Action Thriller on OTT: ఓ తల్లి జీవితంలో అత్యంత భయంకరమైన పరిస్థితి ఏదైనా ఉందంటే… తన కళ్ల ముందే తన కూతురు కనిపించకుండా పోవడమే. నాలుగేళ్ల చిన్నారిని మాజీ భర్త తనకు తెలియకుండా కిడ్నాప్ చేసి ఏకంగా మరో దేశానికి తీసుకెళ్లిపోతే ? పోలీసులను ఆశ్రయించినా, చట్టపరంగా పోరాడినా ఫలితం లేకపోతే ? పదేళ్లకు పైగా కూతురి కోసం ఎదురుచూసిన ఆ తల్లి చివరికి చట్టాన్ని పక్కనపెట్టి ప్రమాదకరమైన మిషన్‌కు సిద్ధమైతే ? తన కూతురిని తిరిగి తీసుకురావడానికి ఓ మాజీ మెరైన్ సహాయం తీసుకుంటే ? ఇలాంటి నిజ జీవిత ఘటనల స్ఫూర్తితో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ‘స్టోలెన్ గర్ల్’ (Stolen Girl). మరి తన కూతురి కోసం ఆ తల్లి ఎలాంటి సాహసం చేసింది అనే కథపై ఓ లుక్కేద్దాం పదండి.
మౌరీన్ డ్యానింగ్ ఓ ఒంటరి తల్లి. తన నాలుగేళ్ల కూతురు అమీనా అంటే ఆమెకు ప్రాణం. కూతురితో కలిసి సాధారణ జీవితాన్ని గడుపుతున్న ఆమెకు ఓ రోజు మాజీ భర్త కరీమ్ తన కూతురిని చూసేందుకు వస్తాడు. కానీ ఆ ఘటన మౌరీన్ జీవితాన్నే మార్చేస్తుంది. కరీమ్ ఎవరికీ తెలియకుండా అమీనాను కిడ్నాప్ చేసి అమెరికా నుంచి లెబనాన్‌కు తీసుకెళ్లిపోతాడు. కూతురు కనిపించకుండా పోయిందని తెలుసుకున్న మౌరీన్ షాక్‌కు గురవుతుంది. వెంటనే ఆమె పోలీసులను, ప్రభుత్వ అధికారులను ఆశ్రయిస్తుంది.
కానీ సమస్య అంత సులభంగా పరిష్కారం కాదు. అంతర్జాతీయ చట్టాలు, దేశాల మధ్య న్యాయపరమైన చిక్కులు, అధికార వ్యవస్థలోని పరిమితుల కారణంగా మౌరీన్ చేసే ప్రయత్నాలు ఒక్కొక్కటిగా విఫలమవుతాయి. రోజులు, నెలలు గడుస్తాయి. చివరికి సంవత్సరాలు గడిచినా తన కూతురు తిరిగి రాదు. దాదాపు పదేళ్లకు పైగా మౌరీన్ తన కూతురి కోసం ఎదురుచూస్తూనే ఉంటుంది. కానీ తల్లి ప్రేమ, కూతురిని తిరిగి తీసుకురావలన్న ఆశ మాత్రం తగ్గదు.
చివరికి చట్టపరమైన మార్గాలపై నమ్మకం కోల్పోయిన మౌరీన్ ఓ సంచలన నిర్ణయం తీసుకుంటుంది. కిడ్నాప్‌కు గురైన పిల్లలను రక్షించడంలో అనుభవం ఉన్న మాజీ యూఎస్ మెరైన్ రోబేసన్‌ను కలుస్తుంది. ఇద్దరూ కలిసి అమీనాను తిరిగి తీసుకురావడానికి లెబనాన్‌కు వెళ్లాలని నిర్ణయించుకుంటారు. అక్కడి నుంచి సినిమా పూర్తిగా యాక్షన్ మోడ్‌లోకి వెళ్తుంది. బీరుట్‌లో అడుగుపెట్టిన మౌరీన్‌కు కూతురిని వెతకడం అంత సులభం కాదని అర్థమవుతుంది.
అంతర్జాతీయ నేరాలు, అవినీతి, గూఢచర్యం, ప్రమాదకరమైన వ్యక్తులు… ఒక్కో అడుగు ఆమెను మరింత ప్రమాదంలోకి నెడతాయి. ఇంతకీ అమీనా ఎక్కడ ఉంది? ఇన్నేళ్ల తర్వాత తల్లీకూతుళ్లు కలుసుకున్నారా? రోబేసన్ సహాయంతో మౌరీన్ తన కూతురిని సురక్షితంగా బయటకు తీసుకురాగలిగిందా? ఈ రెస్క్యూ మిషన్‌లో బయటపడే రహస్యాలేంటి? అనేది తెలియాలంటే సినిమాను చూడాల్సిందే.
కూతురి కోసం ఓ తల్లి పదేళ్లకు పైగా ఎదురుచూసి… చివరికి తనే రంగంలోకి దిగి దేశం దాటి వెళ్లే కథే ‘స్టోలెన్ గర్ల్’. ఎమోషన్‌తో పాటు యాక్షన్, రెస్క్యూ మిషన్స్, అంతర్జాతీయ క్రైమ్ వంటి అంశాలు సినిమాలో ఆసక్తికరంగా ఉంటాయి. ఇందులో తల్లి ప్రేమ, ఎమోషన్‌తో పాటు యాక్షన్, సస్పెన్స్‌కు ప్రాధాన్యం ఇచ్చారు. ముఖ్యంగా కూతురిని తిరిగి పొందేందుకు మౌరీన్ చేసే పోరాటం హార్ట్ టచింగ్ గా ఉంటుంది. కేట్ బెకిన్‌సేల్, స్కాట్ ఈస్ట్‌వుడ్ తమ పాత్రల్లో ఆకట్టుకుంటారు. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime video)లో తెలుగు, హిందీ, తమిళం, ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులో ఉంది.
Read Also: 30 ఏళ్ల క్రితం మాయమైన పడవ రిటర్న్… దానితో పాటు వచ్చే టైమ్ ట్రావెల్ మిస్టరీ… చివరికి ఊహించని ట్విస్ట్