Tributes : భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణించారు. ఈయన మరణ వార్త తెలిసి దేశవాసులంతా తీవ్ర భావోద్వేగాలకు గురవుతున్నారు. పదేళ్ల పాటు దేశానికి దిశా నిర్దేశం చేసిన మన్మోహన్ సింగ్..92 ఏళ్ల వయస్సులో చివరి శ్వాస విడిచారు. ఈయన సేవల్ని కొనియాడుతూ అనేక మంది స్పందిస్తున్నారు.కాగా.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సహా ప్రధాని మోదీలు సంతాపం ప్రకటించారు. వారి ఆత్మకు శాంతికలగాలని ఆకాంక్షించారు.
“మాజీ ప్రధాని డా.మన్మోహన్ సింగ్ సంతాపం అరుదైన రాజకీయ నేత. ఆయన చివరి వరకు విలువల్ని ఆచరించి చూపించారు. ప్రభుత్వంలోని వివిధ స్థాయిల్లో పనిచేసిన ఆయన ఎంతో విలువైన కృషి చేశారు. దేశానికి ఆయన చేసిన సేవ, కళంకిత రాజకీయ జీవితం, అత్యంత వినయంతో కూడిన వ్యక్తిత్వం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆయన మరణం మనందరికీ తీరని లోటు. అలాంటి వ్యక్తిని నేను గౌరవప్రదమైన నివాళులు అర్పిస్తున్నాను. మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, అభిమానులకు నా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాను.
భరతమాత ముద్దు బిడ్డను కోల్పోయింది” అని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన సంతాపాన్ని ప్రకటించారు.
“భారత ఆర్థిక రంగాన్ని మార్చిన ప్రముఖ ఆర్థికవేత్త, మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణ వార్త తెలిసి చాలా బాధపడ్డాను. దేశ ఆర్థిక సరళీకరణ రూపశిల్పి, క్లిష్ట సమయంలో దేశాన్ని మార్పు వైపు నడిపించిన సాహసి. భారత ఉపరాష్ట్రపతిగా.. మన్మోహన్ సింగ్‌తో అర్థవంతమైన చర్చల్లో పాల్గొనే అవకాశం లభించింది. ఆర్థిక వ్యవస్థపై ఆయనకున్న ప్రగాఢ అవగాహన,దేశ పురోగతిపై అచంచలమైన నిబద్ధత నా స్మృతిలో ఎప్పటికీ నిలిచిపోతాయి. డాక్టర్ సింగ్ మరణంతో దేశం ఓ గొప్ప మేధావిని, నాయకుడిని, రాజనీతిజ్ఞుడిని కోల్పోయింది. ఈ క్లిష్ట సమయంలో ఆయన కుటుంబానికి, అసంఖ్యాక అభిమానులకు నా హృదయపూర్వక సానుభూతి తెలుపుతున్నాను” అంటూ భారత ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్ సంతాపం ప్రకటించారు.
‘‘భారత దేశం విశిష్టమైన వ్యక్తుల్లో ఒకరైన మన్మోహన్ సింగ్‌ను కోల్పోయింది. ఎంతో నిరాండబర వ్యక్తిగా ఉండే ఆయన ఆర్థికవేత్తగా ఎదిగారు. ప్రధానిగానే కాకుండా ఆర్థిక మంత్రితో పాటు ఎన్నో ప్రభుత్వ విభాగాల్లో పనిచేశారు. దేశ ఆర్థిక విధానంపై ఎన్నో ఏళ్లుగా బలమైన ముద్రవేశారు. పార్లమెంట్‌లో ఆయన ప్రసంగాలు గొప్పగా ఉండేవి. ప్రధానిగా దేశ ప్రజలు జీవితాలు మెరుగుపడేందుకు ఎంతో కృషి చేశారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానిగా, నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తరుచూ మాట్లాడుకునేవాళ్లం. పాలనకు సంబంధించిన పలు అంశాలపై చర్చించేవాళ్లం. ఆయన జ్ఞానం, వినయం ఎల్లప్పుడూ ప్రస్పుటించేవి. ఈ సమయంలో నా ఆలోచనలన్నీ ఆయన కుటుంబం చుట్టూ తిరుగుతున్నాయి’’ అని మోదీ పేర్కొన్నారు.