Zelenskyy: నాటో సభ్యదేశం పోలండ్ లో పడిన క్షిపణి ఎక్కడ నుంచి ప్రయోగించారో ఇంకా తేలలేదు. ఉక్రెయిన్ సరిహద్దుల్లోని షెవాడో గ్రామంలో జరిగిన క్షిపణి దాడిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ స్పందించారు. ఆ క్షిపణిని ఉక్రెయిన్ ప్రయోగించలేదని స్పష్టం చేశారు.
ఇండోనేషియాలోని బాలి వేదికగా జి-20 దేశాల సదస్సు జరుగుతున్నసమయంలో ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణి దాడులు చేస్తోంది. అదే సమయంలోనే ఉక్రెయిన్ సరిహద్దు దేశం పోలండ్ శివారులోని షెవాడో గ్రామంపై ఓ క్షిపణి పడింది. ఈ ఘటనలో ఇద్దరు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఇది రష్యా ప్రయోగించిన క్షిపణే అని తొలుత ప్రచారం జరిగింది. ఆ క్షిపణి రష్యా నుంచి ప్రయోగించలేదని తర్వాత నిర్ధారణ అయ్యింది. దీనిపై రష్యా దాడులకు ప్రతిగా ఉక్రెయిన్ ప్రయోగించిన క్షిపణి తమ భూభాగంలో పడిందని పోలండ్ అధ్యక్షుడు ఆండ్రెజ్ ప్రకటించారు.
పోలండ్ అధ్యక్షుడి ప్రకటన తర్వాత నాటో చీఫ్ జెన్స్ స్టోలెన్‌బర్గ్ ఉక్రెయిన్‌పై విమర్శలు చేశారు. కీవ్ ఎయిర్ డిఫెన్స్ క్షిపణుల వల్లే పోలండ్ ఘటన జరిగిందని తెలిపారు. నాటో చీఫ్ ప్రకటనను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఖండించారు. అది తమ దేశం ప్రయోగించిన క్షిపణి కాదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని టాప్ కమాండర్లు స్పష్టంగా చెప్పారని ప్రకటించారు. ఉక్రెయిన్‌ను నిందించడం సరికాదన్నారు. నిజానిజాలను తెలుసుకునేందుకు క్షిపణి పేలిన ప్రాంతంలో దర్యాప్తు జరిపేందుకు ఉక్రెయిన్ అధికారులకు అనుమతినివ్వాలని జెలెన్‌స్కీ కోరారు. అయితే పోలండ్‌లో పడిన క్షిపణి సోవియట్ కాలం నాటిదని తేలింది.