో పార్టీల ఉచిత హామీలు చర్చనీయాంశమైయ్యాయి. పేద కుటుంబాలకు ప్రతి రోజు అరలీటరు నందిని పాలను ఉచితంగా ఇస్తామని బీజేపీ ప్రకటించింది. ప్రతి నెలా 5 కిలోల బియ్యం, 5 కిలోల తృణ ధాన్యాలను అందిస్తామని హామీ ఇచ్చింది. అలాగే ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పింది. ఇక ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చింది. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి గ్యారంటీ కార్డ్ ఇస్తామని తెలిపింది. నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు నెలకు 3 వేల రూపాయలు , డిప్లొమా ఉన్నవారికి నెలకు 1,500 రూపాయల చొప్పున భృతి ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. మొత్తానికి ఈ నెల 10న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం.. అన్ని పార్టీలు సర్వశక్తులా పోరాడుతున్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News