VVS Laxman : T20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో ఘోరంగా ఓడిపోయిన టీమిండియా… మరో వారం రోజుల్లో న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనకు సీనియర్ ఆటగాళ్లు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, మహ్మద్ షమీకి సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. దీంతో టీ20 సిరీస్‌కు హార్దిక్ పాండ్యా.. వన్డే సిరీస్‌కు శిఖర్ ధావన్ కెప్టెన్లుగా వ్యవహరించబోతున్నారు.
సీనియర్ ఆటగాళ్లకే కాదు… న్యూజిలాండ్ పర్యటన నుంచి టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు కూడా విశ్రాంతి ఇవ్వాలి అని బీసీసీఐ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ద్రవిడ్ స్థానంలో… జాతీయ క్రికెట్ అకాడమీ-NCA డైరెక్టర్ అయిన VVS లక్ష్మణ్‌కు మరోసారి భారత తాత్కాలిక హెడ్ కోచ్ బాధ్యతలు అప్పగించబోతున్నారని చెబుతున్నారు. అదే జరిగితే కొత్త కోచ్ నేతృత్వంలో కివీస్ తో తలపడుతుంది… భారత జట్టు.
న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా మూడు T20లు, మూడు వన్డే మ్యాచ్ లు ఆడనుంది. నవంబర్ 18న వెల్లింగ్టన్ వేదికగా జరిగే తొలి T20తో న్యూజిలాండ్ లో భారత పర్యటన మొదలవుతుంది. అయితే T20ల్లో ఒక జట్టు, వన్డేల్లో మరో జట్టు కివీస్ తో తలపడతాయి. T20 టీమ్ కు హార్ధిక్ పాండ్యా నాయకత్వం వహించనుండగా… రిషబ్ పంత్ వైస్ కెప్టెన్ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. T20 జట్టులోని మిగతా ఆటగాళ్లలో సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్, దీపక్ హుడా, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, చాహల్, కుల్దీప్ యాదవ్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్ ఉన్నారు. ఇక భారత వన్డే జట్టుకు శిఖర్ ధవన్ సారథ్యం వహించనుండగా… రిషబ్ పంత్ వైస్ కెప్టెన్ బాధ్యతలు చూసుకుంటాడు. వన్డే జట్టులోని మిగతా ఆటగాళ్లలో… సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్, దీపక్ హుడా, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, శార్ధూల్ ఠాకూర్, షాబాజ్ అహ్మద్, చాహల్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, దీపక్ చాహర్, కుల్దీప్ సేన్, ఉమ్రాన్ మాలిక్ ఉన్నారు.