Vardhman Boss Duped| దేశంలో సైబర్ మోసగాళ్లు రోజురోజుకీ రెచ్చిపోతున్నారు. రిటైర్డ్ ఉద్యోగులని, సీనియర్ సిటిజెన్స్, డాక్టర్లని టార్గెట్ చేసుకొని కోట్లకు కోట్లు దోచుకుంటున్నారు. తాజాగా దేశంలోనే ప్రముఖ టెక్స్‌టైల్ కంపెనీ వర్ధమాన్ టెక్స్‌టైల్స్ చైర్మాన్ అయిన ఎస్‌పి ఓస్వాల్ నుంచి సైబర్ దొంగలు ఏకంగా రూ.7 కోట్లు దొచుకున్నారు. అది కూడా ఆయనను వీడియో కాల్ లో మాట్లాడుతూ.. ఆయన అకౌంట్ నుంచి వేర్వేరు అకౌంట్ల కోట్ల రూపాయలు ట్రాన్స్‌ఫర్ చేశారు. సిబిఐ, ఈడీ అధికారులగా పోజులిస్తూ.. ఏకంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్ర చూడ్ ఆదేశాలతో ఇదంతా జరుగుతోందని నమ్మిచారు.
వివరాల్లోకి వెళ్తే.. వర్ధమాన్ టెక్స్‌టైల్స్ యజమాని దేశంలోనే ప్రముఖ వ్యాపారవేత్త అయిన 82 ఏళ్ల ఎస్ పీ ఓస్వాల్ కు ఆగస్టు 28 2024న ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ చేసిన వారు సిబిఐ అధికారులుగా ఓస్వాల్ తో పరిచయం చేసుకున్నారు. ఓస్వాల్ పేరుతో కెనరా బ్యాంకు లో అకౌంట్ ఉందని అందులో నుంచి వందల కోట్లు లావాదేవీలు జరిగాయని చెప్పారు. ఇదంతా బ్లాక్ మనీ అని తమకు అనుమానంగా ఉందని చెప్పారు. కానీ ఓస్వాల్ తనకు కెనరా బ్యాంకులో ఏ అకౌంట్ లేదని.. ఆ డబ్బులకు తనకు ఏ సంబంధం లేదని
చెప్పాడు.
Also Read: ఆ స్కీమ్ వెనుక భారీ అవినీతి? ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌పై కేసు!
అప్పుడు సిబిఐ అధికారులు పోజులిస్తున్న మోసగాళ్లు ఆయనను నమ్మించేందకు కొత్త కథ అల్లారు. 2023లో జెట్ ఎయిర్ వేస్ మాజీ చైర్మన్ నరేష్ గోయల్ కంపెనీలో అవతవకలు చేశారని.. దాని కోసం ఓస్వాల్ పేరుతో ఉన్న కెనరా అకౌంట్ ఉపయోగించారని తెలిపారు. జెట్ ఎయిర్ వేస్ కు గానీ, నరేష్ గోయల్ తో గానీ ఓస్వాల్ కు సంబంధాలున్నాయా? అని ప్రశ్నించారు. దానికి ఓస్వాల్ ఓపికగా సమాధానమిస్తూ.. జెల్ ఎయిర్ వేస్ లో తన ఆధార్ కార్డు వివరాలతో కొన్ని సార్లు విమాన టికెట్లు బుక్ చేశారని.. తన ఆధార్ వివరాలతో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి ఉంటారని ఓస్వాల్ అనుమానం వ్యక్తం చేశారు.
ఓస్వాల్ సమాధానం విన్న ఆ నకిలీ సిబిఐ అధికారులు.. ఒకవేళ ఓస్వాల్ నిర్దోషి అయితే విచారణలో తమకు సహకరించాలని చెప్పారు. అంతవరకు కేసులో ఓస్వాల్ కూడా నిందితుడే అని అన్నారు. పైగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్ర చూడ్ ఆదేశాలతో ఈ విచారణ జరుగుతోందని చెప్పి నమ్మించారు. ఓస్వాల్ కు ఈ మెయిల్ ద్వారా ఈడీ స్టాంప్, సుప్రీం కోర్టు ఆదేశాలతో డాక్యూమెంట్స్ పంపించారు. ఈ విచారణ రహస్యంగా జరుగుతోందని.. ఎవ్వరికీ విచారణ గురించి బయట చెప్పకూడదని.. చెబితే వెంటనే ఓస్వాల్ కు అరెస్టు చేస్తామని బెదిరించారు. మూడు నుంచి అయిదు సంవత్సరాలు జైలు శిక్ష పడుతుందని భయపడించారు.
వారి మాటలు విని ఓస్వాల్ పూర్తిగా నమ్మేశాడు. పైగా ఈడీ స్టాంప్, సుప్రీం కోర్టు ఆదేశాల డాక్యూమెంట్స్ చూసి ఎలాంటి అనుమానాలు పెట్టుకోలేదు. ఆ తరువాత వాళ్లు చెప్పినట్లు చేయాలని సూచించారు. వారు చెప్పినట్లు రెండు బ్యాంకు అకౌంట్లలో రూ.7 కోట్లు జమ చేయాలని.. అది అరెస్టు చేయకుండా ఉండేందకు ఆ డబ్బులు సెక్యూరిటీ అని నమ్మించారు. కేసు విచారణ పూర్తి అయిన తరువాత రూ.7 కోట్లు తిరిగి వచ్చేస్తాయని చెప్పారు. దీంతో ఆ ఇద్దరు నకలి సిబిఐ ఆఫీసర్లు చెప్పిన రెండు బ్యాంకు అకౌంట్లలో రూ.4 కోట్లు, రూ.3 కోట్లు జమ చేశాడు. అంతే రెండు గంటలపాటు సాగిన ఆ వీడియో కాల్ కట్ అయిపోయంది.
Also Read: పాకిస్తాన్ కు ప్రపంచ బ్యాంకు కంటే ఎక్కువ అప్పు భారత్ ఇవ్వగలదు’.. కశ్మీర్‌లో రాజ్ నాథ్ సింగ్
ఓస్వాల్ తిరిగి కాల్ చేస్తే.. కనెక్ట్ కావడం లేదు. ఓస్వాల్ కు అనుమానం వచ్చి.. తన కంపెనీ ఆడిటర్లకు ఫోన్ చేశాడు. వాళ్లు ఇదంతా మోసం అని.. వెంటనే పోలీసులకు కాల్ చేయాలని సూచించారు. అలా ఓస్వాల్ ఫిర్యాదుతో సైబర్ విభాగం పోలీసులు.. ఆగస్టు 30న ఓస్వాల్ ఫిర్యాదు నమోదు చేసి.. రూ.7 కోట్లు ఏ బ్యాంక్ అకౌంట్లలోకి జమ చేశారో వాటి గురించి వివరాలు సేకరించారు. ఆ అకౌంట్లు అస్సాంకు చెందిన ఆనంద్ కమార్, అటను చౌదరి అనే చిన్న వ్యాపారులకు చెందినవి. వారిద్దరినీ విచారణ చేయగా.. అయిదుగురు వ్యక్తులు తమను సంప్రదించారని.. గేమింగ్ ప్రైజ్ మనీ బ్యాంక్ అకౌంట్లలో జమ అవుతుందని.. అందులో నుంచి తమకు కమిషన్ వస్తుందని చెప్పి నమ్మించారని తెలిపారు.
పోలీసులు ఆ రెండు బ్యాంక్ అకౌంట్ల నుంచి రూ.5.25 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇక సైబర్ దొంగతనాలకు పాల్పడే గ్యాంగ్ వివరాలను పోలీసులు సేకరించారు. వారిలో ఒకరు మాజీ బ్యాంక్ ఉద్యోగి రూమి కలిటా కాగా.. మిగతా నలుగురు.. నిమి భట్టచార్య, అలోక్ రంగి, గులామ్ ముర్తజా, జాకిర్. వీరిలో ఇద్దరు సిబిఐ ఐడి కార్డులు వేసుకొని మిస్టర్ ఓస్వాల్‌కు వీడియా కాల్ చేశారని తెలిసింది. ఈ అయిదుగురు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.