
Uttarakhand Tunnel Rescue : వారు బయటి ప్రపంచాన్ని చూసి 240 గంటలు గడిచిపోయింది.. క్షణం క్షణం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఎప్పుడు ఏ పైకప్పు కూలుతుందో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ఒక్కరోజులో బయటికి తీసుకొస్తామన్న అధికారులు.. పది రోజులు గడుస్తున్నా.. ఇంకా ప్రణాళికలు రచించడంలో కిందా మీదా పడుతున్నారు. ఇదీ ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ సొరంగ మార్గంలో చిక్కుకుపోయిన 41 మంది కూలీల పరిస్థితి.
దాదాపు 10 రోజుల తర్వాత సహాయక చర్యల్లో కాస్త పురోగతి కనిపించింది. సొరంగంలో చిక్కుకుపోయిన తర్వాత తొలిసారి వారి విజువల్స్‌ను అధికారులు బయటకు విడుదల చేశారు. నిన్న పంపిన ఆరు ఆంగులాల పైప్ ద్వారా ఆహారాన్ని కూడా పంపుతున్నారు. చాలా రోజులు తర్వాత ఈ పైప్‌ను ఉపయోగించే వారికి తొలిసారిగా కాస్త వేడి భోజనాన్ని పంపింది రెస్క్యూ టీమ్. పండ్లతో పాటు తేలికపాటి భోజనం, వాకీ టాకీలు, చార్జర్‌ను పంపారు.
మరోవైపు ఈరోజు మధ్యాహ్నం నుంచి వర్డికల్ డ్రిల్లింగ్ చేసేందుకు రెడీ అవుతున్నారు అధికారులు. ఇప్పటికే డ్రిల్లింగ్‌కు కావాల్సిన ప్రత్యేకమైన మిషనరీ ఘటన స్థలానికి చేరుకుంది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ కూడా రెస్క్యూ ఆపరేషన్‌లో భాగమైంది. 20, 50 కిలోల బరువున్న రెండు రోబోలను కూలిన సొరంగంలోకి పంపింది. లోపల చిక్కుకున్న కార్మికుల పరిస్థితిని ఈ రోబోలు అంచనా వేసి, రెస్క్యూ ఆపరేషన్‌కు సహకరిస్తాయని అంచనా వేశారు. అయితే DRDO పంపిన రోబోట్ శిథిలాల కారణంగా కార్మికులు ఉన్న ప్రాంతానికి చేరుకోలేకపోయింది.
ఇక సొరంగంలో చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు మరో నాలుగైదు రోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు తమ వారు సురక్షితంగా వస్తారో, రారోనన్న ఆందోళనతో వారి కుటుంబ సభ్యులను తీవ్ర ఆవేదనకు గురి చేస్తోంది. కార్మికులను కాపాడేందుకు జరుగుతున్న ప్రయత్నాల గురించి ప్రధాని నరేంద్ర మోడీ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ దామితో మాట్లాడారు. అక్కడ జరుగుతున్న పనుల గురించి తెలుసుకున్నారు.
ఇదిలా ఉండగా.. ఉత్తరకాశి సొరంగ ప్రమాదంపై ఉత్తరాఖండ్ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ ప్రమాదంపై ఎన్ జీఓ సమాధాన్ పిల్ దాఖలు చేయగా.. దానిపై విచారణ చేసింది. అక్కడ జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్ పై 48 గంటల్లో సమాధానం ఇవ్వాలని ఇటు ప్రభుత్వానికి, అటు కేంద్ర ఏజెన్సీలకు నోటీసులు జారీ చేసింది. కాగా.. కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని, ప్రభుత్వం క్రిమినల్ కేసు నమోదు చేసి సిట్ తో విచారణ జరిపించాలని సమాధాన్ డిమాండ్ చేశారు.
.
.
Perni Nani : మాకూ ఉన్నాయ్ చెప్పులు.. పవన్ కు పేర్ని నాని కౌంటర్..