YouTuber Shankar: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందే అక్కడి వాతావరణం హీటెక్కింది. అధికార పార్టీపై కొందరు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా చెన్నైలో యూట్యూబర్ సవుక్కు శంకర్ నివాసంలో కొందరు బీభత్సం సృష్టించారు. కార్పొరేషన్ పారిశుధ్య కార్మికుల వేషాలతో ఆయన ఇంట్లోకి కొందరు చొరబడ్డారు. తమతో తీసికొచ్చిన బురద, పేడ నీళ్లు చల్లి నానా హంగామా చేశారు.
అసలేం జరిగింది?
యూట్యూబర్ శంకర్ వెల్లడించిన సమాచారం మేరకు.. దాదాపు 50 మంది ఉదయం తొమ్మిదిన్నర గంటలకు తన ఇంటిలో చొరబడినట్టు చెప్పారు. ఈ ఘటన సమయంలో ఆయన తల్లి మాత్రమే ఇంటిలో ఒంటరిగా ఉన్నారు. అయితే ఆయా వ్యక్తులు పడక గది, వంట గదిలో బురద నీళ్లను, పేడ నీళ్లను చల్లి వస్తువులను చెల్లా చెదురుగా పడేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కొన్ని వస్తువులను డ్యామేజ్ చేశారు.
ఈ విషయం తెలియగానే శంకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆయన ఇంటికి వెళ్లే లోపు అక్కడి నుంచి దుండగులు పారిపోయారు. సవుక్కు శంకర్ ఇటీవల పారిశుధ్య కార్మికులను కించపరిచేలా తీవ్ర విమర్శలు చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వ్యవహారంపై పారిశుధ్య కార్మికులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు కూడా. ఆ క్రమంలో తన ఇంటిపై పారిశుధ్య కార్మికులు దాడి చేశారని అంటున్నారు శంకర్.
ఈ ఘటన వెనుక నగర పోలీసు కమిషనర్ ప్రమేయం ఉన్నారన్నది శంకర్ ప్రధాన ఆరోపణ. ఈ ఘటనపై తమిళనాడు సీఐడీ విభాగం దర్యాప్తు మొదలుపెట్టింది. బీభత్సానికి పాల్పడిన వారంతా అక్కడికి వెళ్లిన జర్నలిస్టులను సైతం బెదిరించారని అంటున్నారు.
ALSO READ: లోక్‌సభలో సవరించిన ఆర్థిక బిల్లు-2025కు ఆమోదం.. డిజిటల్, గూగుల్ పన్ను రద్దు
ఈ ఘటనపై అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైలు తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటన వెనుక సూత్రధారులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. తమిళగవెట్రి కళగం ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్, శంకర్ నివాసంలో జరిగిన బీభత్సాన్ని ఖండిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు.
ఆ స్కీమ్‌లో అవకతవకలు
ఇదంతా ఒక వెర్షన్.. మరోవైపు గమనిస్తే.. గతేడాది మురుగునీటి యంత్రాలు పంపిణీలో జరిగిన అవకతవకలను యూట్యూబర్ శంకర్ బయటపెట్టారు. ఈ పథకాన్ని కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు రెండు స్పాన్సర్ చేస్తున్నాయి. దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారికి, పేద పారిశుధ్య కార్మికులకు ఉద్దేశించబడింది. ప్రభుత్వ పథకం పేద దళితులు, దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారికి మాత్రమే.
130 మంది లబ్ధిదారులు దారిద్య్ర రేఖకు ఎగువన ఉన్నవారికి ఇచ్చారన్నది శంకర్ వెర్షన్. తాను ఈ కుంభకోణాన్ని బయట పెట్టిన తర్వాత చెన్నై నగర పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కుంభకోణాన్ని బయట పెట్టినందుకు తనపై ఈ విధంగా చేశారని అంటున్నారు.
తనపై కేసుకు బదులు ఈ విధంగా వ్యవహరించారని అంటున్నారు. దీని వెనుక టిఎన్‌సిసి అధ్యక్షుడు సెల్వ పెరుంతగైని నేరుగా అభియోగం మోపుతున్నానని అన్నారు. శంకర్ వ్యవహారంపై రాజకీయంగా ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.
என் வீட்டில் கழிவுகளை கொட்டும் சிசிடிவி காட்சி. pic.twitter.com/ZZQ6GpLBIR
— Savukku Shankar (@SavukkuOfficial) March 24, 2025