Fox Sagar Lake: స్వేచ్ఛ బ్యూరో: లేక్ సిటీగా పేరుగాంచిన హైదరాబాద్‌లో మరో చారిత్రక చెరువును పూర్తి స్థాయిలో పునరుద్ధరించేందుకు హైడ్రా సిద్దమైంది. జీడిమెట్లలోని ఫాక్స్ సాగర్ చెరువును మినిట్యాంక్‌బండ్‌గా తీర్చిదిద్దే దిశగా హైడ్రా అడుగులు వేస్తుంది. 129 ఏళ్ల చరిత్ర కల్గిన ఈ చెరువును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ చెరువు పునరుద్ధరణ పనులు ప్రారంభించనున్నందున హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ శుక్రవారం ఫాక్స్ సాగర్‌ను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. హైడ్రా అదనపు కమిషనర్ డి. ఆనంద్‌కుమార్, ఏసీపీ పి. తిరుమల్ కమిషనర్ తో పాటు ఉన్నారు. చెరువు ప్రస్తుత పరిస్థితిని క్షేత్ర స్థాయిలో హైడ్రా కమిషనర్ పరిశీలించారు. ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ (అసఫ్ జా -6) హయాంలో 1897లో నిర్మించిన చారిత్రక ఫాక్స్ సాగర్ చెరువు ఉత్తర హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల ప్రజల తాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు వ్యవసాయానికి ప్రధాన ఆధారంగా నిలిచేదని, ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఈ చెరువు కాలుష్య జలాలతో నిండిపోవడమే గాక, కబ్జాలకు గురైందని హైడ్రా కమిషనర్ వెల్లడించారు. దాదాపు 490 ఎకరాల ఈ చెరువు పరిధి ఉండగా, 150 ఎకరాల మేర ఆక్రమణలకు గురైనట్టు తెలుస్తోందని, కబ్జాలను తొలగిస్తామన్నారు. ఎల్‌నినో ప్రభావం ఉన్న సమయంలో ఈ నీటిని వినియోగించుకోలేని దుస్థితిలోకి చెరువు నెట్టబడిందని, మళ్లీ జీవకళ తీసుకురావడమే హైడ్రా లక్ష్యమని హైడ్రా కమిషనర్ స్పష్టం చేశారు.
మినీ ట్యాంక్‌బండ్‌గా..
జీడిమెట్లలోని ఫాక్స్ సాగర్ ను మినీ ట్యాంక్‌బండ్‌గా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్దేశించారని, ఏడాదికాలంలో ఈ చెరువు పనులు పూర్తి చేస్తామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. సుమారు 150 ఎకరాల మేర ఆక్రమణలు జరిగినట్లు అంచనా వేస్తున్నామని, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలతో కలిసి ఆక్రమణలను తొలగించి చెరువును అభివృద్ధి చేస్తామన్నారు. ఎవరివైనా పట్టా భూములుంటే, చట్ట ప్రకారం వారికి టీడీఆర్ వస్తుందని తెలిపారు. దాదాపు 47 కిలోమీటర్ల నుంచి ఈ చెరువుకు వరద నీరు వచ్చి చేరేదని, 2000 సంవత్సరంలో కట్ట కొట్టుకుపోవాల్సినంత వరద వచ్చి చేరిందనిన్నారు. అందుకే ఈ చెరువును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తే చాలా వరకూ తాగు నీటి సమస్యలు కూడా పరిష్కారమవుతాయన్నారు. చెరువు సహజలక్షణాలన్నీ మళ్లీ సమకూరుస్తామని, ఇన్‌లెట్లు, ఔట్‌లెట్లను అభివృద్ధి చేస్తామన్నారు. దాదాపు 10 అడుగుల మేర పారిశ్రామిక వ్యర్థాలు, పూడిక చేరిందని, పూర్తి స్థాయిలో తొలగించి చెరువులో మంచి నీరు ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. మురుగు, పారిశ్రామిక వ్యర్థాలు చెరువులో కలవకుండా, కాలువలను డైవర్ట్ చేయడంతో పాటు వేసవిలో కూడా నీరు పుష్కలంగా ఉండేలా ఎస్‌టీపీ (సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్)లను ఏర్పాటు చేసి, వాటి ద్వారా నీరు చేరేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇలా తొలిదశ పనులను రూ. 75 కోట్లతో చేపడుతున్నట్టు తెలిపారు.
చరిత్ర ఎంతో ఘనం
జీడిమెట్లలోని ఫాక్స్ సాగర్ చెరువు చరిత్ర ఎంతో ఘనమైంది. నాటి నిజాం పాలకుల దూరదృష్టికి, ఇంజనీరింగ్ నైపుణ్యానికి ప్రతీకగా నిలిచిన ఈ చెరువును 1897లో ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ పాలనలో నిర్మించారు. అప్పట్లో సికింద్రాబాద్ ప్రాంతంలో అతి పెద్ద నీటి వనరుల్లో ఇది ఒకటిగా ఉండేది. ఒకప్పుడు ఈ చెరువు నుంచి నీటిని పంపింగ్ చేసి పైపుల ద్వారా ప్రజలకు సరఫరా చేసేవారు. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ వంటి ప్రధాన జలాశయాలు నిర్మించకముందే ఫాక్స్ సాగర్ నగర నీటి అవసరాలకు సేవలందించడం విశేషం. ఈ చెరువు కట్టపై నిర్మించిన పురాతన రాతి పంప్‌హౌజ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. దానిపై ఫాక్స్ సాగర్ 1897 అని చెక్కి ఉండటం ఆనాటి చరిత్రకు ప్రత్యక్ష ఆధారంగా చెప్పవచ్చు. ఫాక్స్ సాగర్ కేవలం నీటి నిల్వ కేంద్రం మాత్రమే కాదు. జీవవైవిధ్యానికి కూడా ముఖ్యమైన ప్రాంతం. బుల్బుల్, కింగ్‌ఫిషర్, కొంగలు, వీవర్ పక్షులు, ఇతర స్థానిక, వలస పక్షులకు ఈ చెరువు ఆవాసంగా నిలుస్తోంది. చెరువులో చేపల వేట ద్వారా స్థానిక మత్స్యకారులకు జీవనోపాధి లభిస్తోంది. వర్షపు నీటిని నిల్వ చేయడం, భూగర్భ జలాలను పెంపొందించడం, పరిసర ప్రాంతాల పర్యావరణ సమతుల్యతను కాపాడటంలోనూ ఈ జలాశయం కీలక పాత్ర పోషిస్తోంది.ఇంతటి ప్రాధాన్యతతో పాటు చారిత్రక నేపథ్యం ఉన్న ఈ చెరువును పునరుద్ధరించి, భావితరాలకు భద్రంగా అందించాలని హైడ్రా నిర్ణయించింది.
Also Read:రేవంత్ రెడ్డి క్రెడిట్ కొట్టేశారా? మియాపూర్ కేస్‌పై హరీశ్ రావు సంచలన కౌంటర్!