టూవీలర్లకు టోల్ ఏంటి..? మీకేమైనా మతిపోయిందా..? లేక మీరేమైనా జగన్ అనుకుంటున్నారా..? అనే ప్రశ్నలు మీకు రావొచ్చు. ఇప్పటికిప్పుడు ఇది పూర్తి నిజం కాకపోయినా భవిష్యత్తులో జరిగేందుకు అవకాశం ఉన్న నిజం. అవును, ద్విచక్ర వాహనాలకు కూడా టోల్ వాయింపు మొదలయ్యే అవకాశాలను కొట్టిపారేయలేం. అయితే అది ఎప్పుడు, ఎలా, చార్జీ ఎంత..? ఎలక్ట్రిక్ వాహనాలకు మినహాయింపు ఉంటుందా..? అనేది తేలాల్సి ఉంది.
జులై-15నుంచి..
రోడ్డు రవాణా శాఖ ద్వారా కేంద్ర ప్రభుత్వాలకు ప్రధాన ఆదాయ వనరుగా లైఫ్ ట్యాక్స్ ఉంది. వాహనాలు రోడ్డెక్కితే కచ్చితంగా జీవితకాల పన్ను కట్టాల్సిందే. వాహన విక్రయదారులు తెలివిగా ఈ పన్ను మొత్తాన్ని వినియోగదారులపైకి బదలాయించారు. ఎక్స్ షోరూమ్ ప్రైస్, ఆన్ రోడ్ అనే రేట్లతో ఇప్పటికీ వినియోగదారులు కుస్తీలు పడుతూనే ఉంటారు. పోనీ ఒకసారి కట్టే పన్నే కదా అనుకుంటే, ఆ తర్వాత వాహనాలు ఎప్పుడు బయటకు తీసినా టోల్ ట్యాక్స్ రూపంలో జేబుకి చిల్లు పడుతూనే ఉంటుంది. కార్లు మొదలుకొని నాలుగు చక్రాల వాహనాలు, ఆ పై వాహనాలన్నిటికీ టోల్ కట్టాల్సిందే. ఇకపై ఇది టూవీలర్లకు కూడా వర్తిస్తుందంటూ వార్తలొస్తున్నాయి. ఇప్పటి వరకు టూవీలర్లకు టోల్ చార్జీలు లేకుండానే హైవేలపైకి అనుమతిస్తున్నారు. జులై-15నుంచి టూవీలర్లకు కూడా టోల్ చార్జీలు వసూలు చేస్తారని అంటున్నారు. ఇప్పటి వరకు ఫ్రీ పాస్ లాగా వాహనాలను హైవేలపైకి అనుమతిచ్చారని, ఇకపై అది జరగదని చెబుతున్నారు.
ప్రభుత్వం ఏమంటోంది..?
టూవీలర్ల టోల్ చార్జీ వార్తలపై ప్రభుత్వం అధికారికంగా స్పందించలేదు. అలాగని ఈ వార్తల్ని కొట్టిపారేలయలేదు. వాస్తవంగా టోల్ చార్జీల మోత మోగించే ముందు ఇలాంటి లీకులివ్వడం ప్రభుత్వాలకు, నాయకులకు అలవాటే. ఆ క్రమంలోనే ఈ వార్తలు బయటకొచ్చాయని అనుమానిస్తున్నారు వాహనదారులు. టూవీలర్లకే కాదు, ఆటోలు, వ్యవసాయ పనులకు ఉపయోగించుకునే ట్రాక్టర్ల వంటి వాహనాలకు టోల్ చార్జీల మినహాయింపు ఉంది. మరి బైక్ లకు మాత్రమే టోల్ వసూలు చేస్తే ఆటోలు కూడా ఆ పరిధిలోకి వస్తాయా లేదా అనేది తేలాల్సి ఉంది. ఆటోలకు కూడా టోల్ వసూలు చేస్తే, ప్రయాణాలు మరింత భారం అవుతాయి. అసలు టూవీలర్ టోల్ చార్జీలపైనే ప్రజలు పెద్ద ఎత్తున మండిపడే అవకాశం ఉంది. ప్రభుత్వాలకు కూడా అది మంచిది కాదు. సామాన్యులపై భారం మోపే ఇలాంటి నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందో లేదో చూడాలి. అదే నిజమైతే టోల్ చార్జీల మోతపై ప్రతిపక్షాలు ఆందోళనలు తీవ్రతరం చేసే అవకాశం ఉంది.
ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకే ప్రభుత్వం టూవీలర్లపై కూడా టోల్ మోత మోగిస్తోందనే వాదన కూడా వినపడుతోంది. అంటే ఎలక్ట్రిక్ టూవీలర్లకు టోల్ మినహాయింపు ఉంటుందేమో చూడాలి. అదే నిజమైతే, మరి ఎలక్ట్రిక్ కార్ల సంగతేంటి అనే ప్రశ్న కూడా వినపడుతోంది. హఠాత్తుగా జులై-15నుంచి బైక్ లకు కూడా టోల్ కట్టాల్సిందేనంటూ ప్రభుత్వం ప్రకటిస్తే అది మరింత సంచలనం కాక మానదు. ప్రభుత్వం అధికారికంగా ప్రకటించే వరకు ఈ వార్తల్ని వట్టి పుకార్లుగానే చూడాలి.