Big Stories

Pervez Musharraf : కార్గిల్ కుట్రదారుగా మారి.. ప్రధానినే దించి… ముషారఫ్ ప్రస్థానం సాగిందిలా..

Pervez Musharraf : జనరల్‌ పర్వేజ్‌ ముషారఫ్ సైనికుడి నుంచి పాకిస్థాన్ అధ్యక్షుడిగా ఎదిగిన వ్యక్తి. కుట్రలు, కుతంత్రాలు ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. పాక్ అధ్యక్షుడిగా ఎనిమిదేళ్లపాటు నియంతలా పాలించారు. ఆ సమయంలో అనేక వివాదాల్లో చిక్కుకున్నారు. మాజీ ప్రధాని బెనజీర్‌ భుట్టో హత్యతోసహా అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. పదవి కాంక్షతో రాజ్యాంగాన్నే రద్దు చేసి సంచలనం సృష్టించారు. దేశంలో అత్యవసర స్థితిని విధించారు.

- Advertisement -

సైన్యంలో చేరి..
1961లో పాకిస్థాన్‌ మిలిటరీ అకాడమీలో మషారఫ్ సైనిక శిక్షణ తీసుకున్నారు. 1964లో పాక్‌ సైన్యంలో చేరారు. 1965 ఇండో-పాకిస్థాన్‌ యుద్ధంలో సెకండ్‌ లెఫ్టినెంట్‌గా పనిచేశారు. అఫ్గాన్‌ అంతర్యుద్ధంలోనూ కీలక పాత్ర పోషించారు. మిలిటరీలో చేరిన ఏడాదికే ముషారఫ్‌ను భారత సరిహద్దుల్లో విధులకు పంపారు. అదే సమయంలో భారత్‌- పాక్‌ మధ్య యుద్ధం జరిగింది. ఆ తర్వాత ముషారఫ్‌ స్పెషల్‌ సర్వీస్‌ గ్రూప్‌లో చేరారు. 1971 యుద్ధం సమయంలో ఎస్‌ఎస్‌జీ బెటాలియన్‌ కంపెనీ కమాండర్‌గా వ్యవహరించారు. 1990ల్లో మేజర్‌ జనరల్‌గా పదోన్నతి పొందారు. డిప్యూటీ మిలిటరీ సెక్రటరీ, మిలిటరీ ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ జనరల్‌గానూ వ్యవహరించారు.

- Advertisement -

కార్గిల్‌ యుద్ధం..
భారత్‌, పాక్‌ మధ్య జరిగిన కార్గిల్‌ యుద్ధానికి ముషారఫ్‌ ప్రధాన కారకుడు. సియాచిన్‌ ప్రాంతంలో భారత్‌ పట్టును ఆయన సహించలేకపోయారు. అందుకే కార్గిల్‌ చొరబాటుకు 1988-89 మధ్య అప్పటి పాక్‌ ప్రధాని బెనజీర్‌ భుట్టోకు ప్రతిపాదించారు. 1992-95 మధ్య పాక్‌-అమెరికా మధ్య జరిగిన అనేక ఉన్నతస్థాయి సమావేశాల్లో భుట్టోతో కలిసి ముషారఫ్‌ పాల్గొన్నారు. అయితే యుద్ధ భయంతో భుట్టో వెనక్కి తగ్గారు. కానీ ముషారఫ్‌ మాత్రం 1999 మార్చి నుంచి మే మధ్య కార్గిల్‌ ప్రాంతంలోకి రహస్యంగా పాక్‌ సైన్యాన్ని జొప్పించారు. ఈ విషయాన్ని భారత్‌ గుర్తించడంతో రెండు దేశాల మధ్య యుద్ధం మొదలైంది. అయితే ఈ విషయం అప్పటి పాక్ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌కు తెలియదు. కార్గిల్‌ యుద్ధ సమయంలో నాటి భారత ప్రధాని వాజ్‌పేయీ.. షరీఫ్‌కు ఫోన్‌ చేస్తే యుద్ధం గురించి తనకేమీ తెలియదని చెప్పారట

నవాజ్ షరఫ్ ను గద్దె దించి..
చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌గా ఉన్న జనరల్‌ కరామత్‌కు, ప్రధాని నవాజ్ షరీఫ్‌కు మధ్య విబేధాలు రావడం ముషారఫ్ కు కలిసి వచ్చింది. కరామత్ ను పదవి నుంచి షరీఫ్‌ సర్కార్ తొలగించింది. దీంతో షరీఫ్‌ .. ముషారఫ్‌ కు ఫోర్‌ స్టార్‌ జనరల్‌గా పదోన్నతి కల్పించి చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌, జాయింట్ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ ఛైర్మన్‌గా నియమించారు. అయితే కార్గిల్‌ యుద్ధంతో ముషారఫ్‌, షరీఫ్‌ మధ్య విభేదాలు వచ్చాయి. ముషారఫ్‌ను పదవి నుంచి తొలగించి ఆ బాధ్యతలను ఖ్వాజా జియాయుద్దీన్‌కు అప్పగించాలని షరీఫ్‌ నిర్ణయించారు. ఈ విషయం తెలియగానే ముషారఫ్‌ 1999 అక్టోబర్ లో సైనిక తిరుగుబాటు చేశారు. షరీఫ్‌ను గద్దెదించారు. దేశంలో సైనిక పాలన విధించి అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. షరీఫ్‌ను గృహ నిర్బంధం చేసి ఆ తర్వాత అరెస్టు చేశారు. ఇలా పాకిస్థాన్ ముషారఫ్ చేతుల్లోకి వెళ్లిపోయింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News