Big Stories

Rajeev Gandhi : రాజీవ్ గాంధీ హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు..దోషులందర్నీ విడుదల చేయాలని ఆదేశం

రాజీవ్ గాంధీ హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు..
దోషులందర్నీ విడుదల చేయాలని ఆదేశం!

- Advertisement -

Rajeev Gandhi : మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. జీవిత ఖైదు అనుభవిస్తున్న దోషులందర్నీ విడుదల చేయాలని ఆదేశించింది. ఈ కేసులో 30 ఏళ్లకుపైగా జైలు శిక్ష అనుభవించిన దోషి ఎ.జి. పేరరివాళన్‌ను విడుదల చేయాలని ఈ ఏడాది మే 18న సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆర్టికల్ 142 కింద అసాధారణ అధికారాలను ఉపయోగించి సుప్రీం ఈ ఆదేశాలను వెలువరించింది. ఈ నేపథ్యంలో తమను కూడా ముందస్తుగా విడుదల చేయాలని కోరుతూ దోషులు నళిని, రవిచంద్రన్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ బీవీ నాగరత్నతో కూడిన ధర్మాసనం.. పేరరివాళన్‌ కేసులో తీర్పే పిటిషనర్లకు వర్తిస్తుందని స్పష్టం చేసింది. వారితోపాట రాబర్ట్‌ పయాస్‌, జయకుమార్‌, మురుగన్‌, శాంతన్‌ ను విడుదల చేయాలని ఆదేశించింది. ఇతర కేసుల్లో దోషులకు జైలు శిక్ష అవసరం లేకపోతే.. వారిని జైలు నుంచి విడుదల చేయాలని స్పష్టం చేసింది.

- Advertisement -

నిందితులను విడుదల చేసేందుకు తమిళనాడు ప్రభుత్వం గతంలోనే అంగీకరించింది. ఈ నిర్ణయాన్ని సోనియా గాంధీ కుటుంబం వ్యతిరేకించలేదు. ప్రతివాదులుగా ఉన్న కేంద్రం సహా అందరి అభిప్రాయాలను సుప్రీంకోర్టు స్వీకరించింది. ఈ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని దోషుల విడుదలకు ఉత్తర్వులు ఇస్తున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రస్తుతం పేరరివాళన్‌ మినహా మిగతా ఆరుగురు దోషులు తమిళనాడులోని వేలూరు జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు.

1991 మే 21న తమిళనాడులోని శ్రీపెరంబుదూరులో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న రాజీవ్‌ గాంధీపై ధను అనే మహిళ ఆత్మాహుతి దాడికి పాల్పడింది. ఈ దాడిలో రాజీవ్‌ గాంధీతోపాటు మరో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో ఏడుగురిని దోషులుగా తేలుస్తూ 1998లో ఉగ్రవాద వ్యతిరేక కోర్టు మరణశిక్ష విధించింది. ఆ తర్వాత ఏడాదే పేరరివాళన్‌, మురుగన్‌, నళిని, శాంతన్‌ మరణశిక్షను సుప్రీంకోర్టు నిలిపివేసింది. 2014లో పేరరివాళన్‌, శాంతన్‌, మురుగన్‌ మరణశిక్షను జీవితఖైదుగా తగ్గించింది. సోనియాగాంధీ విజ్ఞఫ్తితో 2000 సంవత్సరంలో నళిని మరణశిక్షను యావజ్జీవ కారాగార శిక్షకు తగ్గించారు. ఆ తర్వాత మిగతా ముగ్గురు దోషుల మరణశిక్షను జీవితఖైదుకు తగ్గించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News