Delhi CM: 27 ఏళ్ల బీజేపీ కల నెరవేరింది. ఎట్టకేలకు ఢిల్లీ పీఠాన్ని దక్కించుకోవాలనుకున్న బీజేపీ వ్యూహం ఫలించింది. కానీ సీఎం పీఠంపై ఎవరు ఆశీనులు కానున్నారన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఆశవాహుల సంఖ్య పెద్దగా ఉంది. సీఎం పీఠం మాత్రం ఒక్కటే. అందుకే సీఎం పదవి ఎవరికి వరిస్తుందన్నదే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఈనెల 19న బీజేఎల్పీ సమావేశం జరుగుతుండగా, ఆ సమావేశంలో బీజేఎల్పీ నేత ఎన్నిక సాగనుంది. ఇది ఇలా ఉంటే సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటికే బీజేపీ అధిష్టానం రంగం సిద్దం చేసింది.
ఢిల్లీ ఎన్నికలు ఎంత రసవత్తరంగా సాగాయో చెప్పాల్సిన అవసరం లేదు. ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లే బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంది. ఢిల్లీ పీఠంపై కాషాయ జెండా ఎగురవేయాలన్న బీజేపీ కోరిక ఎట్టకేలకు నెరవేరింది. మొత్తం 48 మంది ఎమ్మెల్యేలు విజయాన్ని అందుకోగా, పార్టీలో కొత్త ఉత్సాహం నిండిందనే చెప్పవచ్చు. అయితే సీఎం సీట్లో ఎవరు కూర్చుంటారన్నదే ఇప్పుడు పార్టీ అధినాయకత్వానికి పెద్ద తలనొప్పిగా మారిందట. సీటు ఒకటే అయినప్పటికీ ఆశావాహుల జాబితా మాత్రం పెద్దదిగానే ఉందట. అందులో పర్వేష్ వర్మ(న్యూ ఢిల్లీ), రేఖా గుప్తా (షాలిమార్ బాగ్), విజేందర్ గుప్తా (రోహిణి), సతీష్ ఉపాధ్యాయ్ (మాల్వియా నగర్), ఆశిష్ సూద్ (జనక్‌పురి), పవన్ శర్మ (ఉత్తమ్ నగర్), అజయ్ మహావార్ (ఘోండా) వీరి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.
అయితే పర్వేష్ వర్మ పేరు ఎక్కువగా వినిపిస్తుండగా, ఎవరికి వారు తమకంటే తమకని ధీమా వ్యక్తం చేస్తున్నారట. బీజేపీ అధిష్టానం మాత్రం కసరత్తు పేరుతో ఆశావాహులను అలా పక్కన పెడుతూ సమాలోచన చేస్తుందని సమాచారం. ఏదిఏమైనా మరో రెండు రోజుల్లో నూతన సీఎంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈనెల 19 న బీజేఎల్పీ సమావేశం జరుగుతుండగా, ఆ సమావేశానికి కొత్తగా ఎన్నికైన 48 మంది ఎమ్మెల్యేలు, బీజేపీ ఎంపీలు హాజరుకానున్నారు. బీజేఎల్పీ నేత ఎన్నిక తర్వాత లెఫ్టినెంట్ గవర్నర్‌ను నేతలు కలవనున్నారు. ఇప్పటికే సీఎం ప్రమాణస్వీకారం కోర్డినేటర్లుగా వినోద్ తావ్డే, తరుణ్ చుగ్ లను బిజెపి అధిష్ఠానం నియమించగా, ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి.
ఈ నెల 20 న ఢిల్లీ నూతన సీఎం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి రామ్ లీలా మైదాన్ ముస్తాబవుతోంది. ఎన్నేళ్లకు పెద పండుగ వచ్చే అనే తరహాలో ఢిల్లీలో కాషాయ జెండా 27 ఏళ్ల తర్వాత ఎగిరింది. అందుకే సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని బీజేపీ భావిస్తోంది. 20వ తేదీ సాయంత్రం 4:30 నిమిషాలకు సీఎం ప్రమాణ స్వీకార మహోత్సవం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అదే రోజు నూతన మంత్రి వర్గం చేత ప్రమాణం స్వీకారం చేయించాలని పార్టీ నిర్ణయించింది.
Also Read: తల్లిదండ్రులు వద్దనుకున్నారు.. అనధాశ్రమం నుండి ఆస్ట్రేలియా క్రికెటర్ గా లీసా ప్రయాణం
రామ్ లీలా మైదాన్ ముస్తాబవుతుండగా, మొత్తం 2 లక్షల మంది కూర్చునే విధంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ ఇతర కేంద్ర మంత్రులు, ఎన్డీఏ కూటమి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఏపీ సీఎం చంద్రబాబు, పలువురు హాజరు కానున్నారు. ఓవైపు బీజేఎల్పీ నేత ఎన్నికకు కసరత్తు జరుగుతుండగా, మరోవైపు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు యమస్పీడ్ గా సాగుతున్నాయి. మొత్తం మీద సీఎం పదవి ఎవరికి వరిస్తుందనే ప్రశ్నకు 19 న సమాధానం దొరకనుందని చెప్పవచ్చు.
ఫిబ్రవరి 20న ఢిల్లీ సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమం ?
ఈనెల 19న సీఎం పేరు ప్రకటించనున్న బీజేపీ హైకమాండ్
ఫిబ్రవరి 20న సాయంత్రం నాలుగన్నర గంటలకు ప్రమాణస్వీకార కార్యక్రమం ఉండే అవకాశం
ఇప్పటికే మంత్రివర్గ ఏర్పాటుకు 15 మంది ఎమ్మెల్యేలతో జాబితా సిద్ధం చేసిన బీజేపీ
ముఖ్యమంత్రిగా… pic.twitter.com/fud54i2Jg3
— BIG TV Breaking News (@bigtvtelugu) February 17, 2025