Manmohan Singh Life: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తుది శ్వాస విడిచారు. అనారోగ్యానికి గురైన మన్మోహన్ సింగ్ ను కుటుంబ సభ్యులు ఢిల్లీ ఎయిమ్స్ కు తరలించగా, చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. అయితే ఆర్థికవేత్తగా ప్రత్యేక గుర్తింపు పొంది, ప్రధానమంత్రిగా దేశానికి విశిష్ట సేవలు అందించిన మన్మోహన్ జీవితంలో ఎన్నో చెరగని పేజీలు ఉన్నాయి.
పంజాబ్ ప్రావిన్స్ లో సెప్టెంబర్ 26, 1932న మన్మోహన్ సింగ్ జన్మించారు. ప్రస్తుతం మన్మోహన్ సింగ్ జన్మించిన ప్రాంతం పాకిస్థాన్లో ఉండడం గమనార్హం. దేశ విభజన తర్వాత కుటుంబంతో సహా మన్మోహన్ కుటుంబం భారతదేశానికి వలస వచ్చింది. మన్మోహన్ సింగ్ బాల్యంలోనే తన తల్లిని కోల్పోయారు. మన్మోహన్ సింగ్ ఆలనాపాలనా ఆయన అమ్మమ్మ చూసుకొనేవారట.
మన్మోహన్ సింగ్ బాల్యంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారని చెప్పవచ్చు. కనీసం కరెంట్ కూడా లేని గ్రామంలో, దీపం వెలుగులోనే చదువుకునే వారట. మన్మోహన్ సింగ్ అమృత్సర్లోని హిందూ కళాశాలలో చదివారు. ఆ తర్వాత పంజాబ్ యూనివర్సిటీ నుండి బ్యాచిలర్స్, మాస్టర్స్ పొందారు. అంతేకాదు కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుండి తన ఎకనామిక్స్ ట్రిపోస్ చేసి, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుండి DPhil చదివారు.
మన్మోహన్ సాధించిన ఘనతలు ఇవే..
మన్మోహన్ 1966 నుండి 1969 వరకు యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్‌మెంట్ కోసం పనిచేశారు. లలిత్ నారాయణ్ మిశ్రా సహకారంతో విదేశీ వాణిజ్య మంత్రిత్వ శాఖకు సలహాదారుగా కూడా పనిచేశారు. 1972లో మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిత్వ శాఖలో ముఖ్య సలహాదారుగా, 1976లో ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు.
1982లో మన్మోహన్ సింగ్ ఆర్‌బీఐ గవర్నర్‌గా కూడా నియమితులయ్యారు. 1985 నుండి 1987 వరకు భారత ప్రణాళికా సంఘం డిప్యూటీ ఛైర్మన్‌గా ఉన్నారు. ఆసమయంలో 1987లో సింగ్‌కు పద్మవిభూషణ్ అవార్డు ఆయనకు వరించింది. 1991లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్‌గా నియమితులయ్యారు. తర్వాత 1991 జూన్‌లో పీవీ నరసింహారావు మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా నియమితులయ్యారు.
Also Read: Manmohan Singh: ఔను.. మన్మోహన్ సింగ్ ప్రేమలో పడ్డారు.. మీకు తెలుసా!
మన్మోహన్ సింగ్ 1991లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. మరలా 1995, 2001, 2007 మరియు 2013లో తిరిగి రాజ్యసభకు ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పాలనలో మన్మోహన్ సింగ్ మే 22, 2004న భారతదేశ 14వ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. రెండు దఫాలుగా పదేళ్లు ప్రధానమంత్రిగా మన్మోహన్ దేశానికి సేవలు అందించారు. 2002లో ఆయనకు అత్యుత్తమ పార్లమెంటరీ అవార్డును కూడా మన్మోహన్ అందుకున్నారు. అంతేకాదు మన్మోహన్ సింగ్ ‘ప్రపంచంలోని టాప్ 100 ప్రభావవంతమైన వ్యక్తులలో ఒకరిగా తన ముద్రను వేసుకున్నారు.