Konda Surekha: బీసీల హక్కుల కోసం ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన ధర్నా రాజకీయ వేడి పెంచింది. ఈ ధర్నాలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. బీసీలకు గౌరవం రావాలంటే రాజకీయం మారాలని, రిజర్వేషన్లు న్యాయంగా రావాలంటే కేంద్రంలో మార్పు తప్పదని ఆమె స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు గుప్పించిన సురేఖ.. బీజేపీ నరనరాల్లో కుల పిచ్చి పాతుకుపోయింది. అదే కారణంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి పిలవలేదు. ఆమె వితంతు మహిళ… పైగా దళిత మహిళ అని పక్కన పెట్టిందని విమర్శించారు. ఆ కులపరమైన అహంభావంతోనే ఆమెను పక్కన పెట్టారు అంటూ కేంద్రానికి వ్యతిరేకంగా ఘాటుగా స్పందించారు.
ఇంతటితో ఆగలేదు సురేఖ. అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం సందర్భానికీ వెళ్లారు. రాష్ట్రపతి దళిత మహిళ కనుక ఆమెకు ఆ పూజలకూ, ప్రారంభోత్సవానికీ ఆహ్వానం లేదు. ఓ మహిళగా, ఓ గిరిజన ప్రజాప్రతినిధిగా, దేశ అత్యున్నత పదవిలో ఉన్నవారిగా ద్రౌపది ముర్ముకు కేంద్ర ప్రభుత్వం చూపిన ఈ ఉపేక్ష… ఆవేదన కలిగించేదే కాదు, బహిరంగంగా బహిష్కరించడమే అని మండిపడ్డారు. ఈ మాటలన్నీ బీసీ కులాల తాలూకు గాయాల్ని మళ్లీ తెరపైకి తీసుకువచ్చాయి. రాష్ట్రపతి పదవి అధిష్ఠించిన మహిళను కూడా కులం ఆధారంగా చిన్నచూపు చూస్తే, దేశంలోని మిగిలిన సామాన్య బీసీల పరిస్థితి ఎలా ఉంటుందో కేంద్రానికి ఎలాంటి అర్థం కావడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదే బీసీల ధర్నా వేదిక. తెలంగాణ నుండి పెద్ద ఎత్తున బీసీ నాయకులు, మంత్రులు, కార్యకర్తలు పాల్గొన్న ఈ ధర్నా, కేంద్రంపై ఒత్తిడి పెంచడమే లక్ష్యంగా జరిగింది. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రెండు కీలక చట్టాలు చేసి గవర్నర్‌కి పంపిన విషయం తెలిసిందే. 42 శాతం రిజర్వేషన్ల డిక్లరేషన్‌ను కామారెడ్డిలో ప్రకటించిన ఘనత కూడా రేవంత్‌దే అని కొండా సురేఖ గుర్తు చేశారు. అయితే ఆ చట్టాలు నాలుగు నెలలుగా గవర్నర్ వద్దనే ఆపేయడం కేంద్రం వ్యూహమేనని ఆమె ఆరోపించారు. బీసీలకు న్యాయం చేసే క్రమంలో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను కేంద్రం అడ్డుకోవడమే ఈ వ్యవహారంలోని అసలు కథ అని మండిపడ్డారు.
Also Read: Mahesh Goud: సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంది.. బీజేపీకి ఆ సత్తా ఉందా? మహేష్ గౌడ్ ఫైర్!
కొండా సురేఖ ప్రకటనల వెనుక బలమైన రాజకీయ సందేశం ఉంది. రాష్ట్రపతి స్థాయిలో ఉన్న మహిళను కుల ఆధారంగా పక్కన పెట్టిన కేంద్రం, బీసీలకు న్యాయం చేస్తుందన్న ఆశలు ఎందుకు పెట్టుకోవాలి? అని ఆమె ప్రశ్నించారు. రాజకీయ నాయకులుగా మేము చూస్తున్నది ఒక్కటే.. బీసీలకు సరైన ప్రాతినిధ్యం, సరైన రిజర్వేషన్లు, సరైన గౌరవం అవసరం. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తోంది. ఇది కేవలం తెలంగాణ విషయంలో మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా బీసీల తరఫున జరుగుతున్న గొప్ప ఉద్యమం అని ఆమె స్పష్టం చేశారు.
అంతేకాక, రెండు చట్టాలు తెచ్చిన ఘనత రేవంత్ రెడ్డిది. బీసీలకు జిత్నీ అబాదీ.. ఉత్నే హక్క్ అనే ధోరణితో కాంగ్రెస్ ముందుకు సాగుతోంది. దేశంలో OBCలు అధిక జనాభా ఉన్నవారు. అయితే అధికారంలో మాత్రం వారి ప్రాతినిధ్యం తక్కువగా ఉంది. ఇదే అసమానతను తుంచివేయాలంటే బీసీ హక్కుల కోసం ఢిల్లీ కదలిక అవసరమైందేనని కొండా సురేఖ వివరించారు. బండి సంజయ్ బీసీ అని చెబుతారు, అయితే బీసీల కోసం ఎందుకు మాట్లాడరు? కిషన్ రెడ్డి పేరు చెబుతూ ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చారని విమర్శించేవారు, ఇప్పుడు దేశవ్యాప్తంగా ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చినదెవరో స్టడీ చేయండి అంటూ బీజేపీ నేతల ద్వంద్వ వైఖరిని ఎండగట్టారు.
మోడీ తల్చుకుంటే రిజర్వేషన్లు సాయంత్రం లోపే వచ్చేస్తాయి. కానీ రేవంత్ రెడ్డికి క్రెడిట్ వెళ్లకూడదనే అక్కసుతో కేంద్రం ఆ నిర్ణయం తీసుకోవడం లేదు. ఇది బీసీలతోపాటు దేశ ప్రజాస్వామ్యానికి కూడా అవమానం అని కొండా సురేఖ తేల్చిచెప్పారు. చివరగా, పట్టుదలతో సాధించుకుంటాం.. రిజర్వేషన్లు తెచ్చుకుంటాం. కాంగ్రెస్ పార్టీ మన అందరి పార్టీ. కేంద్రం ఎంత అడ్డుపడ్డా బీసీల న్యాయం కోసం పోరాటం ఆగదని ధీమాగా అన్నారు.