OTT Movie: ఇప్పుడు మలయాళం సినిమాల హవా నడుస్తోంది. రీసెంట్ గా రిలీజ్ అయిన అన్ని సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలను సింపుల్ గా, సోది లేకుండా తెరకెక్కించడంలో మలయాళం దర్శకులు ఒక అడుగు ముందు ఉన్నారు. ఇప్పుడు చెప్పుకోబోయే క్రైమ్ థ్రిల్లర్ మూవీ, ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చుట్టూ తిరుగుతుంది. చివరి వరకు ఈ మూవీ సస్పెన్స్ తో పిచ్చెక్కిస్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
జియో హాట్ స్టార్ (Jio hotstar) లో
ఈ మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘అబ్రహం ఓజ్లర్’ (Abraham Ozler). 2024లో విడుదలైన ఈ మలయాళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ కి మిధున్ మాన్యువల్ థామస్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో జయరామ్, ముమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించగా, అనస్వర రాజన్, అర్జున్ అశోకన్, సైజు కురుప్ వంటి నటులు సహాయక పాత్రల్లో నటించారు.ఈ సినిమా ఒక అనుభవజ్ఞుడైన పోలీసు అధికారి అయిన అబ్రహం ఓజ్లర్ చుట్టూ తిరుగుతుంది. అతను ఒక సీరియల్ కిల్లర్‌ను పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఈ మూవీ జియో హాట్ స్టార్ (Jio hotstar) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
అబ్రహం ఓజ్లర్ ఒక అనుభవజ్ఞుడైన పోలీసు అధికారి. అతను తన భార్య అనీషా, కుమార్తె జెన్నీతో సెలవుల్లో గడుపుతూ ఉంటాడు. ఈ సమయంలో అతనికి ఒక డబుల్ మర్డర్ కేసు గురించి కాల్ వస్తుంది. దానిని విచారించడానికి అతను డ్యూటికి వెళ్తాడు. కానీ ఆ కాల్ నకిలీదని తెలుసుకుని, తిరిగి ఇంటికి వచ్చేసరికి అతని భార్య, కుమార్తె అదృశ్యమవుతారు. తర్వాత వినీత్ అనే డ్రగ్ అడిక్ట్, ఓజ్లర్ మీద పగతో వారిని కిడ్నాప్ చేసి, హత్య చేసి, శరీర భాగాలను అడవిలో పాతిపెట్టినట్లు ఒప్పుకుంటాడు. అయితే, అతను డ్రగ్స్ ప్రభావంలో ఉండటం వల్ల ఆ శరీర భాగాలు ఎక్కడ పాతిపెట్టాడో గుర్తు లేదని చెబుతాడు. ఈ ఘటన ఓజ్లర్‌ను తీవ్రమైన డిప్రెషన్ కు తీసుకెళ్తుంది. అతడు నిద్రలేని రాత్రులు గడుపుతాడు. కొంత కాలం తర్వాత, ఓజ్లర్ ఒక కొత్త కేసును చేపడతాడు. అది ఒక IT ఉద్యోగి హత్య కేసు. ఈ హత్య ఒక సీరియల్ కిల్లర్ చేసినట్లు తెలుస్తుంది. అతను బర్త్‌డే కిల్లర్ గా పిలవబడతాడు. ఎందుకంటే అతను బాధితులను వారి పుట్టినరోజున హత్య చేసి, కొన్ని గుర్తులను కూడా వదిలి వెళతాడు.
ఓజ్లర్ తన బృందంతో కలిసి ఈ కేసును విచారించడం ప్రారంభిస్తాడు. విచారణలో ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులు కృష్ణదాస్, అలెగ్జాండర్ బయటపడతారు. ఈ విచారణలో 1980 లలో కోజికోడ్ మెడికల్ కాలేజీలో జరిగిన ఒక బ్యాక్‌స్టోరీ వెలుగులోకి వస్తుంది. అలెగ్జాండర్ ఒక ప్రతిభావంతుడైన సర్జన్. తన సహచరులైన డాక్టర్ శివకుమార్, సెల్వరాజ్, మరియు డాక్టర్ జావీలవల్ల దెబ్బతింటాడు. అతని ప్రేమికురాలు సుజా ఆత్మహత్య చేసుకోవడంతో అలెగ్జాండర్ ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. అతను తన శత్రువులను ఒక్కొక్కరిని హత్య చేస్తూ సీరియల్ కిల్లర్‌గా మారతాడు. చివరికి ఓజ్లర్ అలెగ్జాండర్‌ను అరెస్ట్ చేస్తాడా? తన భార్య, కుమార్తె శరీరాలను ఎక్కడ పాతిపెట్టాడో తెలుసుకుంటాడా ?ఈ విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే ఈ మూవీని చూడండి.