Chandrababu : ఆంధ్రప్రదేశ్ లో అవినీతి పెరిగిపోయిందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మరోసారి విమర్శించారు. కర్నూలు జిల్లాలో రెండోరోజు పర్యటిస్తున్న టీడీపీ అధినేత రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా ఆగిపోయిందన్నారు. ఆదోనిలో నిర్వహించిన రోడ్‌షోలో వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఏపీ బాగుపడాలంటే టీడీపీకి మళ్లీ అధికారం రావాలని స్పష్టం చేశారు.
ఇదేం ప్రభుత్వం
వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వ విధానాలపై చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. చెత్త పైనా పన్ను వేసిందని మండిపడ్డారు. ఎవరైనా ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఇసుక దొరకడంలేదన్నారు. ప్రభుత్వం నాసిరకం మద్యం విక్రయిస్తూ పేదల ప్రాణాలతో చెలగాటమాడుతోందన్నారు. రాష్ట్రంలో ఇసుక, మద్యం దందాలు పెరిగిపోయాయని ఆరోపించారు. వైఎస్ఆర్ సీపీ నేతలు భూములను కబ్జాలు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.
ఎవరికీ భయపడను
ఏపీని నేర రాష్ట్రంగా చేయడానికి ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. ఏపీలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. తనను భయపెట్టాలని చూస్తున్నారని కానీ ప్రజలకు తప్ప ఎవరకీ భయపడనని స్పష్టం చేశారు.
టీడీపీతోనే అభివృద్ధి
వైఎస్ఆర్ సీపీ పాలనలో నిరుద్యోగులు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని చంద్రబాబు ఆరోపించారు. నిరుద్యోగులకు తాను ఐటీ ఆయుధాన్ని ఇచ్చానని తెలిపారు. సంపద సృష్టించానని చెప్పారు. వైఎస్ఆర్ సీపీ పాలనలో పెట్టుబడిదారులు భయపడే పరిస్థితిని తీసుకొచ్చారని చంద్రబాబు మండిపడ్డారు.