అమెరికా చట్టాలు మరింత పదునుదేలుతున్నాయి. ముఖ్యంగా అమెరికాలో నివశించే విదేశీయుల పట్ల ఈ చట్టాలు మరింత కఠినంగా ఉండబోతున్నాయి. అక్కడ చదువుకోడానికి వెళ్లాలన్నా, చదువుకుంటూ ఉద్యోగం చేయాలన్నా, ఉద్యోగంలో స్థిరపడ్డాక అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలనుకున్నా.. మునుపటిలా అవేమంత సులభం కావు. పైగా ఇప్పుడొచ్చిన కొత్త చట్టాలు అమెరికాకి వచ్చే విదేశీయులకు మరింత విషమ పరీక్షలా మారాయి. ఆమధ్య ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినా కూడా వీసారద్దు చేస్తామంటూ అమెరికా ప్రభుత్వం హెచ్చరించింది. గతంలో ఎప్పుడైనా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినా కూడా ఇదే శిక్ష విధిస్తామని చెప్పింది. దీంతో భారత్ నుంచి వెళ్లిన విద్యార్థులు దినదిన గండంగా అక్కడ చదువుకుంటున్నారు. తాజాగా అమెరికా ఎంబసీ మరో హెచ్చరిక జారీ చేసింది. అమెరికాలో దాడులు, దొంగతనాలు, దోపిడీ వంటి నేరాలకు పాల్పడితే వీసా క్యాన్సిల్ అంటూ ఓ సందేశాన్ని సోషల్ మీడియాలో ఉంచింది. చట్టపరమైన శిక్షలు దీనికి అదనం. అంటే అమెరికాలో దొంగతనం చేస్తూ ఎవరైనా భారతీయులు పోలీసులకు దొరికినా, దొంగతనం కేసులో నేరం నిర్థారణ అయినా వారికి చట్టపరమైన శిక్ష వేస్తారు. వారి వీసా రద్దు చేసి భారత్ కి తిరిగి పంపించేస్తారనమాట.
Committing assault, theft, or burglary in the United States won’t just cause you legal issues – it could lead to your visa being revoked and make you ineligible for future U.S. visas. The United States values law and order and expects foreign visitors to follow all U.S. laws. pic.twitter.com/MYU6tx83Zh
— U.S. Embassy India (@USAndIndia) July 16, 2025
శాశ్వతంగా ఆంక్షలు..
దొంగతనం, దోపిడీ, దాడుల వంటి నేరాలకు పాల్పడిన విదేశీయులను చట్టపరంగా శిక్షించిన తర్వాత తిరిగి వారి దేశాలకు పంపించి వేస్తారు. ఆ తర్వాత ఎప్పుడూ వారు అమెరికాకు రాకుండా శాశ్వత ఆంక్షలు విధిస్తామని భారత్ లోని అమెరికా రాయబార కార్యాలయం తాజాగా హెచ్చరించింది. భవిష్యత్తులో ఎప్పుడూ వారు అమెరికాకు రాకుండా వీసాకు అనర్హులుగా ప్రకటిస్తామని చెప్పింది. అంటే ఒకసారి తప్పు చేసినా శాశ్వతంగా వారు అమెరికాకు దూరం కావాల్సిందే. స్థానిక పౌరులకు ఇలాంటి నిబంధనల్లో మినహాయింపు ఉంటుంది. వారికి కేవలం చట్టపరమైన శిక్షను మాత్రమే అమలు చేస్తారు. అదే ఇతర దేశం వాళ్లు ఆ తప్పు చేస్తూ దొరికితే మాత్రం వారికి ఇక అమెరికాకు నో ఎంట్రీ అన్నమాట.
ఎందుకిదంతా..?
డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్ష పీఠంపై కూర్చున్న తర్వాత అమెరికాలో రూల్స్ అన్నీ మారిపోతున్నాయి. ఇప్పటి వరకు అమెరికాను దోచుకుంది చాలు, ఇకపై అలా జరగనివ్వబోనంటూ ఆయన కొత్త కొత్త బిజినెస్ రూల్స్ తెరపైకి తెచ్చారు. దీంతో అమెరికాతో సంబంధాలు పెట్టుకున్న ఇతర దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. అదే సమయంలో మానవ వనరుల విషయంలో కూడా ఆయన కఠినంగా ఉంటున్నారు. అమెరికా ప్రజలు ఇతర దేశాల వారి వల్ల ఉద్యోగాలు కోల్పోతున్నారని, ఉన్నత స్థాయిలకు వెళ్లలేకపోతున్నారనేది ట్రంప్ వాదన. ఆ ప్రచారంతోనే ఆయన గత ఎన్నికల్లో గెలిచారు. ఇప్పుడు తన వాగ్దానాలను అమలులో పెడుతున్నారు. ఇప్పటికే వీసా నిబంధనలు కఠినతరం చేశారు. అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్న వేలాదిమందిని తిరిగి సొంత ప్రాంతాలకు పంపించి వేస్తున్నారు. తాజాగా మరో వంకతో వీసా శాశ్వత రద్దు అంటూ హడావిడి మొదలైంది. ఇటీవల ఓ భారతీయ మహిళ అమెరికాలోని ఓ షాప్‌లో దొంగతనం చేస్తూ పోలీసులకు పట్టుబడింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తాను దొంగిలించిన వాటికి డబ్బులు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నానని ఆ మహిళ చెప్పినా పోలీసులు క్షమించలేదు. ఆమెను అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు కొన్ని రోజుల ముందు అమెరికాలో ఓ భారతీయ విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేశారు. అక్రమంగా తమ దేశంలో ప్రవేశించాడంటూ అతడిని అదుపులోకి తీసుకున్నారు. అమెరికా వెళ్లాలన్నా, అక్కడ ఉద్యోగం చేయాలన్నా, నివశించాలన్నా ఇప్పుడు చాలా కష్టం అని అర్థమవుతోంది.