Madhya Pradesh Shocker: మధ్యప్రదేశ్‌లోని దిండోరి జిల్లాలో అత్యంత దారుణ ఘటన చేసుకుంది. రసగుల్లా (స్వీట్) అని నమ్మి నాటు బాంబును కొరికిన ఓ వ్యక్తి.. అది నోట్లోనే పేలిపోవడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. మంగళవారం (నవంబర్ 10) రాత్రి కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని పడారియా గ్రామంలో జరిగిన ఈ విషాదకర ఘటన.. స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
పడారియా గ్రామానికి చెందిన రాజేంద్ర బరోటియా మంగళవారం రాత్రి తన ఇంట్లో కూర్చుని ఉన్నాడు. ఆ సమయంలో రామ్ భగత్ బరోటియా అనే వ్యక్తి అక్కడికి వచ్చాడు. ఇద్దరూ కాసేపు మాట్లాడుకుంటుండగా రామ్ భగత్ తన వద్ద ఉన్న ఒక నాటు బాంబును రాజేంద్రకు ఇచ్చి అది ‘రసగుల్లా’ అని నమ్మించాడు. అప్పటికే చీకటి పడటంతో అది స్వీటా లేక బాంబా అని రాజేంద్ర సరిగ్గా గుర్తించలేకపోయాడు. నిజంగానే రసగుల్లా అనుకుని దానిని నోట్లో వేసుకుని కొరకడంతో ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది.
పేలుడు తీవ్రతకు రాజేంద్ర అక్కడికక్కడే మృతి చెందాడు. భారీ శబ్దం రావడంతో ఇంట్లోని వారు, ఇరుగుపొరుగు వారు భయంతో పరుగున బయటకు వచ్చారు. తీవ్ర రక్తస్రావంతో పడిఉన్న రాజేంద్రను హుటాహుటీనా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఘటనపై మృతుడి భార్య సుశీల మాట్లాడుతూ కన్నీరుమున్నీరు అయ్యారు. ‘అది అడవి జంతువులను వేటాడేందుకు ఉపయోగించే నాటు బాంబు. పొరుగువారి సాయంతో వెంటనే ఆటోలో నా భర్తను ఆసుపత్రికి తరలించాము. కానీ అప్పటికే ప్రాణాలు పోయాయి’ అని ఆవేదన వ్యక్తం చేశారు.ట
Also Read: ఇరాన్‌పై యుద్ధం ఎఫెక్ట్.. ట్రంప్, నెతన్యాహు మధ్య విభేదాలు.. ఫోన్ కాల్‌లో తీవ్ర వాగ్వాదం?
బాంబు పేలుడుపై సమాచారం అందుకున్న కొత్వాలి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం స్టేషన్ ఇన్‌ఛార్జ్ దుర్గా ప్రసాద్ నాగ్‌పురే మాట్లాడుతూ.. చీకటిగా ఉండటం వల్ల బాధితుడు దానిని గుర్తించలేకపోయాడని తెలిపారు. నోట్లో పెట్టుకుని కొరకగానే బాంబు పేలిపోయిందన్నారు. ప్రధాన నిందితుడు రామ్ భగత్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా ఆ బాంబును తనకు ఒక బాలుడు ఇచ్చాడని చెప్పాడన్నారు. దీంతో పోలీసులు ఆ బాలుడిని కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
Also Read: 65 ఏళ్ల వయసులో రూ. 20 భోజనంతో ప్రారంభం.. నేడు రూ. 2.5 కోట్ల వ్యాపార సామ్రాజ్యం!