Waqf Amendment Bill 2025: వివాదాస్పద వక్ఫ్ బిల్లుకు రాజ్యసభలో కూడా ఆమోదం లభించింది. సుధీర్ఘ చర్చలు, వాదనల తర్వాత కేంద్రం ప్రవేశపెట్టిన ఈ బిల్లును ఎగువ సభ ఆమోదించింది. బిల్లుకు అనుకూలంగా 128 మంది, వ్యతిరేకంగా 95 మంది సభ్యులు ఓటేశారు. ప్రతిపక్షాలు ప్రతిపాదించిన సవరణలు వీగిపోయాయి. రాజ్యసభలో ఈ బిల్లును కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రవేశ పెట్టి చర్చ ప్రారంభించారు. కొందరు విపక్ష ఎంపీలు బిల్లుకు నిరసనగా నల్ల బ్యాడ్జీలు ధరించి సభకు వచ్చారు. అయితే.. వక్ఫ్ చట్ట సవరణ బిల్లు ముస్లింలకు వ్యతిరేకం కాదని, ఏ ఒక్కరి మత విశ్వాసాలను దెబ్బతీసేలా నిబందనలు ఈ బిల్లులో లేవని కేంద్ర మంత్రి చెప్పారు.
సంక్లిష్టతలను తొలగించి, పారదర్శకత తీసుకురావడమే ప్రభుత్వం ఉద్దేశ్యమని అన్నారు. దీంతో పాటు.. వక్ఫ్ ఆస్తులకు సాంకేతికతను ప్రవేశపెట్టి.. బోర్డు పనితీరు మెరుగుపరుస్తామని చెప్పారు. అసలు ఈ బిల్లుకు, మతానికి ఎలాంటి సంబంధం లేదని అన్నారు కిరణ్ రిజూజు. 2004లో 4.9 లక్షలుగా ఉన్న వక్ఫ్ ఆస్తులు ఇప్పుడు 8.72 లక్షలకు పెరిగాయని ఆయన గుర్తు చేశారు. గత ప్రభుత్వాలు నెరవేర్చని లక్ష్యాలను తాము నెరవేర్చడానికే ఈ బిల్లు తీసుకొచ్చామన్నారాయన. సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ కూర్పుపై వ్యక్తమవుతున్న అనుమానాలకు కూడా ఆయన సమాధానం ఇచ్చారు. ముస్లిమేతరులు ఎక్కువమంది ఉంటారనే భయం అవసరం లేదని చెప్పారు.
వక్ఫ్ చట్ట సవరణ బిల్లు రాజ్యాంగానికి వ్యతిరేకమని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ముస్లింలను లక్ష్యంగా చేసుకొని సమాజంలో మతపరమైన ఉద్రిక్తతలు రెచ్చగొట్టడానికి బీజేపీ ఈ బిల్లు తెచ్చిందని ఆరోపించింది. జేపీసీలో ప్రతిపక్షాలు చేసిన ఏ ఒక్క సిఫార్సును ఈ బిల్లులో ఎందుకు పెట్టలేదని నిలదీసింది కాంగ్రెస్ పార్టీ. ముస్లింలను ద్వితీయశ్రేణి పౌరులుగా మార్చడమే ఈ బిల్లు ఉద్దేశ్యమని ఆరోపించింది. వక్ఫ్ బిల్లు ద్వారా ముస్లింలను విభజించడానికి ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. దేశంలో నెలకొన్న మతసామరస్యాన్ని దెబ్బతీయవద్దని మల్లిఖార్జున్ ఖర్గే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బిల్లును ఉపసంహరించుకోవాలని కోరారు.
వక్ఫ్ బిల్లుపై బుధవారం లోక్‌సభలో 14 గంటలకు పైగా చర్చ జరిగింది. ఆ తర్వాత అక్కడ కూడా ఆమోదం పొందింది. దీంతో పార్లమెంటు ఉభయ సభలు ఈ బిల్లును ఆమోదించినట్టు అయింది. రాష్ట్రపతి సంతకం కోసం ఈ బిల్లులను ప్రభుత్వం పంపించనుంది.
వక్ఫ్ సవరణ బిల్లుపై రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ముస్లింలను అణగదొక్కడం, వారి వ్యక్తిగత చట్టాలు, ఆస్తి హక్కులను ఆక్రమించుకోవడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోందని ఆరోపించారు. ఈ బిల్లు ముస్లింల హక్కులను కాలరాయడానికి వినియోగిస్తున్న ఆయుధంలా ఉందని మండిపడ్డారు. RSS, బీజేపీ, దాని మిత్రపక్షాలు రాజ్యాంగంపై దాడి చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే.. ఇప్పుడు ముస్లింలపై జరుగుతున్న దాడి భవిష్యత్‌లో ఇతర వర్గాలపై కూడా జరగొచ్చని అన్నారాయన.
Also Read: రతన్ టాటా వీలునామా.. వంట మనిషికి రూ.1 కోటి.. శాంతనుకు ఏమిచ్చారు?
కాగా వక్ఫ్ ట్రిబ్యునళ్ల నుండి ముస్లిం చట్టంలో నిపుణుడిని తొలగించడం వల్ల వక్ఫ్ సంబంధిత వివాదాల పరిష్కారంపై ప్రభావం పడవచ్చనే ఆందోళన కూడా ఉంది. అలాగే, ఈ బిల్లు కనీసం ఐదు సంవత్సరాలు ఇస్లాంను ఆచరించే వ్యక్తులకు మాత్రమే వక్ఫ్ ఇచ్చేవిధంగా పరిమితం చేస్తుంది. అలాంటి నిబంధన ఎందుకనేది మాత్రం అస్పష్టంగా ఉంది. ఈ విధానం వల్ల ఐదు సంవత్సరాల కంటే తక్కువ కాలం ఇస్లాంను ఆచరించే వ్యక్తులకు.. ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం ఉన్న వారికి మధ్య వ్యత్యాసాన్ని సృష్టిస్తుందని కొందరు అంటున్నారు.
ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 చెప్పే సమానత్వ హక్కును ఉల్లంఘించే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ.. పార్లమెంట్‌లో ఎన్డీయే కూటమికి బిల్లును చట్టం చేసే మెజారిటీ బలం ఉంది. రాజ్యసభలోనూ గెలవడానికి అవకాశం లేకపోలేదు. కాబట్టి, బిల్లు చట్టంగా మారి తీరుతుందని అందరి అభిప్రాయం. అయితే, దీన్ని న్యాయం ముందు నిలబెడతామని ముస్లీం వర్గాలు చెబుతున్నాయి.