ఉగ్ర దాడి తర్వాత పహల్గాం ప్రాంతం వార్తల్లోకెక్కింది. అక్కడ పర్యాటక ప్రాంతాలన్నీ మూతబడ్డాయి. ఇప్పుడు మళ్లీ వాటిని తిరిగి ప్రారంభిస్తున్నారు. దీంతో మళ్లీ పహల్గాం వార్తల్లో నిలిచింది. ఈసారి చుట్టుపక్కల ప్రాంతాల వారు పహల్గాంని సందర్శించడానికి ఆసక్తి చూపిస్తున్నారట. ఉగ్రదాడి తర్వాత పహల్గాంకి మరింత ప్రచారం లభించినట్టయింది. ఉగ్రదాడి జరిగిన దాదాపు 2 నెలల తర్వాత కట్టుదిట్టమైన భద్రత మధ్య పహల్గాంలోని పర్యాటక ప్రాంతాలు తిరిగి తెరచుకుంటున్నాయి. పహల్గాం సహా చుట్టు పక్కల ప్రాంతాలకు పర్యాటకుల తాకిడి పెరిగింది. సందర్శకులు ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు, సెల్ఫీలతో సందడి చేస్తున్నారు. టూరిస్ట్ ల రాకతో పహల్గాం ప్రాంతంలో వాహనాల రద్దీ కూడా పెరిగింది. జమ్మూకాశ్మీర్ అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. పహల్గాం లోయలో భద్రత కట్టుదిట్టం చేశారు. టూరిస్ట్ లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఏప్రిల్ 22న జమ్మూకాశ్మీర్ లోని అనంత నాగ్ జిల్లా పహల్గాం లోయ వద్ద టూరిస్ట్ లపై ముష్కర మూక దాడికి పాల్పడింది. ఈ దాడిలో 28మంది మరణించగా 20మందికి పైగా గాయపడ్డారు. దాడి తర్వాత భద్రతా కారణాల దృష్ట్యా పహల్గాం పర్యాటకంపై ఆంక్షలు విధించారు. మారణ కాండతో అటు టూరిస్ట్ లు కూడా భయపడ్డారు. పహల్గాం అంటేనే హడలిపోయారు. జమ్మూకాశ్మీర్ పర్యటనలను చాలామంది రద్దు చేసుకున్నారు. హనీమూన్ కోసం ముందుగానే ప్లాన్ చేసుకున్నవారు, టికెట్లు బుక్ చేసుకున్నవారు కూడా తమ ప్రయాణాలను పూర్తిగా రద్దు చేసుకున్నారు.
ఉగ్రదాడి ఘటనతో టూరిస్ట్ లు భయపడటంతో కాశ్మీర్ కు ప్రధాన ఆదాయవనరుగా ఉన్న టూరిజం ఇండస్ట్రీ సంక్షోభంలో పడినట్టయింది. కాశ్మీర్ లోని స్థానికుల్లో చాలామందికి పర్యాటకమే ప్రధాన ఆదాయవనరు. పర్యాటకుల ద్వారానే వారికి ఆదాయం సమకూరుతుంది. పర్యాటకుల నుంచి కాశ్మీర్ కి ఏడాది రూ.12వేల కోట్ల ఆదాయం సమకూరుతుందని అంచనా. 2030నాటికి ఇది 30వేల కోట్ల రూపాయలకు చేరుతుందని అంటున్నారు. 2024లో కాశ్మీర్‌ను సందర్శించిన పర్యాటకుల సంఖ్య 2.36 కోట్లు.. కాగా ఈ ఏడాది అది మరింత పెరుగుతుందని అనుకున్నారు. ఈలోగా జరిగిన దారుణం కాశ్మీర్ పర్యాటకంపై మచ్చలా మారింది. అయితే రెండు నెలలకు పరిస్థితి కాస్త చక్కబడింది. ఇండియా స్విట్జర్లాండ్ గా పిలువబడే పహల్గాం తిరిగి పర్యాటక శోభను సంతరించుకుంది.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత మూతబడిన పర్యాటక ప్రదేశాలు, గార్డెన్స్ లో తిరిగి సందడి నెలకొంది. జమ్మూకాశ్మీర్‌లో మొత్తం 16 పార్కులను తిరిగి ప్రారంభించారు అధికారులు. ఉద్యాన వనాల వద్ద భద్రత పెంచారు, కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. తొలి విడతలో పహల్గాంలోని బేతాబ్ లోయతోపాటు 8 పార్కులు ప్రారంభించగా, రెండో విడతలో జమ్మూలోని 8 ఉద్యానవనాలను తిరిగి ప్రారంభించారు. దీంతో అక్కడ పర్యాటకరంగం తిరిగి సాధారణ స్థితికి వచ్చినట్టయింది.
సెలవుల సీజన్ మొదలైన తర్వాత ఉగ్రదాడి జరగడంతో.. ఆ సీజన్ ని స్థానిక వ్యాపారులు పూర్తిగా నష్టపోయారు. ఇప్పుడు అక్కడ పర్యాటక రంగం సాధారణ స్థితికి చేరుకున్నా.. పునర్వైభవం రావడానికి మరింత సమయం పట్టే అవకాశముంది. దాడి తర్వాత ఎక్కువమంది పహల్గాంను సందర్శించేందుకు ఆసక్తి చూపించడం, అక్కడి పర్యాటక ప్రాంతాల గురించి ఎంక్వయిరీ చేయడం మాత్రం విశేషం.